UP Crime: అమానుషం.. దుస్తులు పాడు చేసుకుందని చిన్నారిని కొట్టడంతో..
ABN , Publish Date - Jan 14 , 2026 | 10:45 PM
యూపీలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. దుస్తులు పాడు చేసుకున్న చిన్నారిపై తల్లిదండ్రులు చేయి చేసుకోవడం బిడ్డ మృతి చెందింది. నిందితులను పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: చిన్నారులన్నాక వీధుల్లో దుమ్మూధూళిలో ఆడటం, దుస్తులను పాడు చేసుకోవడం సహజం. కానీ ఆ తల్లిదండ్రులు మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు. తమ ఆరేళ్ల కూతురు దుస్తులు పాడు చేసుకుందని కోపంతో ఊగిపోయారు. చిన్నారిపై తమ ప్రతాపం చూపించారు. ఫలితంగా చిన్నారి కన్నుమూసింది. యూపీలోని ఘాజియాబాద్‌లో ఈ దారుణం జరిగింది.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, నగరంలోని దస్నా ఏరియాలో ఈ ఘటన జరిగింది. షిషా అనే ఆరేళ్ల చిన్నారి ఆదివారం తన ఇంటి ముందు ఆడుకుంటూ పొరపాటున బురదలో పడి దుస్తులను పాడు చేసుకుంది. పాడైన దుస్తులతో ఇంటికి వచ్చిన ఆమెను చూడగానే తండ్రి అక్రమ్, సవితి తల్లి నిషా తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. చిన్నారిని ఇష్టారీతిన కొట్టారు. చివరకు ఆమెను రాత్రి వేళ చలిలో మేడ మీదే వదిలిపెట్టి వచ్చారు. తెల్లారేసరికల్లా బాలిక విగత జీవిగా మారింది.
ఇరుగుపొరుగు వారు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాలిక శరీరంపై 13 చోట్ల గాయాలు ఉన్నట్టు పోస్టుమార్టం రిపోర్టులో తేలిందని ఏసీపీ తాజాగా తెలిపారు. ఆమె పక్కటెముకలు విరిగాయని చెప్పారు. ఈ క్రమంలో పోలీసులు బుధవారం అక్రమ్, అతడి భార్య నిషాను అదుపులోకి తీసుకున్నారు. అక్రమ్ మొదటి భార్య తరానా మూడేళ్ల క్రితం మరణించింది. అప్పటికే అతడికి ముగ్గురు పిల్లలు కలిగారు. వారిలో షిఫా కూడా ఒకరు. మొదటి భార్య మరణించిన ఏడాదికి అక్రమ్ నిషాను రెండో వివాహం చేసుకున్నాడు.
ఇవీ చదవండి:
అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో..
మాజీ ఐపీఎస్ భార్యను మోసగించిన సైబర్ కేటుగాళ్లు.. రూ.2.58 కోట్ల మోసం