Lottery Winner Kidnap: లాటరీ విజేతకు షాక్.. రూ.1 కోటి విలువైన లాటరీ టిక్కెట్‌ను విక్రయించబోతే..
ABN , Publish Date - Jan 16 , 2026 | 03:35 PM
రూ.1 కోటి గెలిచిన ఓ వ్యక్తి లాటరీ టిక్కెట్‌ను కొందరు దోచుకున్న వైనం కేరళలో వెలుగు చూసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మిగతా వారి కోసం గాలిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: లాటరీలో కోటి రూపాయలు గెలిచిన ఓ వ్యక్తిని కొందరు బెదిరించి లాటరీ టిక్కెట్‌ను దోచుకున్న ఉదంతం ప్రస్తుతం కేరళలో కలకలం రేపుతోంది. పెరవూర్‌లో వెలుగు చూసిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పూర్తి వివరాల్లోకి వెళితే, సాదిక్ అనే వ్యక్తి ఇటీవలే కోటి రూపాయల లాటరీ గెలుచుకున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే, లాటరీ డబ్బుపై పన్ను చెల్లించడం ఇష్టం లేని అతడు టిక్కెట్‌ను ఇతరులకు అమ్మి ఎక్కువ మొత్తంలో డబ్బు తీసుకునేందుకు ప్లాన్ వేసినట్టు తెలిపారు. ఈ క్రమంలో సాదిక్‌కు అతడి స్నేహితుడి ద్వారా ఓ గ్యాంగ్‌కు చెందిన వ్యక్తులు పరిచయమైనట్టు తెలిపారు. అతడి టిక్కెట్‌ను కొనుగోలు చేసేందుకు వారు అంగీకరించారని అన్నారు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో సాదిక్ తన స్నేహితుడితో కలిసి గ్యాంగ్ సభ్యుల నుంచి డబ్బు తీసుకునేందుకు పెరవూర్ టౌన్‌కు వెళ్లాడు. అయితే, నిందితులు ఆ ఇద్దరినీ బలవంతంగా కారులో ఎక్కించుకుని తమ వెంట తీసుకెళ్లారు.
కొంత దూరం వెళ్లాక సాదిక్ స్నేహితుడిని విడిచిపెట్టారు. ఆ తరువాత సాదిక్‌ను కారులోనే బెదిరించి అతడి లాటరీ టిక్కెట్‌ను బలవంతంగా తీసుకున్నారు. రాత్రి 11.30 గంటల సమయంలో అతడిని ఓ నిర్మానుష్య ప్రాంతంలో విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో సాదిక్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాదిక్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఫారిస్ అనే మరో వ్యక్తిని కూడా గుర్తించామని, అతడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మిగిలిన నిందితులందరినీ త్వరలో అదుపులోకి తీసుకుంటామని చెప్పారు.
ఇవీ చదవండి:
అమానుషం.. దుస్తులు పాడు చేసుకుందని చిన్నారిని కొట్టడంతో..
మాజీ ఐపీఎస్ భార్యను మోసగించిన సైబర్ కేటుగాళ్లు.. రూ.2.58 కోట్ల మోసం