Hyderabad: ఖరీదైన మద్యం బాటిళ్లలో కల్తీ..
ABN , Publish Date - Jan 08 , 2026 | 07:51 AM
ఖరీదైన మద్యం బాటిళ్లలో కల్తీ మద్యాన్ని నింపుతున్న విషయం బట్టబయలైంది. ఈ సందర్బంగా ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
- రూ. 20 వేల బాటిళ్లు.. రూ.10 వేలకు విక్రయం
- ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు
హైదరాబాద్ సిటీ: ఖరీదైన మద్యం బాటిళ్లలో మద్యాన్ని తీసి.. ఆ స్థానంలో కల్తీని భర్తీ చేసి మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ముఠా గుట్టు రట్టు చేశారు ఎక్సైజ్ పోలీసులు. ఐదుగురిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. వారి వద్ద నుంచి 139 ఖరీదైన మద్యం బాటిళ్లు.. 136 ఖరీదైన ఖాళీ మద్యం సీసాలు, స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సరుకు విలువ రూ. 8లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. గచ్చిబౌలి ప్లైఓవర్(Gachibowli Flyover), ఇందిరానగర్ రూట్‌లో తనిఖీలు నిర్వహించగా ఇద్దరు వ్యక్తులు స్కూటీపై వెళ్తూ 15 బెన్‌విచ్ మద్యం బాటిళ్లతో పట్టుబడ్డారు.
బాటిళ్లను పరీక్షించగా విలువైన మద్యం బాటిళ్లలో మిక్సింగ్ మద్యం ఉన్నట్ల గుర్తించారు. తొలుత పట్టుబడిన ప్రకాష్ గౌడ్, గద్వాల భరత్‌ను అరెస్టు చేసి వారిని విచారించారు. ఈ మద్యం బాటిళ్లను ప్రకాష్ గౌడ్ తన తమ్ముడు అరవింద్ ఇంట్లోంచి తీసుకొస్తున్నామని తెలిపారు. అరవింద్‌ను విచారించగా ఒడిశాకు చెందిన బుచ్చిదేవ్ మహంతి అనే వ్యక్తి వద్ద మిక్సింగ్ బాటిళ్లను తయారు చేస్తామని తెలిపారు. మహంతి ఇంటికి వెళ్లి తనిఖీలు నిర్వహించగా 54 మద్యం బాటిళ్లు లభించాయి.

మహంతితోపాటు విక్రమ్ అనే వ్యక్తి వద్ద మరో 24 మద్యం బాటిళ్లు దొరికాయి. రూ.20 వేల బాటిల్‌ను రూ. పది వేలకు, అమ్మకాలు జరుపున్నట్లు విచారణలో వెల్లడైంది. శంషాబాద్ ఏఈఎస్ శ్రీనివాసరెడ్డి, డీటీఎప్ సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి సిబ్బంది ప్రకృతి, మల్లేష్, నెహ్రూ, గణేష్, సాయిశంకర్, శేఖర్ ఈ దాడిలో పాల్గొన్నారు. డీటీఎప్ టీమ్‌ను ఎక్సైజ్ సూపరిండెంట్ కృష్ణ ప్రియ, డిప్యూటీ కమిషనర్ పి. దశరథ్ అభినందించారు. నిందితులను, మద్యం బాటిళ్లను శేరిలింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జనార్దనరావుతో చాలా ఏళ్లుగా స్నేహం
ప్రత్యేక సర్వీసుల్లో అదనపు చార్జీలు ఉండవు: ఆర్టీసీ
Read Latest Telangana News and National News