Share News

Gujarat Theft: గాఢ నిద్రలో ఉన్న వృద్ధురాలిని నిద్రలేపిన దొంగలు.. ఆ తరువాత..

ABN , Publish Date - Jan 17 , 2026 | 03:40 PM

వృద్ధురాలి ఇంట్లోకి చోరీకి వచ్చిన దొంగలు ఆమె అనుమతితోనే చేతులూ కాళ్లు కట్టేసి సైలెంట్‌గా డబ్బు దోచుకుపోయారు. గుజరాత్‌లోని ఖేడా జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది.

Gujarat Theft: గాఢ నిద్రలో ఉన్న వృద్ధురాలిని నిద్రలేపిన దొంగలు.. ఆ తరువాత..
Robbery in Kheda District, Gujarat

ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్‌లో ఆశ్చర్యకర ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు దొంగలు ఓ వృద్ధురాలిని ఆమె అనుమతి తీసుకుని మరీ బంధించి చోరీకి తెగబడ్డారు. ఖేడా జిల్లా సెవేలియా గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది (Elderly Woman Robbed in Gujarat).

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఎమ్‌డీ బంగ్లో సొసైటీలోని ఓ భవనంలో వృద్ధురాలు ఒంటరిగా ఉంటున్నారు. ఔట్‌హౌస్‌లో వాచ్‌మెన్ ఉంటున్నాడు. ఈ క్రమంలో నలుగురు దొంగలు జనవరి 10న రాత్రి 11 గంటల సమయంలో చడీచప్పుడు లేకుండా ఆమె ఇంట్లోకి ప్రవేశించారు. అప్పటికే వృద్ధురాలు గాఢ నిద్రలో ఉన్నారు. వృద్ధురాలిని సమీపించిన దొంగలు ఆమెను నిద్రలేపారు. కళ్లు తెరిచిన ఆమె ఎదురుగా వారు కనిపించగానే షాకయిపోయారు. వెంటనే ఆమె నోరు మూసేసిన ఓ దొంగ అరవొద్దని ఆమెకు సైగ చేశాడు. ఆ తరువాత వృద్ధురాలి చేతులు, కాళ్లు కట్టేసేందుకు అనుమతించాలని ఆమెను కోరారు. అప్పటికే భయంతో ఉన్న బాధితురాలు సరేనని అన్నారు. దీంతో, వారు వృద్ధురాలి దుపట్టాతో ఆమె చేతులు, కాళ్లు కట్టేశారు. అరచిగోల చేయొద్దని వృద్ధురాలికి మరోసారి మర్యాదగా చెప్పి ఇంట్లోని వస్తువులను దోచుకున్నారు.


డబ్బు, నగలు ఇంట్లో ఎక్కడున్నాయని వారు తొలుత అడగడంతో వృద్ధురాలు ఓ కప్‌బోర్డు వైపు చూపించారు. తాళం చెవులు ఎక్కడున్నదీ కూడా చెప్పారు. కప్‌బోర్డులో రోజువారి ఖర్చుల కోసం ఆమె దాచుకున్న రూ.15 వేలను దొంగలు తీసేసుకున్నారు. నగలు ఉన్నాయా? అని దొంగలు అడిగితే ఆమె లేదని సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో వృద్ధురాలి వేలికున్న ఉంగరాన్ని చూసిన ఓ దొంగ దాన్ని తీసివ్వమని చెప్పాడు. దీంతో, వృద్ధురాలు వారు చెప్పినట్టే చేశారు. ఆ తరువాత కూడా ఇల్లంతా వెతికినా కూడా దొంగలకు విలువైన వస్తువులు, నగలు ఏమీ కనిపించలేదు. చివరకు వారు వృద్ధురాలి చేతులకు కట్టిన కట్లను విప్పేశారు. అరచి గోల చేయొద్దని మరోమారు హెచ్చరించారు. దీంతో, ఆమె మౌనంగా ఉండిపోయారు. తాము వెళ్లిపోయాక కాళ్లకు ఉన్న కట్లు విప్పుకోవచ్చని చెప్పి దొంగలు నిష్క్రమించారు.

ఆ తరువాత కొంత సేపటికి షాక్‌ నుంచి తేరుకున్న వృద్ధురాలు తెల్లవారుజామున వాచ్‌మెన్‌కు సమాచారం అందించారు. ఇక డైనింగ్ రూమ్ కిటికీకి ఉన్న దోమతెరను తొలగించి వారు లోపలికి వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. రూ.15 వేల నగదుతోపాటు 4 గ్రాముల బంగారు ఉంగరాన్ని దొంగలు ఎత్తుకుపోయారని చెప్పారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.65 వేలు ఉంటుందని చెప్పారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగల ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.


ఇవీ చదవండి:

లాటరీ విజేతకు షాక్.. రూ.1 కోటి విలువైన లాటరీ టిక్కెట్‌ను విక్రయించబోతే..

అమానుషం.. దుస్తులు పాడు చేసుకుందని చిన్నారిని కొట్టడంతో..

Updated Date - Jan 17 , 2026 | 04:05 PM