MP Woman Gets Life term: తన ఎఫైర్ గురించి తెలిసిందని బాలుడి హత్య! మూల్యం చెల్లించుకున్న తల్లి
ABN , Publish Date - Jan 19 , 2026 | 01:20 PM
తన ఎఫైర్ గురించి బయటపెట్టేస్తాడన్న భయంతో కన్న బిడ్డను హత్య చేసిన ఓ మహిళకు కోర్టు తాజాగా యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మధ్యప్రదేశ్‌లో ఈ ఘటన వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: అమ్మతనానికే మచ్చ తెచ్చిన ఓ మహిళ చివరకు భారీ మూల్యం చెల్లించుకుంది. ఐదేళ్ల బాలుడిని హత్య చేసినందుకు అతడి తల్లికి కోర్టు తాజాగా యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసిన ఈ కేసు పూర్తి వివరాల్లోకి వెళితే (MP Woman Kills Son, Gets Lifeterm)..
గ్వాలియర్‌కు చెందిన జ్యోతి రాథోడ్‌కు భర్త ధ్యాన్ సింగ్ రాథోడ్, కుమారుడు జతిన్ (5) ఉన్నారు. జ్యోతి భర్త కానిస్టేబుల్. అయితే, కొంతకాలం క్రితం ఆమెకు తన పొరుగింటి వ్యక్తి ఉదయ్ ఇండోలియాతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఒక రోజు జ్యోతి, ఉదయ్ సన్నిహితంగా ఉన్న సమయంలో చిన్నారి జతిన్ కంటపడ్డారు. కొడుకు తన విషయాన్ని భర్తకు చెబుతాడేమోనని భయపడ్డ జ్యోతి జతిన్‌ను 2023 ఏప్రిల్ 28న రెండో అంతస్తు నుంచి కిందకు తోసేసింది. 24 గంటల పాటు మృత్యువుతో పోరాడిన చిన్నారి చివరకు కన్నుమూశాడు. తన కుమారుడు ప్రమాదవశాత్తూ కిందపడి చనిపోయాడని ఆమె తొలుత అందరికీ చెప్పింది.
అయితే, ధ్యాన్ సింగ్‌కు అంతకుముందే జ్యోతిపై అనుమానం ఉండేది. బిడ్డ మృతి తరువాత భార్య ప్రవర్తనలో మార్పు చూశాక అది మరింత బలపడింది. ఈ క్రమంలో ధ్యాన్ సింగ్ రంగంలోకి దిగాడు. కొడుకును తానే చంపినట్టుగా జ్యోతి చెబుతున్న కొన్ని ఆడియో, వీడియో సాక్ష్యాలను సంపాదించాడు. వీటి ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో పోలీసులు జ్యోతితో పాటు ఆమె లవర్‌పై కూడా కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం జ్యోతిని దోషిగా తేల్చిన కోర్టు ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఉదయ్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేనందున అతడిని విడిచిపెట్టింది.
ఇవీ చదవండి:
గాఢ నిద్రలో ఉన్న వృద్ధురాలిని నిద్రలేపిన దొంగలు.. ఆ తరువాత..
లాటరీ విజేతకు షాక్.. రూ.1 కోటి విలువైన లాటరీ టిక్కెట్‌ను విక్రయించబోతే..