రవాణా వ్యవస్థల మధ్య సమన్వయం ఎలా?
ABN , Publish Date - Aug 28 , 2026 | 03:43 AM
భారతదేశం హైవేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, మెట్రో రైళ్ళు, గూడ్సు రైళ్ళు, హైస్పీడ్ రైళ్ళ వంటి రవాణా వ్యవస్థల నిర్మాణంలో ఇప్పటికే భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టింది. అయినప్పటికీ పౌరుల రోజువారీ ప్రయాణాలు సవ్యంగా సాగటం లేదు.
భారతదేశం హైవేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, మెట్రో రైళ్ళు, గూడ్సు రైళ్ళు, హైస్పీడ్ రైళ్ళ వంటి రవాణా వ్యవస్థల నిర్మాణంలో ఇప్పటికే భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టింది. అయినప్పటికీ పౌరుల రోజువారీ ప్రయాణాలు సవ్యంగా సాగటం లేదు. భిన్న రవాణా వ్యవస్థల మధ్య సమన్వయం లేకపోవటంతో అవి వేటికవిగా పనిచేస్తున్నాయి. విమానాశ్రయంలో దిగిన ప్రయాణికుడు అక్కడి నుంచి మెట్రో సర్వీసులకు కనెక్ట్ కావడంలో ఇబ్బందిపడుతున్నాడు. మెట్రో రైలు ప్రయాణికుడు బస్ కనెక్టివిటీ విషయంలో ఇబ్బంది పడుతున్నాడు.
ఇప్పుడు భారతదేశం ముందున్న సవాలు కొత్త రవాణా వ్యవస్థలను సృష్టించడం కాదు, ఉన్న వాటిని ఏకీకరించడం. జాతీయ అభివృద్ధి తదుపరి దశలో వేర్వేరు రకాల రవాణా వ్యవస్థల మధ్య సమన్వయం కీలకమైన అంశం. దీనికి కోఆర్డినేటెడ్ ప్లానింగ్, యూనిఫైడ్ టికెటింగ్, సమాంతర షెడ్యూళ్లు, ఇంటెలిజెంట్ లాస్ట్–మైల్ కనెక్టివిటీలు కావాలి.
జాతీయ ఆర్థిక ఉత్పత్తిలో సుమారు మూడింట ఒక వంతు మన నగరాల నుంచే వస్తున్నది. ముంబై, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, కలకత్తా, పూణే వంటి మెట్రోపాలిటన్ ప్రాంతాలు దేశ ఆర్థిక వృద్ధికి ఇంజన్లుగా ఉన్నాయి. అయితే రద్దీ, ప్రయాణ ఆలస్యాలు, ఇంధన వ్యయం, ఉత్పాదకత నష్టాలు ఆర్థిక వ్యవస్థపై భారాన్ని మోపుతున్నాయి.
ప్రధాన నగరాల్లో రద్దీ సమస్యల వల్ల కలిగే నష్టం ప్రతి ఏటా అనేక లక్షల కోట్ల రూపాయలకు చేరుతున్నది. పని గంటల నష్టం, పెరిగే ఖర్చులు, పర్యావరణానికి వాటిల్లే నష్టం, ఉత్పాదకత తగ్గడం– ఇవన్నీ కలిసి మనం మన రవాణా వ్యవస్థల మీద పెట్టిన పెట్టుబడుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయి. సమస్య పెట్టుబడుల కొరత కాదు, ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ పరస్పర సంబంధం లేకుండా విడిపోయి కొనసాగటం.
మన దేశంలో హైస్పీడ్ రైల్ (HSR) కార్యక్రమం ఇప్పుడు ప్రకటనల దశ నుంచి అమలు దశకు చేరుకుంది. 2026–27 కేంద్ర బడ్జెట్ ఏడు కొత్త హైస్పీడ్ రైల్ కారిడార్లను ఆమోదించింది. ఇవి సుమారు నాలుగువేల కిలోమీటర్లు కవర్ చేస్తాయి. రైల్వే మంత్రిత్వశాఖ అంచనా ప్రకారం అవసరమయ్యే మొత్తం పెట్టుబడి సుమారు రూ.16లక్షల కోట్లు. వారణాసి–సిలిగురి లైను మినహా మిగిలిన అన్ని కారిడార్లకు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ వివరంగా ప్రాజెక్ట్ రిపోర్టులు (డీపీఆర్) పూర్తి చేసింది.
