Share News

ఒకప్పుడు గన్నులు.. ఇప్పుడు పెన్నులు.. పదో తరగతిలో ఫస్ట్ క్లాస్ సాధించిన మాజీ మావోయిస్టులు..

ABN , Publish Date - Oct 01 , 2026 | 03:58 PM

వీరంతా ఒకప్పుడు అడవుల్లో తుపాకులు పట్టుకుని తిరిగిన వారు.. ఇప్పుడు చేతిలో పెన్నులు పట్టుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌కు చెందిన మాజీ మావోయిస్టులు విద్య ద్వారా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు.

ఒకప్పుడు గన్నులు.. ఇప్పుడు పెన్నులు.. పదో తరగతిలో ఫస్ట్ క్లాస్ సాధించిన మాజీ మావోయిస్టులు..
Former Maoists,

ఇంటర్నెట్ డెస్క్: వీరంతా ఒకప్పుడు అడవుల్లో తుపాకులు పట్టుకుని తిరిగిన వారు.. ఇప్పుడు చేతిలో పెన్నులు పట్టుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌కు చెందిన మాజీ మావోయిస్టులు విద్య ద్వారా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. తాజాగా మాజీ మావోయిస్టుల్లో పలువురు పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. వారిలో కొందరు ఫస్ట్ డివిజన్ కూడా సాధించారు (Bastar Former Maoists).


బస్తర్ డివిజన్‌కు చెందిన మాజీ మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్ ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి పరీక్షలు రాశారు. ఈ ఏడాది పరీక్షలకు హాజరైన ఎనిమిది మంది మాజీ మావోయిస్టులు తొలిసారే ఉత్తీర్ణత సాధించారు. వారిలో కొందరు ఫస్ట్ డివిజన్‌లో పాసయ్యారు. ఈ విద్యా కార్యక్రమం మాజీ మావోయిస్టుల పునరావాస ప్రక్రియలో భాగంగా కొనసాగుతోంది. లొంగిపోయిన మాజీ మావోయిస్టులు తమ ఆసక్తి, సామర్థ్యాలకు అనుగుణంగా విద్య, వృత్తి శిక్షణ, ఉపాధి అవకాశాలను ఎంచుకునేలా అధికారులు సహాయం చేస్తున్నట్లు బస్తర్ ఐజీ బద్రీనారాయణ్ మీనా తెలిపారు (Naxal Rehabilitation).


తెలంగాణకు చెందిన భాస్కర్ 1990లలో మావోయిస్టు సంస్థలో సాధారణ సభ్యుడిగా చేరారు. అనంతరం దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ స్థాయికి ఎదిగారు. సంస్థలో ఉన్న సమయంలో వివిధ రకాల ఆయుధాలను ఉపయోగించడంలో శిక్షణ పొందిన ఆయన.. బస్తర్‌లో ఉన్న సమయంలో హిందీ, పుస్తకాలపై ఆసక్తి పెంచుకున్నారు. లొంగిపోయిన తర్వాత ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి పరీక్ష రాసి ఫస్ట్ డివిజన్‌లో ఉత్తీర్ణత సాధించారు.


మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతానికి చెందిన గీత కుటుంబ పరిస్థితుల కారణంగా ఆరో తరగతి తర్వాత చదువు ఆపేశారు. అనంతరం రెండు దశాబ్దాల పాటు మావోయిస్టు సంస్థలో కొనసాగారు. సంస్థలో ఉన్న సమయంలో గాయపడిన సభ్యులకు చికిత్స చేయడం, గాయాలకు కుట్లు వేయడం, ఇంజెక్షన్లు ఇవ్వడం, మందులు అందించడం వంటి వైద్యపరమైన పనులు నేర్చుకున్నారు. దీంతో ఆమెను సంస్థలో 'నక్సల్ డాక్టర్ గీత' అని పిలిచేవారు. లొంగిపోయిన తర్వాత మళ్లీ చదువును ప్రారంభించిన గీత పదో తరగతిలో ఫస్ట్ డివిజన్ సాధించారు. ఇకపై మరింత చదివి నర్సింగ్ రంగంలోకి వెళ్లాలని ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారు (Maoists Surrender).


బస్తర్ జిల్లాకు చెందిన ఆరుగురు, కాంకేర్, బీజాపూర్ జిల్లాలకు చెందిన ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఎనిమిది మంది మాజీ మావోయిస్టులు పదో తరగతి పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. చదువు కొనసాగించాలనుకునే వారికి అవసరమైన సహాయం అందిస్తామని అధికారులు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

రూ. 9లక్షల కోట్లు ఆవిరి.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు..


అస్సాంలో 9 మంది బంగ్లాదేశీయుల అరెస్ట్.. నకిలీ ఆధార్ కార్డులు స్వాధీనం..

Updated Date - Oct 01 , 2026 | 03:58 PM