Hyderabad: పాన్ మసాలా కాదు.. డ్రగ్స్!
ABN , Publish Date - Jan 08 , 2026 | 07:21 AM
పాన్ మసాల మాటున డ్రగ్స్ విక్రయిస్తున్న విషయం బట్టబయలైంది. ఈగల్ ఫోర్స్, పోలీసులు పట్టుకున్నారు. బతుకుదెరువు కోసం హైదరాబాద్ కు వచ్చి ఈ డ్రగ్స్ విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
- నెల రోజులుగా నిఘా.. పెడ్లర్ పట్టివేత
- 15 లక్షల విలువైన మాదకద్రవ్యాల సీజ్
హైదరాబాద్ సిటీ: నెల రోజుల నిఘాతో భారీగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న పెడ్లర్‌ను బుధవారం ఈగల్ ఫోర్స్, పోలీసులు(Eagle Force, Police) పట్టుకున్నారు. రూ.లక్షల విలువైన మాదకద్రవ్యాలు సీజ్ చేశారు. పాన్‌మసాలా మాటున వాటిని విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ప్రధాన డీలర్స్ పరారీలో ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్(Rajasthan), ఇతర ఉత్తరాది రాష్ట్రాల నుంచి జీవనోపాధి కోసం హైదరాబాద్(Hyderabad)కు వలసొచ్చిన కొంత మంది కళాకారులు మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డారు.
ఎండీఎంఏ, నల్లమందు వంటి ప్రమాదకరమైన మత్తు పదార్థాలను పాన్ మసాలాలలో కలుపుకొని సేవిస్తున్నారు. సొంతూళ్లకు వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు తమతో పాటు భారీ మొత్తంలో ఈ డ్రగ్స్‌ను తీసుకు వచ్చి, తోటి రాజస్థానీ కార్మికులకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వ్యవహారం జరుగుతున్నట్లు పక్కా సమాచారంతో ఈగల్ ఫోర్స్, స్థానిక పోలీసులను అప్రమత్తం చేసింది. నెల రోజులుగా ఈ బృందాలు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పర్యవేక్షించాయి. ఈ క్రమంలో నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో కీలక నిందితుడు పట్టుబడ్డాడు.

రూ. 15లక్షల విలువైన డ్రగ్స్‌ను సీజ్ చేశారు. నిందితుడు రాజేందర్ 8వ తరగతి మధ్యలోనే మానేసి హైదరాబాద్ వచ్చి కార్పెంటర్, ఇంటీరియర్ డిజైనర్‌గా స్థిరపడ్డాడు. మత్తుకు బానిసైన అతను, రాజస్థాన్.. నాగౌర్ జిల్లాకు చెందిన సప్లయర్లు ధన్‌రాజ్, అనిల్, ముఖేష్ ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి నగరానికి తెచ్చేవాడు. ఇక్కడ గ్రాముకు రూ. 5 వేలు చొప్పున విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రధాన సప్లయర్లు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ డ్రగ్స్‌ను కొనుగోలు చేస్తున్న పలువురు వినియోగ దారులను గుర్తించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జనార్దనరావుతో చాలా ఏళ్లుగా స్నేహం
ప్రత్యేక సర్వీసుల్లో అదనపు చార్జీలు ఉండవు: ఆర్టీసీ
Read Latest Telangana News and National News