సరికొత్త రికార్డుల వైపు స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ వెయ్యికి పైగా పాయింట్లు జంప్..
ABN , Publish Date - Jun 15 , 2026 | 09:56 AM
అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం ప్రపంచ ఆర్థిక రంగానికి సరికొత్త జవసత్వాలను అందించింది. హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 2 నెలల కనిష్టానికి పడిపోవడంతో భారతీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ సరికొత్త రికార్డుల వైపు దూసుకెళ్లాయి.
ముంబై, జూన్ 15: అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం ప్రపంచ ఆర్థిక రంగానికి సరికొత్త జవసత్వాలను అందించింది. హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 2 నెలల కనిష్టానికి (బ్యారెల్‌కు 80 డాలర్ల సమీపంలోకి) పడిపోవడంతో భారతీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ సోమవారం సరికొత్త రికార్డుల వైపు దూసుకెళ్లాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE SENSEX) ఏకంగా 1,128.66 పాయింట్లు (1.49శాతం) లాభపడి 76,656.61 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. అదేవిధంగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 (NSE NIFTY) కూడా 350.40 పాయింట్లు (1.48శాం) పెరిగి 23,973.30 పాయింట్ల వద్ద బలంగా కొనసాగుతోంది.
భారత మార్కెట్లో ట్రేడర్లు, ఇన్వెస్టర్లలో భయాలను సూచించే 'ఇండియా విక్స్' (India VIX - Volatility Index) ఒక్కసారిగా 8.6% పడిపోయి 13.56 స్థాయికి చేరింది.ఇది మార్కెట్లో అస్థిరత తగ్గి, బయింగ్ సెంటిమెంట్ బలంగా పెరిగిందనడానికి స్పష్టమైన సంకేతంగా నిలుస్తోంది.
స్మాల్, మిడ్-క్యాప్స్ హుషార్.. అన్ని రంగాలూ గ్రీన్!
గత వారం చివరి సెషన్‌లోనే నిఫ్టీ 500 సూచీ 2.19 శాతం పెరగ్గా, నేటి ట్రేడింగ్‌లోనూ ఆ జోరు స్పష్టంగా కనిపిస్తోంది. మార్కెట్లో బ్రాడర్ ఇండెక్స్‌లైన నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీలు చెరో 1.3శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. మార్కెట్లోని అన్ని రంగాలు లాభాల పచ్చదనంతోనే ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.