Share News

భారత్‌ భేష్‌!

ABN , Publish Date - Aug 28 , 2026 | 03:55 AM

భారత్‌కు స్థిర వైఖరితో కూడిన ‘బీబీబీ’ రేటింగ్‌ను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ గురువారం వెల్లడించింది. పెట్టుబడులకు సానుకూలమైన పరపతి రేటింగ్‌ ఇది.

భారత్‌ భేష్‌!
Rating

ప్రభుత్వ పరపతి రేటింగ్‌ను యథాతథంగా కొనసాగించిన ఎస్‌ అండ్‌ పీ

క్రియాశీల, శరవేగ ఆర్థిక వ్యవస్థ అని కితాబు

ఈ ఆర్థిక సంవత్సరానికి 6.6%వృద్ధి అంచనా

న్యూఢిల్లీ: భారత్‌కు స్థిర వైఖరితో కూడిన ‘బీబీబీ’ రేటింగ్‌ను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ గురువారం వెల్లడించింది. పెట్టుబడులకు సానుకూలమైన పరపతి రేటింగ్‌ ఇది. భారత్‌ స్పష్టమైన, స్థిరమైన, సానుకూల విధానాలతో కూడిన క్రియాశీల, శరవేగ ఆర్థిక వ్యవస్థ అని ఈ సందర్భంగా పేర్కొంది. అయితే, అధిక ఇంధన ధరలతో పాటు ఎల్‌నినో కారణంగా వ్యవసాయ రంగానికి ఎదురవుతున్న సవాళ్ల కారణంగా ఈ ఏడాది భారత జీడీపీ వృద్ధి కాస్త మందగించవచ్చని ఈ అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ అభిప్రాయపడింది. అయినప్పటికీ, దేశ ఆర్థిక మూలాలు పటిష్ఠంగా ఉండనున్నాయని.. వచ్చే 2-3 ఏళ్లు బలమైన వృద్ధికి మద్దతివ్వనున్నాయని అంటోంది. ఎస్‌ అండ్‌ పీ 18 ఏళ్ల తర్వాత భారత పరపతి రేటింగ్‌ను సవరించింది. 2025 ఆగస్టులో బీబీబీ మైనస్‌ నుంచి బీబీబీకి మెరుగుపరిచింది. కాగా, బలమైన ఆర్థిక వృద్ధి నేపథ్యంలో భారత్‌కు స్థిర వైఖరితో కూడిన ‘బీబీబీ మైనస్‌’ పరపతి రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు మరో రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ ఈ నెల ఆరంభంలో ప్రకటించింది.


ఎస్‌ అండ్‌ పీ ప్రస్తావించిన మరిన్ని ముఖ్యాంశాలు

  • ప్రభుత్వ బలహీన ఆర్థిక పనితీరు, భారీ రుణ భారం, తక్కువ తలసరి ఆదాయం వంటి అంశాలు భారతదేశ పరపతికి ప్రతికూలంగా పరిణమించవచ్చు.

  • విధానాల్లో స్థిరత్వం, మౌలిక వసతులపై భారీ పెట్టుబడులు దీర్ఘకాలిక వృద్ధికి మద్దతివ్వనున్నాయి. భారత్‌ రేటింగ్‌పై స్థిర వైఖరిని ఇది ప్రతిబింబిస్తుంది.

  • దీర్ఘకాలంలో మెరుగైన వృద్ధి అవకాశాలు, స్థిరమైన ఆర్థిక, ద్రవ్య విధానాలు ప్రభుత్వ రుణ, వడ్డీ భారాన్ని కొంత మేర తగ్గించనున్నాయి. ఇది వచ్చే 24 నెలల్లో రేటింగ్‌కు మద్దతివ్వనుంది.

  • ప్రపంచంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న ఆర్థిక వ్యవస్థలో భారత్‌ ఒకటి. గడిచిన ఐదేళ్లలో (2021-22 నుంచి 2025-26) దేశ సగటు వార్షిక వృద్ధి 7.9 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో వృద్ధి రేటు 7.7 శాతంగా నమోదైంది.

  • పశ్చిమాసియాలో సంక్షోభంతో పెరిగిన ఇంధన ధరలు, వ్యవసాయ రంగంలో సవాళ్ల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో భారత జీడీపీ వృద్ధి రేటు 6.6 శాతానికి జారుకోవచ్చని అంచనా. కానీ, వచ్చే మూడు ఆర్థిక సంవత్సరాలకు సగటు వార్షిక వృద్ధి 7 శాతంగా ఉండవచ్చని భావిస్తున్నాం.

  • ఇంధనం, ఆహార ధరాఘాతం కారణంగా స్వల్పకాలికంగా ద్రవ్యోల్బణం సూచీ ఎగబాకినప్పటికీ, ఆర్‌బీఐ నియంత్రణ లక్ష్యాన్ని (2-6 శాతం) దాటకపోవచ్చు.


వార్తలనూ చదవండి:

పెట్‌ ఫుడ్స్‌ విభాగంలోకి విప్రో

2030 నాటికి భారత ఈవీ మార్కెట్‌
Read Latest 
AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 28 , 2026 | 04:05 AM