Share News

భారీ నష్టాల్ని మూటగట్టుకున్న భారత స్టాక్ మార్కెట్లు

ABN , Publish Date - Sep 28 , 2026 | 03:59 PM

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్ని మూటగట్టుకున్నాయి. మార్కెట్లు ఆరంభం నుంచే తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. సెన్సెక్స్ 73,734 పాయింట్ల వద్ద, నిఫ్టీ 23,064 పాయింట్ల వద్ద గ్యాప్-డౌన్‌తో ప్రారంభమై, రోజంతా నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి.

భారీ నష్టాల్ని మూటగట్టుకున్న భారత స్టాక్ మార్కెట్లు
Stock Market Closing: Sensex Falls 1,124 Points, Nifty Slips 360 Points

ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 28: భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్ని మూటగట్టుకున్నాయి. మార్కెట్లు ఆరంభం నుంచే తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. సెన్సెక్స్ 73,734 పాయింట్ల వద్ద, నిఫ్టీ 23,064 పాయింట్ల వద్ద గ్యాప్-డౌన్‌తో ప్రారంభమై, రోజంతా నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ (Strait of Hormuz) చుట్టూ అనిశ్చితి కారణంగా బ్రెంట్ క్రూడ్ ధరలు $108 డాలర్ల పైకి చేరాయి. భారత్ అత్యధికంగా చమురును దిగుమతి చేసుకునే దేశం కావడంతో, చమురు ధరల పెంపు ప్రభావం మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.


సెన్సెక్స్ ఇవాళ(సోమవారం) 1,124.02 పాయింట్లు (1.52శాతం) కోల్పోయి 72,771.72 దగ్గర ముగిసింది. నిఫ్టీ 360.25 పాయింట్లు (1.56శాతం) నష్టపోయి 22,780.25 దగ్గర స్థిరపడింది.


ఇక, నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.6శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1.8శాతం చొప్పున పతనమయ్యాయి. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 16 పైసలు క్షీణించి 95.98 వద్ద ముగిసింది. (శుక్రవారం క్లోజింగ్ 95.82).

యూఎస్-ఇరాన్ మధ్య చర్చలు విఫలం కావడం, హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభానికి సంబంధించి ఇరాన్ ప్రతిపాదనను అమెరికా తిరస్కరించడంతో బ్రెంట్ క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా 3.8శాతం పైగా పెరిగి బ్యారెల్‌కు $108 స్థాయికి చేరుకున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల వరకు శాంతి ఒప్పందం కష్టమేనన్న వార్తలు మార్కెట్ భయాలను పెంచాయి.

ఇవాళ దాదాపు అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. రియాల్టీ, మెటల్, పవర్, ఐటీతో పాటు బ్యాంకింగ్ రంగంలో భారీగా లాభాల స్వీకరణ జరిగింది. ముఖ్యంగా PSU బ్యాంక్ ఇండెక్స్ గరిష్టంగా 3.15శాతం నష్టపోయింది. టెలికామ్ ఇండెక్స్ 2.3శాతం మేర తగ్గింది. 190కి పైగా షేర్లు 52 వారాల కనిష్టానికి చేరుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL), హిందూస్థాన్ యూనిలీవర్ (HUL), టాటా మోటార్స్, జియో ఫైనాన్షియల్, పిఎఫ్సి, ఐఆర్‌సిఒఎన్, కెనరా బ్యాంక్ వంటి దిగ్గజాలతో సహా 190కి పైగా స్టాక్స్ తమ 52 వారాల కనిష్ట రికార్డుకు చేరుకున్నాయి.

టాప్ గెయినర్స్ (లాభపడినవి): టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్.

టాప్ లూజర్స్ (నష్టపోయినవి): జియో ఫైనాన్షియల్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, L&T, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్.


అంతర్జాతీయంగా బాండ్ ఈల్డ్‌లు పెరగడం పెట్టుబడిదారుల్ని వర్ధమాన మార్కెట్ల (Emerging Markets) నుంచి వెనక్కి తగ్గేలా చేసింది. విదేశీ ఇన్వెస్టర్లు సెప్టెంబర్‌లో పెద్దఎత్తున అమ్మకాలకు పూనుకోవడం మార్కెట్ల పతనానికి మరో కారణం. మరోవైపు, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లలో పతనం కనిపించింది. HDFC బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ & టీ వంటి ప్రధాన ఇండెక్స్ హెవీవెయిట్ షేర్లలో భారీగా లాభాల స్వీకరణ నమోదైంది.

నేటి ట్రేడింగ్‌లో బ్యాంకింగ్, రియాల్టీ, మెటల్, పీఎస్‌యూ బ్యాంకింగ్ రంగాలు తీవ్ర ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. మార్కెట్ అస్థిరతను సూచించే ఇండియా VIX (India VIX) 10శాతంకి పైగా ఎగబాకి ఇన్వెస్టర్లలో ఆందోళనను పెంచింది.


ఈ వార్తలనూ చదవండి:

ట్రంప్‌తో ఆంత్రోపిక్ సీఈఓ భేటీ.. ఏఐ సేఫ్టీపై చర్చ

పాన్ కార్డులో పేరు తప్పు పడిందా..? మొబైల్‌లోనే మార్చుకోండిలా..

Updated Date - Sep 28 , 2026 | 04:27 PM