Fake Liquor Case: జనార్దనరావుతో చాలా ఏళ్లుగా స్నేహం
ABN , Publish Date - Jan 08 , 2026 | 06:32 AM
అద్దేపల్లె జనార్దనరావుతో చాలా ఏళ్లుగా స్నేహం ఉంది. ములకలచెరువుతో పాటు ఇబ్రహీంపట్నంలో తయారు చేసిన నకిలీ మద్యం సీసాలకు అంటించిన లేబుళ్లు సమకూర్చడంలో...
నకిలీ మద్యం సీసాలకు లేబుళ్లను సమకూర్చా
కస్టడీ విచారణలో నిందితుడు నకిరికంటి రవి వెల్లడి
అద్దేపల్లికి ప్లాస్టిక్ సీసాలు సరఫరా చేశా
మరో నిందితుడు శ్రీనివాసులురెడ్డి వాంగ్మూలం
అన్నమయ్య/ ములకలచెరువు, జనవరి 7(ఆంధ్రజ్యోతి): ‘‘అద్దేపల్లె జనార్దనరావుతో చాలా ఏళ్లుగా స్నేహం ఉంది. ములకలచెరువుతో పాటు ఇబ్రహీంపట్నంలో తయారు చేసిన నకిలీ మద్యం సీసాలకు అంటించిన లేబుళ్లు సమకూర్చడంలో కీలక ప్రాత పోషించా’’ అని ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక నిందితుడైన నకిరికంటి రవి వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో నిందితులైన రవి(ఏ16), ఎన్టీఆర్ జిల్లా గన్నవరం మండలం సూరంపల్లెకు చెందిన శ్రీనివాసులు రెడ్డి(ఏ23)ను రెండు రోజుల కస్టడీకి అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె కోర్టు అనుమతించింది. దీంతో మదనపల్లె సబ్‌జైల్లో ఉన్న నిందితులను బుధవారం ఉదయం కస్టడీకి తీసుకున్న ఎక్సైజ్ పోలీసులు వారికి జిల్లా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం మదనపల్లె ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు. ఇద్దరినీ కలిపి, వేర్వేరుగా విచారించారు. నకిలీ మద్యం బాటిళ్ల లేబుళ్లతో పాటు మూతలు, ఇతర సామగ్రిని సమకూర్చడానికి జనార్దనరావుకు హైదరాబాద్‌లో పలువురిని పరిచయం చేశానని రవి చెప్పినట్లు సమాచారం. ‘‘ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో పేపర్ మిల్లు నడుపుతూ నష్టాలు రావడంతో హైదరాబాద్‌కు మకాం మార్చా. ఆర్థిక ఇబ్బందులు తీరేందుకు జనార్దనరావు(ఏ1) ఎంతో సాయం చేశాడు. 2023లో ఆయనతో కలిసి గోవాకు వెళ్లి బాలాజీ(ఏ15)ని కలిశాం. ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ కేంద్రంపై దాడి చేసిన రోజున జనార్దనరావు పాటు ఆఫ్రికా ఖండంలోని అంగోలా దేశంలో ఉన్నా’’ అని ఆయన వెల్లడించినట్లు తెలిసింది. కాగా, ప్లాస్టిక్ వస్తువుల తయారీ పరిశ్రమ నిర్వహిస్తూ జనార్దనరావుకు ప్లాస్టిక్ సీసాలను సరఫరా చేశానని మరో నిందితుడు శ్రీనివాసులురెడ్డి చెప్పినట్లు సమాచారం.