ఎఫ్‌పీఐలకు మరింత పన్ను ఊరట?
ABN , Publish Date - Nov 03 , 2026 | 06:24 AM
దేశీయ స్టాక్ మార్కెట్లోకి మళ్లీ విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఆ సంస్థలు...
ఈక్విటీ లాభాలపై ఎల్‌టీసీజీ రద్దు
ప్రభుత్వానికి సెబీ సిఫారసు!
న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లోకి మళ్లీ విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఆ సంస్థలు దేశీయ స్టాక్ మార్కెట్లో ఆర్జించే దీర్ఘకాలిక మూలధన లాభాలపై విధించే దీర్ఘకాలిక మూలధన లాభాల (ఎల్‌టీసీజీ) పన్ను రద్దు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. సెబీ ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వానికి సిఫారసు చేసినట్టు సమాచారం. గత రెండేళ్లుగా ఎఫ్‌పీఐల ప్రతినిధులతో జరిపిన చర్చల ఆధారంగా సెబీ ఈ సిఫారసు చేసింది. ఎఫ్‌పీఐలతో పాటు దేశీయ మదుపరులు ఒక మ్యూచువల్ ఫండ్ పథకం నుంచి మరో పథకానికి మారినప్పుడు వచ్చే లాభాలకూ పన్ను రాయితీ ఇవ్వాలని సెబీ సిఫారసు చేసినట్టు తెలుస్తోంది.
ఎందుకంటే?
ఏదైనా ఒక లిస్టెడ్ కంపెనీ షేర్లను 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఉంచుకుని అమ్మితే వచ్చే లాభాలపై విధించే పన్నునే ఎల్‌టీసీజీ అంటారు. ప్రస్తుతం ఇది ఒక ఆర్థిక సంవత్సరానికి ఇచ్చిన రూ.1.25 లక్షల మినహాయింపు పోను 20 శాతంగా ఉంది. గతంలో కొన్ని మారిషస్ వంటి దేశాలతో మన దేశానికి ఉన్న పెట్టుబడి ఒప్పందాలను ఆసరాగా చేసుకుని అక్కడ తమ ఆఫీసులు ఏర్పాటు చేసి, ఎఫ్‌పీఐలు ఈ పన్ను నుంచి తప్పించుకునేవి. ఇప్పుడు ఈ మార్గం మూసుకుపోయింది. దీంతో తమ దీర్ఘకాలిక మూలధన లాభాలపైనా 20 శాతం పన్ను కట్టాల్సి వస్తోంది. గత రెండేళ్లుగా ఎఫ్‌పీఐల భారీ అమ్మకాలకు ఇది కూడా ఒక ప్రధాన కారణం. దేశీయ మదుపరులు కూడా ఈ పన్ను తీసేయండి మహా ప్రభో అని గత కొన్నేళ్లుగా మొరపెట్టుకుంటున్నారు.ఈ నేపథ్యంలోనే సెబీ ఈ సిఫారసులు చేసినట్టు భావిస్తున్నారు. ‘దీనిపై చాలా విజ్ఞప్తులు వస్తున్నాయి’ అని ఇటీవల ఆర్థిక మంత్రి సీతారామన్ కూడా చెప్పారు.
బడ్జెట్‌లో ప్రకటన!
సెబీ సిఫారసులపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. దీనిపై మరింత సమగ్రంగా చర్చించి వచ్చే కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ప్రకటన చేస్తారని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అదే జరిగితే ఎఫ్‌పీఐలు మళ్లీ భారత మార్కెట్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అయితే ఎల్‌టీసీజీ రద్దు ఒక్కటే చాలదని, మన మార్కెట్ వాల్యుయేషన్స్, స్థూల ఆర్థిక పరిస్థితులు కూడా బాగుంటేనే ఎఫ్‌పీఐలు మళ్లీ మన మార్కెట్లో భారీ పెట్టుబడులకు దిగుతాయని బ్రోకరేజీ సంస్థల అంచనా. అయితే ఎల్‌టీసీజీ రద్దు ఒక్క ఎఫ్‌పీఐలకు మాత్రమేనా? లేక కష్టకాలంలో మార్కెట్‌ను ఆదుకుంటున్న రిటైల్, దేశీయ సంస్థాగత మదుపరులకు కూడానా? అనే విషయం ఇంకా తేలాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
అక్టోబరులో జీఎస్‌టీ వసూళ్లు రూ.2.31 లక్షల కోట్లు
For More Business News And Telugu News