బడ్జెట్ 2026: కేంద్ర విత్త మంత్రి మరో ఘనత సాధిస్తారా.?
ABN , Publish Date - Jan 30 , 2026 | 05:23 PM
రికార్డ్ స్థాయిలో వరుసగా తొమ్మిదోసారి యూనియన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్. ఇదే ఓ మైలురాయి కానుండగా.. బడ్జెట్ ప్రసంగం ద్వారా ఆమె ఈసారి కొత్త రికార్డులు సృష్టించే అవకాశముంది. ఆ రికార్డుల విశేషాలు ఏమిటంటే...
ఇంటర్నెట్ డెస్క్: ఫిబ్రవరి 01.. యూనియన్ బడ్జెట్ 2026. కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండటంతో ఈ సారి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. 2019లో బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ఎనిమిది బడ్జెట్లను(ఒక మధ్యంతర బడ్జెట్‌తో కలిపి) విజయవంతంగా సమర్పించిన ఆమె.. ఈ ఏడాది 9వ సారి ప్రసంగం ఇవ్వనున్నారు. ఈ ప్రసంగం ద్వారా ఆమె ముంగిట మరిన్ని రికార్డులు ఊరిస్తున్నాయి(Union Budget 2026 Records). ఇంతకీ ఆ రికార్డుల మాటేమిటో ఓసారి పరిశీలిస్తే...
బడ్జెట్ ప్రదర్శన సమయంలో వ్యవధి పరంగా.. నిర్మలా సీతారామన్ 2020-21లో ఇప్పటికే ఓ రికార్డును కలిగి ఉన్నారు. నాడు ఆమె 2 గంటల 42 నిమిషాలు ప్రసంగించగా.. ఇదే ఎక్కువ సేపు బడ్జెట్ ప్రసంగంగా ఉంది. ఆ సమయంలో ఇంకా రెండు పేజీలు మిగిలి ఉండగానే తన ప్రసంగాన్ని ముగించారామె(Longest Budget Speech). ఈసారి ఆ రికార్డ్ బద్దలయ్యే అవకాశముంది. ఈ ఫీట్ సాధిస్తే.. అత్యధిక బడ్జెట్ ప్రసంగంలో తన రికార్డును తానే తిరగరాసుకోనున్నారు సీతారామన్.
ఇక.. బడ్జెట్ ప్రసంగంలో పదాల పరంగానూ కేంద్ర విత్త మంత్రి నయా రికార్డ్ నెలకొల్పే సూచనలు కనిపిస్తున్నాయి. పదాల కౌంట్ పరంగా.. అతి పొడవైన బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరిట ఉంది. 1991లో ఆయన తన మైలురాయి బడ్జెట్‌లో 18,604 పదాలను ఉపయోగించారు(Highest Words Budget Speech). 2018లో నాటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగం ఈ రికార్డుకు దగ్గరగా వచ్చింది. దీంతో పద గణనలో అది రెండో స్థానంలో నిలిచింది. ఇక.. హిరుభాయ్ ముల్జీభాయ్ పటేల్ 1977లో కేవలం 800 పదాలను ఉపయోగించి బడ్జెట్ ప్రసంగం చేశారు. ఇప్పటివరకూ తక్కువ పదాలతో వచ్చిన బడ్జెట్ ఇదే. ప్రస్తుతం ఈ రికార్డు బహుశా చెరిగిపోకపోవచ్చు. ఎందుకంటే.. ఇప్పుడు రైల్వే బడ్జెట్ కూడా సాధారణ బడ్జెట్‌లో కలిసిపోయింది. కాబట్టి బడ్జెట్ ప్రసంగం అంత చిన్నదిగా ఉండే అవకాశాలు చాలా తక్కువ అని ఆర్థిక నిపుణుల అభిప్రాయం.
ఇవీ చదవండి:
బడ్జెట్ 2026: ఆదివారం రోజే ఎందుకు? ఆ రోజు స్టాక్ మార్కెట్ల పరిస్థితి ఏంటి.?
చరిత్ర సృష్టించనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఎవరికీ సాధ్యంకాని రికార్డు..