రక్తపు మడుగులో భర్త, కుమారుడు.. పక్కనే ఫోన్ చూస్తూ కూర్చున్న భార్య!
ABN , Publish Date - Jul 16 , 2026 | 03:57 PM
డాక్టర్ భర్తను హతమార్చి, ఎనిమిదేళ్ల కన్నకొడుకును కత్తితో పొడిచిన భయంకరమైన ఘటన కర్ణాటకలో జరిగింది. పోలీసులు అక్కడి దృశ్యాన్ని చూసి నివ్వెరపోయారు. ఇల్లంతా రక్తసిక్తంగా ఉంటే, భర్త శవం పక్కనే నిందితురాలైన భార్య మొబైల్ ఫోన్ స్క్రోల్ చేస్తూ కూర్చోవడం సంచలనం రేపుతోంది.
ధార్వాడ్ (కర్ణాటక), జులై 16: ఉన్నత విద్యావంతులు, సమాజంలో గౌరవప్రదమైన హోదాలో ఉన్న భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో ఏమో కానీ.. తాళికట్టిన భర్తను దారుణంగా హతమార్చి, ఎనిమిదేళ్ల కన్నకొడుకును కత్తులతో పొడిచిన ఒక భయంకరమైన ఉదంతం కర్ణాటకలోని ధార్వాడ్‌లో వెలుగుచూసింది. ఈ ఘోరానికి ఒడిగట్టింది మరెవరో కాదు, వృత్తిరీత్యా కంటి వైద్యురాలైన ఆమె.. భార్యే కావడం గమనార్హం. అయితే, ఈ దారుణం జరిగిన అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా, అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి నివ్వెరపోయారు. ఇల్లంతా రక్తసిక్తంగా మారగా, భర్త శవం పక్కనే నిందితురాలైన భార్య ఎలాంటి చలనం లేకుండా మొబైల్ ఫోన్ స్క్రోల్ చేస్తూ కూర్చోవడం స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది.
మృతుడు కిరణ్ హొనన్నవర్ (45) మోదినగర్ పరిధిలోని చిరాయు ఆసుపత్రిలో అనస్థీటిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య ప్రియాంక కట్టనహళ్లి కూడా ఉన్నత విద్యావంతురాలు (MBBS, MS ఆప్తాల్మాలజీ). వీరు తమ ఎనిమిదేళ్ల కుమారుడితో కలిసి పవన్ హైస్కూల్ ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్‌లోని 6వ అంతస్తులో నివసిస్తున్నారు. మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం కిరణ్ స్నేహితులు, బంధువులు ఆయనకు ఫోన్ చేయగా.. భార్య ప్రియాంక ఫోన్ ఎత్తింది. రాత్రి సమయంలో ఆయన నిద్రిస్తున్నాడని, ఉదయం పూట డ్యూటీకి వెళ్లాడని అబద్ధాలు చెప్పి నమ్మించింది. చుట్టుపక్కల వారు అడిగినా కూడా భర్త బయటకు వెళ్లాడని బుకాయించింది.
బుధవారం సాయంత్రం వరకు కూడా కిరణ్ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు నేరుగా వారి ఫ్లాట్‌కు వెళ్లారు. తలుపులు తీసి లోపలికి వెళ్లి చూడగా అక్కడ హృదయవిదారక దృశ్యం కనిపించింది. ఒక గదిలో డాక్టర్ కిరణ్ రక్తపు మడుగులో శవమై పడి ఉన్నారు. పక్కనే ఎనిమిదేళ్ల బాలుడు కూడా తీవ్రమైన కత్తిపోట్లతో పడి ఉన్నాడు. ఈ ఘోరం పక్కనే నిందితురాలు ప్రియాంక మంచంపై పడుకుని ప్రశాంతంగా తన మొబైల్ ఫోన్‌లో సోషల్ media స్క్రోల్ చేస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు బయటకు వచ్చి తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న బాలుడు.. కాపాడిన పోలీస్ కమిషనర్
సమాచారం అందుకున్న వెంటనే హుబ్బళ్లి-ధార్వాడ్ పోలీస్ కమిషనర్ ఎన్. శశికుమార్ స్వయంగా రంగంలోకి దిగారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన, తీవ్ర గాయాలతో పడి ఉన్న బాలుడు ఇంకా శ్వాస తీసుకుంటున్నట్లు గమనించారు. ఆలస్యం చేయకుండా వెంటనే ఆ పిల్లాడిని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడికి అత్యవసర చికిత్స అందుతోంది.
ఈ ఘటనపై పోలీస్ కమిషనర్ శశికుమార్ మాట్లాడుతూ.. ప్రాథమిక విచారణ ప్రకారం ఘటనా సమయంలో ఇంట్లో భార్యాభర్తలు, వారి కుమారుడు మినహా బయటి వ్యక్తులు ఎవరూ రాలేదని తేలింది. 'ఈ దారుణం ఎప్పుడు జరిగింది.. దీనికి గల కారణాలు ఏమిటి? అనే కోణంలో లోతైన దర్యాప్తు చేస్తున్నాం. నిందితురాలు ప్రియాంక ఫోన్ కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నాం. ఆమె ఎవరెవరితో మాట్లాడింది, ఏం చెప్పింది అనే విషయాలను సేకరిస్తున్నాం. హత్య కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నాం' అని సీపీ తెలిపారు.
సమాజంలో ప్రాణాలు కాపాడే వృత్తిలో ఉండి, కన్న కొడుకును, భర్తను అంత దారుణంగా నరికిన తర్వాత కూడా ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా ఫోన్ చూసుకుంటూ కూర్చున్న భార్య మానసిక స్థితిపై స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ ఘోర ఉదంతం కర్ణాటక వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది.
వార్తలు కూడా చదవండి...
భూమి కోసం 35 ఏళ్ల పాటు పోరాటం చేసిన వృద్ధురాలు.. చివరికి..
తుది దశకు అహ్మదాబాద్ విమాన ప్రమాద దర్యాప్తు: కేంద్రమంత్రి