100 sit ups- Girl Dies: క్లాసుకు లేటుగా వచ్చినందుకు 100 గుంజిళ్ల శిక్ష.. బాలిక మృతి
ABN , Publish Date - Nov 16 , 2025 | 06:25 PM
మహారాష్ట్రలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. 6వ తరగతి చదివే తన కూతురికి టీచర్ 100 గుంజిళ్లు తీయమని శిక్ష విధించడంతో ఆమె ఆరోగ్యం దెబ్బతిని మరణించిందని బాలిక తల్లి ఆరోపించింది. ఈ ఘటనపై విచారణ జరుగుతున్నట్టు బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలో (Maharastra) తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. క్లాసుకు లేటుగా వచ్చిన 6వ తరగతి విద్యార్థినిని టీచర్ 100 గుంజిళ్లు తీయమని శిక్ష విధించింది. దీంతో, తీవ్ర అనారోగ్యానికి గురయిన చిన్నారి వారం తరువాత మృతి చెందింది. పాల్‌గఢ్ జిల్లాలో ఈ దారుణం జరిగింది (6th Class Girl dies after 100 sit-ups).
స్థానిక మీడియా కథనాల ప్రకారం చిన్నారి వసాయ్‌లోని ఓ ప్రైవేటు స్కూల్లో చదివేది. నవంబర్ 8న బాలిక, మరో నలుగురు స్టూడెంట్స్‌తో కలిసి క్లాసుకు లేటుగా వెళ్లింది. దీంతో, ఆగ్రహానికి గురయిన టీచర్ స్టూడెంట్స్‌కు 100 గుంజిళ్లు తీయమని శిక్ష విధించారు. ఇలా గుంజిళ్లు తీసిన బాలిక ఆ తరువాత అనారోగ్యం బారిన పడింది.
ఆ టీచర్ చాలా అమానవీయ శిక్ష విధించారని బాలిక తల్లి ఆరోపించారు. స్కూలు బ్యాగు వీపునకు తగిలించుకునే గుంజిళ్లు తీయమని టీచర్ చెప్పారని ఆమె ఆరోపించారు. ఆ తరువాత తన కూతురు మెడ, వెన్ను నొప్పితో సతమతమైందని అన్నారు. నొప్పి కారణంగా బాలిక లేవలేకపోయిందని మహారాష్ట్ర నవనిర్మాణ సేన స్థానిక నేత ఒకరు ఆరోపించారు. బాలికకు అంతకుముందే అనారోగ్యం ఉన్నప్పటికీ ఆమెతో టీచర్ కఠినంగా వ్యవహరించిందని అన్నారు.
గుంజిళ్లు తీశాక తన కూతురి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిందని బాలిక తల్లి ఆరోపించారు. ఈ విషయమై ప్రశ్నించగా టీచర్‌ను తన చర్యలను సమర్థించుకున్నారని అన్నారు. బాలిక చదవులో వెనకబడితే మళ్లీ తమనే నిందిస్తారని టీచర్ అన్నట్టు చెప్పారు. ఇక ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పాండురంగ్ గలాంగే తెలిపారు. అయితే, ఈ విషయంలో ఇంకా పోలీసు కేసు నమోదు కాలేదని సమాచారం.
ఇవీ చదవండి
వధువును రాడ్డుతో కొట్టి చంపిన వరుడు.. పెళ్లికి గంట ముందు దారుణం
వివాహేతర సంబంధం.. భర్త ముందే మహిళను హత్య చేసిన లవర్
మరిన్ని క్రైమ్, జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి