యూపీఐపై ఎండీఆర్ ప్రభావం.. 76 శాతం మంది ప్రత్యామ్నాయ చెల్లింపుల వైపు..!
ABN , Publish Date - Oct 01 , 2026 | 04:50 PM
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రోజువారీ చెల్లింపులకు ఉపయోగిస్తున్న యూపీఐ వ్యవస్థలో అక్టోబర్ 15 నుంచి కీలక మార్పు రానుంది. రూ.2,000కు మించిన కొన్ని చెల్లింపులపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ అమల్లోకి రానుంది. అయితే, దీనిపై లోకల్ సర్కిల్స్ సంస్థ నిర్వహించిన సర్వే ఆసక్తికరంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా కోట్లాది మంది రోజువారీ చెల్లింపులకు ఉపయోగిస్తున్న యూపీఐ వ్యవస్థలో అక్టోబర్ 15 నుంచి కీలక మార్పు రానుంది. రూ.2,000కు మించిన కొన్ని పర్సన్ టు మర్చంట్ (P2M) చెల్లింపులపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అమల్లోకి రానుంది. ఈ ఛార్జీని నేరుగా వినియోగదారుల నుంచి వసూలు చేయరాదని వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, దీనిపై దేశవ్యాప్తంగా వ్యాపారుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా ఎండీఆర్‌పై లోకల్ సర్కిల్స్ సంస్థ (LocalCircles) సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 291 జిల్లాల్లో 67 వేల మందికి పైగా పాల్గొన్నారు. ఓ వ్యాపారి అదనపు రుసుము వసూలు చేస్తే వినియోగదారులు ఏం చేస్తారనే నిర్దిష్ట ప్రశ్నకు 31,206 మంది సమాధానాలు ఇచ్చారు.
సర్వే ఏం చెబుతోంది?
సర్వే ప్రకారం.. 31,206 మందిలో కేవలం 14 శాతం మంది మాత్రమే అదనపు ఖర్చును భరించి యూపీఐని కొనసాగిస్తామని చెప్పారు. 27 శాతం మంది ఎండీఆర్ చెల్లించేందుకు సిద్ధంగా లేమని, బదులుగా నగదు చెల్లిస్తామని పేర్కొన్నారు. 26 శాతం మంది క్రెడిట్ కార్డును ఎంచుకుంటామని, 14 శాతం మంది డెబిట్ కార్డును ఉపయోగిస్తామని తెలిపారు. 4 శాతం మంది బ్యాంక్ ట్రాన్స్‌ఫర్, NEFT లేదా IMPS వైపు వెళ్తామని వెల్లడించారు. 9 శాతం మంది అదనపు ఛార్జీ లేని మరో చెల్లింపు మార్గాన్ని అడుగుతామని చెప్పారు. 2 శాతం మంది కొనుగోలును వాయిదా వేస్తామన్నారు. అలాగే, 4 శాతం మంది స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని లోకల్ సర్కిల్స్ సర్వే పేర్కొంది. దీంతో ఎండీఆర్ భారాన్ని వినియోగదారులపై మోపే పరిస్థితి ఏర్పడితే పెద్ద మొత్తాల చెల్లింపుల్లో యూపీఐ వినియోగం తగ్గే అవకాశం ఉందని సర్వే సూచిస్తోంది.
యూపీఐకి 76 శాతం మంది దూరం..!
ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో మరో ప్రశ్నకు ప్రజలు ఇచ్చిన సమాధానాలు ఆసక్తికరంగా ఉన్నాయి. రూ.2,000కు మించిన యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ ఉంటే భవిష్యత్తులో ఎక్కువగా ఏ పేమెంట్ విధానాన్ని ఉపయోగిస్తారని అడగగా.. 37,654 మంది ఇచ్చిన సమాధానాలు కీలకంగా మారాయి. వీరిలో 26 శాతం మంది క్రెడిట్ కార్డు వైపు మొగ్గు చూపగా.. 26 శాతం మంది నగదు లావాదేవీలు చేస్తామని చెప్పారు. 13 శాతం మంది డెబిట్ కార్డు, 11 శాతం మంది బ్యాంక్ ట్రాన్స్‌ఫర్/NEFT/IMPS వినియోగిస్తామన్నారు. 20 శాతం మంది యూపీఐ ద్వారా చెల్లిస్తామన్నారు. మరో 4 శాతం మంది స్పష్టత లేని సమాధానాలు ఇచ్చారు. అంటే సర్వేలో పాల్గొన్న 76 శాతం మంది పెద్ద మొత్తాల చెల్లింపులకు యూపీఐ కాకుండా మరో మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉందని లోకల్ సర్కిల్స్ చెబుతోంది.
వ్యాపారులు ఏం చెప్పారు?
వ్యాపారులతో లోకల్ సర్కిల్స్ మరో సర్వే నిర్వహించింది. ఇందులో 242 జిల్లాలకు చెందిన 32 వేల మందికి పైగా వ్యాపారులు పాల్గొన్నారు. అందులో కేవలం 17 శాతం మంది మాత్రమే 0.4 శాతం ఎండీఆర్ భరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అదే సమయంలో 41 శాతం మంది ఇందుకు నిరాకరించారు. మరో 9 శాతం మంది యూపీఐ చెల్లింపులను స్వీకరించడం లేదని తెలిపారు. దీంతో ఎండీఆర్‌ను వినియోగదారులపై మోపకూడదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. వ్యాపారులు ఆ ఖర్చును ఎలా నిర్వహిస్తారన్నది కీలకంగా మారింది.
అసలు ఎండీఆర్ అంటే ఏమిటి?
డిజిటల్ చెల్లింపును ప్రాసెస్ చేయడానికి వ్యాపారి చెల్లించే రుసుమే మర్చంట్ డిస్కౌంట్ రేట్. ఇది బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, యూపీఐ యాప్‌లతో కూడిన చెల్లింపుల వ్యవస్థలోని భాగస్వాములకు వెళ్తుంది. ఇది ప్రభుత్వం లేదా NPCI నేరుగా వసూలు చేసే పన్ను కాదు.
ఈ వార్తలు కూడా చదవండి
జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ దూకుడు.. సెప్టెంబర్‌లో రూ.5,327 కోట్లు
రూ. 9లక్షల కోట్లు ఆవిరి.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు..