పసిడి రుణాలకు భలే గిరాకీ
ABN , Publish Date - Nov 02 , 2026 | 06:08 AM
పసిడి ధర నేల చూపులు చూస్తోంది. మరోవైపు పసిడి రుణాల మార్కెట్ మాత్రం రోజురోజుకీ చుక్కలంటుతోంది. దేశంలోని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు బంగారాన్ని హామీగా...
రూ.5.77 లక్షల కోట్లకు చేరిక..
గత ఏడాదితో పోలిస్తే 83 శాతం అప్
పసిడి ధర నేల చూపులు చూస్తోంది. మరోవైపు పసిడి రుణాల మార్కెట్ మాత్రం రోజురోజుకీ చుక్కలంటుతోంది. దేశంలోని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు బంగారాన్ని హామీగా పెట్టుకుని ఇచ్చిన రుణాల మొత్తం ప్రస్తుతం రూ.5.77 లక్షల కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 83 శాతం ఎక్కువని బ్రోకరేజ్ సంస్థ క్యాపిటల్‌మైండ్ వ్యవస్థాపకుడు, సీఈఓ దీపక్ షెనాయ్ తెలిపారు. రూ.5.77 లక్షల కోట్ల పసిడి రుణాల్లో రూ.3 లక్షల కోట్లు గత 12 నెలల్లో ఇచ్చినవి కావడం విశేషం.
పెరుగుతున్న రిస్క్...
పసిడి ధర తగ్గే కొద్దీ గోల్డ్ లోన్స్ మార్కెట్‌లో ఎగవేతల ప్రమాదం పెరుగుతుంది. ప్రస్తుతం బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు పసిడి ఆభరణాల విలువలో 60 నుంచి 70 శాతం వరకు రుణాలుగా ఇస్తున్నాయి. కొన్ని ఎన్‌బీఎఫ్‌సీలు వ్యాపారం పెంచుకునే యావతో 76 శాతం వరకు రుణాలుగా ఇస్తున్నాయి. ఈ ఏడాది జనవరి 29న దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల మేలిమి (24 క్యారట్స్) పసిడి ధర రికార్డు స్థాయిలో రూ.1,75,340 పలికింది. ప్రస్తుతం రూ.1.4 లక్షల దిగువన ట్రేడవుతోంది. జనవరిలో నమోదైన రికార్డు ధరతో పోలిస్తే ఇది 20 శాతం తక్కువ. ఇది మరో 15 శాతం తగ్గితే పసిడి రుణాలు ఇచ్చిన బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు తిప్పలు తప్పవని భావిస్తున్నారు.
ఎందుకంటే?
పసిడి ధర తగ్గే కొద్దీ రుణ గ్రహీతలు బ్యాంకుల, ఎన్‌బీఎఫ్‌సీల వద్ద హామీగా పెట్టిన బంగారు ఆభరణాల విలువ తగ్గుతుంది. అంటే ప్రస్తుతం రూ.1,38,481గా ఉన్న 10 గ్రాముల మేలిమి బంగారం ధర మరో 15 శాతం తగ్గితే రూ.1,17,709కి వస్తుంది. అప్పుడు బంగారం ఆభరణాల తాకట్టుపై ఇచ్చిన రుణ మొత్తం అలాగే ఉన్నా, హామీగా పెట్టుకున్న ఆభరణాల విలువ తగ్గుతుంది. ఆభరణాల విలువలో 60 నుంచి 65 శాతం వరకు రుణాలుగా ఇచ్చిన బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల పరిస్థితి ప్రస్తుత డౌన్‌ట్రెండ్‌లోనూ కొంత వరకు మెరుగ్గానే ఉంది. ఆభరణాల విలువలో 65 నుంచి 70 శాతానికి మించి రుణాలు ఇచ్చిన ఎన్‌బీఎఫ్‌సీలకు మాత్రం వసూళ్లలో తిప్పలు తప్పక పోవచ్చని మార్కెట్ వర్గాల అంచనా.
ఈ వార్తలనూ చదవండి:
జీఎస్టీ వసూళ్లలో భారీ పెరుగుదల.. అక్టోబర్‌లో రూ.2.31 లక్షల కోట్లు..
స్థిరంగా కొనసాగుతున్న వెండి ధర..