Share News

మార్కెట్లపై బేర్ పట్టు.. మరో వెయ్యి పాయింట్లు డౌన్!

ABN , Publish Date - Jan 21 , 2026 | 11:57 AM

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ అనిశ్చితుల సెంటిమెంట్లు మార్కెట్‌ను భారీగా దెబ్బతీస్తున్నాయి.

మార్కెట్లపై బేర్ పట్టు.. మరో వెయ్యి పాయింట్లు డౌన్!
Indian Stock Markets

ఇంటర్నెట్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో సెషన్‌లోనూ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ అనిశ్చితుల సెంటిమెంట్లు మార్కెట్‌ను భారీగా దెబ్బతీస్తున్నాయి. బుధవారం ఉదయం.. సెన్సెక్స్ 1,000 పాయింట్లు(సుమారు 1 శాతం మేర) పడిపోయి.. ఇంట్రాడేలో కనిష్ఠ స్థాయి 81,124.45ని తాకింది. నిఫ్టీ సుమారు 250 పాయింట్లు క్షీణించి.. 25,000 స్థాయిని సమీపించింది. ఇది ఇంట్రాడేలో కనిష్ఠ స్థాయి 24,919.80ని తాకింది.

మూడు రోజులుగా.. సెన్సెక్స్ 2,400 పాయింట్లకుపైగా(దాదాపు 3 శాతం) కుప్పకూలింది. ఇక బీఎస్ఈ నిఫ్టీ-50 ఇదే తరహాలో పతనం కొనసాగిస్తూ.. మూడు రోజుల్లో 3 శాతం మేర క్షీణించింది. శుక్రవారం నాటి బిఎస్‌ఈ లిస్టెడ్ సంస్థల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.468 లక్షల కోట్ల నుంచి రూ.450 లక్షల కోట్లకు పడిపోవడంతో.. వరుసగా మూడు సెషన్లలో రూ.18 లక్షల కోట్లు నష్టపోయారు పెట్టుబడిదారులు.


భారత స్టాక్ మార్కెట్ పతనానికి కారణాలివే..

  • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేయాలనే ప్రయత్నాన్ని విరమించుకోకపోవడంతో.. యూఎస్, ఈయూ మధ్య వాణిజ్య యుద్ధం జరిగే అవకాశాల గురించి పెట్టుబడిదారులు భయపడుతున్నట్లు కనిపిస్తోంది.

  • ఫిబ్రవరి 1 నుంచి ఎనిమిది యూరోపియన్ దేశాలపై ట్రంప్.. 10 శాతం మేర సుంకం విధిస్తున్నట్టు ప్రకటించడం, జూన్ 1 నుంచి వాటిని 25 శాతానికి పెంచుతామని చెప్పడంతో యూరోపియన్ దేశాలు వాణిజ్య యుద్ధాన్ని ప్రేరేపించే దిశగా, ప్రపంచ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేసే ప్రతీకార చర్యలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

  • ఇక మీడియా నివేదికల ప్రకారం.. జులైలో అంగీకరించిన యూఎస్ వాణిజ్య ఒప్పందం ఆమోదాన్ని నిలిపివేస్తున్నట్లు యూరోపియన్ పార్లమెంట్ త్వరలో ప్రకటించవచ్చు.

ట్రంప్ గ్రీన్‌లాండ్ విధానం, 8 యూరోపియన్ దేశాలపై బెదిరింపు సుంకాలు, యూరప్ ట్రంప్ ప్రతికూల వైఖరికి ప్రతిస్పందనగా ఇప్పుడు ప్రపంచ మార్కెట్లలో రిస్క్ ఆఫ్ సెంటిమెంట్ కొనసాగుతోంది.


ఇవీ చదవండి:

మార్కెట్‌ను ముంచిన టారిఫ్‌ భయాలు

పోటాపోటీగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు

Updated Date - Jan 21 , 2026 | 12:23 PM