Ananthapuram News: వ్యాపారంలో విభేదాలతోనే.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హత్య
ABN , Publish Date - Jan 10 , 2026 | 01:37 PM
జిల్లాలో సంచలనం కలిగించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మాదినేని మహేశ్ హత్య కేసును పోలీసుల ఛేదించారు. వ్యాపారంలో విభేదాలతోనే.. హత్య జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇందుకు సంబంధించిన పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.
- మాదినేని మహేశ్ హత్య కేసులో ఐదుగురి అరెస్టు
- కారు, ద్విచక్రవాహనం, సెల్‌ఫోన్లు స్వాధీనం: డీఎస్పీ
పుట్టపర్తి(అనంతపురం): రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆర్థిక లావాదేవీల్లో వచ్చిన విభేదాలతోనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మాదినేని మహేశ్(Software Engineer Madineni Mahesh) హత్య జరిగినట్లు డీఎస్పీ విజయ్‌కుమార్ వెల్లడించారు. సంచలనం కలిగించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మాదినేని మహేశ్ హత్య కేసును పోలీసుల ఛేదించారు. ఈకేసుతో సంబంధం ఉన్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ విజయ్‌కుమార్ పేర్కొన్నారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఆయన పుట్టపర్తి అర్బన్ సీఐ శివాంజనేయులు, కొత్తచెరువు అప్‌గ్రేడ్ సీఐ మారుతీశంకర్‌తో కలిసి కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.

ఆయన తెలిపిన మేరకు మృతుడు మాదినేని మహేశ్, మారుతీరెడ్డి, లోకేశ్, వంశీకిశోర్ గత కొంతకాలంగా రియల్‌ఎస్టేట్ వ్యాపారం కలిసి చేసేవారన్నారు. ఇటీవల ఆర్థిక లావాదేవీల్లో పొరపొచ్చాలు వచ్చాయి. ఈక్రమంలోనే ఈనెల 1న మృతుడు మహేశ్, లోకేశ్‌ల మధ్య వాగ్వాదం జరిగి ఒకరినొకరు కొట్టుకున్నారన్నారు. దీనిపై కొత్తచెరువు అప్‌గ్రేడ్ పోలీసు స్టేషన్‌లో ఇద్దరిపై కేసు నమోదైందన్నారు. అనంతరం మారుతీరెడ్డి గెస్ట్‌హౌస్ వద్ద జరిగిన వాగ్వాదం తీవ్రస్థాయికి చేరడంతో మహేశ్‌ను మోటార్‌సైకిళ్లపై వెంబడించి హంద్రీనీవా కాలువ వద్ద రాయి, ఇనుప పైపుతో కొట్టి చంపేశారు.
అనంతరం హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, మృతదేహం, మృతుడి ద్విచక్రవాహనం దుప్పట్లతో చుట్టి కాలువలో పడవేశారని తెలిపారు. మృతుడి తల్లి నాగరత్నమ్మ ఫిర్యాదు మేరకు అనుమానితులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో కొత్తచెరువు- పెనుకొండ రహదారి తలమర్ల క్రాస్ వద్ద నిందితులను అరెస్టు చేశామన్నారు.

వారి నుంచి హత్యకు ఉపయోగించిన వాహనం, ఐదు సెల్‌ఫోన్లు, ఇనుపరాడ్, మృతుడికి చెందిన ఎలక్ట్రిక్ స్కూటీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అరెస్టు అయిన మారుతీప్రసాద్‌రెడ్డిపై అర్బన్ పోలీసుస్టేషన్‌లో రౌడీషీట్, ఏడుకేసులు, వంశీకిశోర్‌పై కొత్తచెరువు పోలీసుస్టేషన్‌లో రౌడీషీట్, ఏడు కేసులు, లోకేశ్‌పై రెండు కేసులు ఉన్నాయన్నారు. వారికి అభిషేక్, బాలమిత్ర సహకరించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
ప్రతి ఏటా పోలీస్ రిక్రూట్‌మెంట్
Read Latest Telangana News and National News