తెలంగాణకు ప్రత్యేకంగా హైదరాబాద్– కేంద్రిక కారిడార్లు ముఖ్యం. ముంబై–హైదరాబాద్ లైన్ (711 కి.మీ.) డీపీఆర్ పూర్తయ్యింది. కర్ణాటకలో కలబురగి కీలక హబ్‌గా ఎదుగుతోంది. హైదరాబాద్–బెంగళూరు (618 కి.మీ.), హైదరాబాద్–చెన్నై (744 కి.మీ.) కారిడార్లు సర్వే, రీఅలైన్‌మెంట్ దశల్లో ఉన్నాయి. ఫ్యూచర్ సిటీ, డ్రై పోర్టు, వికారాబాద్, కోకాపేట, శంషాబాద్ వద్ద కొత్త స్టేషన్లను ప్రతిపాదించారు.
ముంబై–హైదరాబాద్–బెంగళూరు కారిడార్ భారతదేశ అత్యంత ముఖ్యమైన ఆర్థిక ప్రాంతాల్లో ఒకటిగా ఎదుగుతోంది. ఫైనాన్స్, టెక్నాలజీ, ఫార్మా స్యూటికల్స్, మాన్యుఫాక్చరింగ్, లాజిస్టిక్స్, ఏరోస్పేస్, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్స్‌ను ఈ కారిడార్ కలుపుతోంది. ఈ మెట్రోపాలిటన్ ప్రాంతాలు మూడూ కలిపి ఏటా రూ.70లక్షల కోట్లకు మించిన ఆర్థిక కార్యకలాపాలు చేస్తున్నాయి.
విమానాశ్రయాలు, రైల్వేలు, హైస్పీడ్ రైళ్ళు, మెట్రో రైళ్ళు, రాష్ట్ర రవాణా యూనిట్లు, ప్రైవేట్ వాహన సర్వీసులు... వీటన్నిటినీ ఒక ఉమ్మడి చట్రం కిందకు తీసుకువచ్చి ‘మల్టీ–మోడల్ ట్రాన్సిట్ కన్సార్టియం’ (ఎమ్‌ఎమ్‌టీసీ)ను ఏర్పాటు చేయాలి. ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్, కామన్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, యూనిఫైడ్ టికెటింగ్, కోఆర్డినేటెడ్ షెడ్యూలింగ్, షేర్డ్ మొబిలిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం ఈ ప్లాట్‌ఫాం ఏర్పాటు అవసరం. దీన్ని నడిపించాల్సిన మార్గదర్శక సూత్రం: ఒక ప్రయాణికుడు, ఒక టికెట్, ఒక ప్రయాణం, అనేక రవాణా పద్ధతులు (One Passenger, One Ticket, One Journey, Multiple Modes).
నీతి ఆయోగ్ ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ సమీక్షలో 5–10శాతం మెట్రో కారిడార్ల పెట్టుబడిని బస్సులు, వాటర్ ట్రాన్స్‌పోర్ట్ వంటి నాన్–మెట్రో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టుకు మళ్లించాలని సూచించింది. దీనినే మల్టీ మోడల్ ట్రాన్సిట్ కన్సార్టియం కింద జాతీయ స్థాయిలో అమలు చేయవచ్చు. ఎమ్‌ఎమ్‌టీసీ స్వతంత్ర వ్యవస్థగా విడిగా పనిచేయదు. ఇప్పటికే ఉనికిలో ఉన్న ఇండియన్ రైల్వేస్, హైస్పీడ్ రైల్, మెట్రో కార్పొరేషన్లు, పీఎమ్ గతిశక్తి ప్రాజెక్టులన్నిటి మధ్య కోఆర్డినేట్ చేస్తూ, ఒక ఇంటిగ్రేషన్ లేయర్‌గా పనిచేస్తుంది.
ఈ విధానంలో ప్రజలు రైలు, హైస్పీడ్ రైలు, మెట్రో, బస్సులు, విమానాశ్రయాల సేవలను ఒకే యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా పొందగలుగుతారు. వారు అక్కడే పలు రవాణా సదుపాయాల మధ్య తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకుని, బుక్ చేసుకుని, ధర చెల్లిస్తారు. మున్ముందు పాలకులు కొత్త రవాణా వ్యవస్థల కల్పన కంటే, ఇప్పటికే ఉనికిలో ఉన్న పలు రవాణా వ్యవస్థల మధ్య జాతీయ స్థాయిలో సమన్వయం సాధించే వ్యవస్థలను రూపొందించటం గురించే ముఖ్యంగా ఆలోచించాలి.
- డా. శశిధర్ పరస
చీఫ్ ఇంజనీర్, (TGEWIDC)