సుకన్య సమృద్ధి యోజన స్కీమ్.. మెచ్యూరిటీకి ముందే పెళ్లి జరిగితే.. డబ్బులు తీసుకోవడం ఎలా?
ABN , Publish Date - Nov 16 , 2026 | 11:41 AM
ఆడపిల్లల భవిష్యత్తు, చదువు, వివాహం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పొదుపు పథకాల్లో 'సుకన్య సమృద్ధి యోజన' (SSY) ఒకటి. ఈ స్కీమ్ ద్వారా ఆడపిల్లలకు ఆర్ధిక భరోసా లభిస్తుంది. అయితే ఈ పథకంలో మెచ్యూరిటీకి ముందే అమ్మాయికి వివాహం నిశ్చమైతే డబ్బులు ఎలా తీసుకోవాలి అనే సందేహం చాలా మందికి వ్యక్తమవుతుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆడపిల్లల భవిష్యత్తు, చదువు, వివాహం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పొదుపు పథకాల్లో 'సుకన్య సమృద్ధి యోజన' (SSY) ఒకటి. 10 ఏళ్ల వయసులోపు బాలికల పేరుతో తల్లిదండ్రులు ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. ప్రస్తుతం ఈ పథకం కింద వార్షికంగా 8.2 శాతం వడ్డీ లభిస్తుండగా, పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ పథకం కింద డిపాజిట్లు ఖాతా తెరిచిన నాటి నుంచి 15 సంవత్సరాల వరకు చేయవచ్చు కానీ, ఖాతా మాత్రం 21 ఏళ్లకు పరిపూర్ణంగా మెచ్యూర్ అవుతుంది.
అయితే, ఒక బాలికకు 21 ఏళ్లు నిండేలోపు .. అంటే మెచ్యూరిటీ కాలానికి ముందే వివాహం నిశ్చయమైతే డబ్బులు తీసుకోవచ్చా అనే సందేహాం చాలా మంది ఖాతాదారులకు వస్తుంది. పెళ్లి కోసం అమ్మాయి ఖాతాను ముందుగానే మూసివేసే (Premature Closure) సదుపాయం నిబంధనల్లో ఉంది. ఈ వెసులుబాటును వినియోగించుకోవాలంటే ఆడబిడ్డ వయసు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అంతేకాకుండా వివాహానికి ఒక నెల ముందు లేదా వివాహం జరిగిన మూడు నెలల లోపు సంబంధిత దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. దీనికోసం వయసు ధృవీకరణ పత్రం, వివాహ ఆహ్వాన పత్రిక లేదా ధృవీకరణ పత్రాన్ని అందించాలి. ఈ దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత, ఖాతాలో జమ అయిన మొత్తం బ్యాలెన్స్, దానికి సంబంధించిన వడ్డీని వెనక్కి తీసుకోవడానికి వీలవుతుంది.
మరోవైపు, వివాహం కాకుండా బాలిక ఉన్నత చదువుల కోసం అయితే ఖాతా మూసివేయకుండానే మధ్యలో డబ్బు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తర్వాత లేదా 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత, ఉన్నత విద్య నిమిత్తం ఖాతాలో ఉన్న మొత్తం నగదులో గరిష్ఠంగా 50 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. అడ్మిషన్ ప్రూఫ్ లేదా ఫీజు రసీదు సమర్పించి, ఈ మొత్తాన్ని ఒక్కసారిగా లేదా ఐదు సంవత్సరాల పాటు విడతలవారీగా పొందవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి
వీఐపీల కోసం సింహాన్ని బైక్‌లతో తరిమిన పార్క్ సిబ్బంది.. వీడియో వైరల్
ఒకటిరెండు మ్యాచ్‌లు రోహిత్-కోహ్లీ కెరీర్‌ను డిసైడ్ చేయలేవు: అజయ్ జడేజా
బ్రేకప్ చెప్పిందని ఇంతటి ఘాతుకమా?.. మాజీ ప్రియురాలి కుక్కలను చంపి వీడియో కాల్..