టాటా ట్రస్టులకు బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ.. టాటా సన్స్ బోర్డు సమావేశానికి గ్రీన్ సిగ్నల్..
ABN , Publish Date - Nov 27 , 2026 | 09:55 PM
టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్ల పాటు కొనసాగించాలన్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ టాటా ట్రస్టులు దాఖలు చేసిన పిటిషన్లపై బాంబే హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్ల పాటు కొనసాగించాలన్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ టాటా ట్రస్టులు దాఖలు చేసిన పిటిషన్లపై బాంబే హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 30న జరగాల్సిన టాటా సన్స్ బోర్డు సమావేశాన్ని వాయిదా వేయాలన్న ట్రస్టుల అభ్యర్థనను తిరస్కరించింది. అయితే ఆ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను 2027 జనవరి 18కి వాయిదా వేసింది (Tata Trusts Bombay HC).
టాటా ట్రస్టులకు చెందిన సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, ఆర్‌డీ టాటా ట్రస్ట్‌లు బాంబే హైకోర్టును ఆశ్రయించాయి. నవంబరు 30న జరగనున్న బోర్డు సమావేశాన్ని నిలిపివేయాలని లేదా వాయిదా వేయాలని కోరాయి. చంద్రశేఖరన్‌కు ఛైర్మన్‌గా కాస్టింగ్ ఓటు వినియోగించే అవకాశం ఇవ్వకుండా ఆదేశించాలని కూడా విజ్ఞప్తి చేశాయి. అయితే జస్టిస్ అభయ్ అహూజా నేతృత్వంలోని ధర్మాసనం తక్షణ ఉపశమనం ఇచ్చేందుకు నిరాకరించింది. సమావేశాన్ని షెడ్యూల్ ప్రకారమే నిర్వహించుకోవచ్చని పేర్కొంది. అయితే అందులో తీసుకునే నిర్ణయాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది (Tata Group Dispute).
టాటా సన్స్ బోర్డు సెప్టెంబర్ 17న జరిగిన సమావేశంలో ఎన్. చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్ల పాటు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగించాలని నిర్ణయించింది (Tata Sons Board Meeting). ఆయన కొత్త పదవీకాలం 2027 ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే టాటా ట్రస్టుల ఛైర్మన్ నోయల్ టాటా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. మరో ట్రస్ట్ నామినీ డైరెక్టర్ వేణు శ్రీనివాసన్ మాత్రం అనుకూలంగా ఓటు వేశారు. దీంతో ట్రస్టుల నామినీ డైరెక్టర్ల మధ్య ఏకాభిప్రాయం లేకుండానే నిర్ణయం తీసుకున్నారని టాటా ట్రస్టులు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
ఇవి కూడా చదవండి:
వైభవ్ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా బాదేస్తాడు: చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా
ఐపీఎల్ 2027: వేలంలోకి వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్