Bengaluru Digital Arrest Scam: మరో డిజిటల్ అరెస్ట్ స్కామ్.. దాదాపు రూ.32 కోట్లు నష్టపోయిన మహిళ
ABN , Publish Date - Nov 17 , 2025 | 03:21 PM
బెంగళూరులో తాజాగా మరో డిజిటల్ అరెస్టు ఉదంతం వెలుగులోకి వచ్చింది. పార్సిల్‌లో నిషేధిత పదార్థులు ఉన్నాయని బెదిరించిన నిందితులు ఏకంగా రూ.31.83 కోట్లను తన నుంచి దోచుకున్నారని బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో మరో భారీ డిజిటల్ అరెస్ట్ స్కామ్ బయటపడింది. సైబర్ నేరగాళ్ల బారిన పడ్డ ఓ బెంగళూరు మహిళ దాదాపు రూ.32 కోట్లు నష్టపోయింది. దాదాపు ఆరు నెలల పాటు నరకం అనుభవించి చివరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది (Digital Arrest Scam).
బాధితురాలి (57) కథనం ప్రకారం, గతేడాది సెప్టెంబర్‌లో ఆమె డిజిటల్ అరెస్టు మోసంలో చిక్కుకుంది. బాధితురాలు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఆమెకు గతేడాది సెప్టెంబర్‌లో (57) ఓ వ్యక్తి ఫోన్ చేసి తాను డీహెచ్ఎల్ పార్సిల్ సర్వీసు ఎగ్జిక్యూటివ్‌నని పరిచయం చేసుకున్నాడు. మహిళ పేరిట తమకు అందిన పార్సిల్‌లో మూడు క్రెడిట్ కార్డులు, నాలుగు పాస్‌పోర్టులు, నిషేధిత ఎమ్‌డీఎమ్ఏ ఉందని తెలిపాడు. కంపెనీకి చెందిన అంధేరీ సెంటర్‌కు పార్సిల్ వచ్చినట్టు చెప్పాడు. దీంతో, కంగారు పడ్డ మహిళ తనకు ఆ పార్సిల్‌తో ఏ సంబంధం లేదని తొలుత చెప్పింది. తాను బెంగళూరులో ఉంటానని, తనకు పార్సిల్ విషయమేమీ తెలియదని పేర్కొంది. అయితే, ఆమె ఫోన్ నెంబర్ పార్సిల్‌కు లింక్ అయ్యి ఉందని నిందితుడు బెదిరించాడు. అది సైబర్‌నేరం కావచ్చని అన్నాడు (Bengaluru Cybercrime).
కాల్‌ను సీబీఐ ఆఫీసర్‌కు బదిలీ చేస్తున్నట్టు చెప్పి మరో వ్యక్తికి ఇచ్చాడు. ఈ క్రమంలో రెండో నిందితుడు మరిన్ని బెదిరింపులకు దిగాడు. నేరంలో ఆమె పాత్రను సూచించే ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చాడు. పోలీసులను సంప్రదించొద్దని, ఆమె ఇంటిపై నిఘా ఉందని హెచ్చరించారు.
మరికొన్ని నెలల్లో తన కుమారుడి పెళ్లి ఉండటంతో భయపడిపోయిన మహిళ నిందితులు చెప్పినట్టు చేసింది. వారి సూచన ప్రకారం, స్కైప్ ఇన్‌స్టాల్ చేసుకుని వీడియో కాల్‌ను నిరంతరంగా కొనసాగించింది. ఈ ఏడాది మే నెలలో స్కైప్ సేవలను మైక్రోసాఫ్ట్ ముగించే వరకూ ఈ మోసం కొనసాగింది.
మోహిత్ హండా అనే వ్యక్తి తొలుత డిజిటల్ అరెస్టు పేరిట ఆమెపై వీడియో కాల్ ద్వారా నిఘా పెట్టాడు. ఆ తరువాత రాహుల్ యాదవ్ అనే వ్యక్తి రంగంలోకి దిగాడు. తాను సీనియర్ సీబీఐ ఆఫీసర్‌నని చెప్పుకున్న మూడో వ్యక్తి ప్రదీప్ సింగ్ మరిన్ని బెదిరింపులకు దిగాడు. ఆమె తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవాలంటూ తీవ్రంగా ఒత్తిడి చేశాడు. ఈ క్రమంలో నిందితులు కోరినట్టుగా ఆమె కోట్ల రూపాయలను ఆన్‌లైన్‌లో బదిలీ చేసింది.
గతేడాది సెప్టెంబర్ 24- అక్టోబర్ 22 తన ఆర్థిక వ్యవహారాల వివరాలను నిందితులకు వెల్లడించింది. ఆ తరువాత అక్టోబర్ 24-నవంబర్ 3 తేదీల మధ్య ష్యూరిటీ మొత్తం కింద రూ.2 కోట్లను బదిలీ చేసింది. ఆ తరువాత పన్నుల కింద మరికొంత మొత్తాన్ని చెల్లించింది. చివరకు సేవింగ్స్, ఫిక్సడ్ డిపాజిట్ ఖాతా సొమ్మును కూడా వారికే ఇచ్చింది. మొత్తం 187 ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్‌లో రూ.31.83 కోట్లను నిందితులకు బదిలీ చేసింది. 2025 ఫిబ్రవరి కల్లా ఈ డబ్బుకు సంబంధించిన వెరిఫికేషన్ పూర్తి చేసి తిరిగిచ్చేస్తామని నిందితులు ఆమెను నమ్మించారు. ఆమె కొడుకు పెళ్లికి ముందే క్లియరెన్స్ లెటర్ కూడా ఇస్తామని చెప్పి ఆ మేరకు ఓ ఫేక్ లెటర్‌ను కూడా పంపించారు.
మరోవైపు, నిరంతర నిఘా కారణంగా మహిళ ఆరోగ్యం దెబ్బతిని ఆసుపత్రిపాలు కావాల్సి వచ్చింది. ఇక డిసెంబర్ తరువాత కూడా నిందితులు మరిన్ని డబ్బులను డిమాండ్ చేశారు. ఆ తరువాత కొన్ని రోజులకు ఆమెకు పూర్తిగా అందుబాటులో లేకుండా పోయారు. జూన్‌లో కుమారుడి పెళ్లి అయిపోవడంతో బాధితురాలు చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, అసలేం జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇవీ చదవండి
క్లాసుకు లేటుగా వచ్చినందుకు 100 గుంజిళ్ల శిక్ష.. బాలిక మృతి
వధువును రాడ్డుతో కొట్టి చంపిన వరుడు.. పెళ్లికి గంట ముందు దారుణం
మరిన్ని క్రైమ్, జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి