భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్.. 25,400కు చేరువలో నిఫ్టీ..
ABN , Publish Date - Nov 11 , 2026 | 11:47 AM
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. దీపావళి బలిప్రతిపద సెలవు అనంతరం తిరిగి ప్రారంభమైన మార్కెట్లలో కొనుగోళ్ల జోరు కనిపిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. దీపావళి బలిప్రతిపద సెలవు అనంతరం తిరిగి ప్రారంభమైన మార్కెట్లలో కొనుగోళ్ల జోరు కనిపిస్తోంది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) మళ్లీ భారత ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెంచడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపాయి. దీంతో సెన్సెక్స్ 1,250 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ 25,400 మార్కుకు చేరువైంది (Sensex Today).
బుధవారం ఉదయం 11.30 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 1,257.64 పాయింట్లు పెరిగి 82,364 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 336 పాయింట్లు లాభపడి 25,388 స్థాయికి చేరుకుంది. ఈ రెండు సూచీలు ఎనిమిది నెలల గరిష్ఠ స్థాయిలకు చేరుకోవడం విశేషం. నవంబర్ నెలలో ఇప్పటివరకు సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 10 శాతం మేర పెరిగాయి. భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల కొనుగోళ్లు పెరగడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది (Indian Stock Market Rally).
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం కూడా భారత మార్కెట్లకు కలిసొచ్చింది. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 89.16 డాలర్లకు పడిపోయి రెండు నెలల కనిష్ఠ స్థాయిని తాకింది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గవచ్చన్న అంచనాలు సరఫరాపై ఆందోళనలను తగ్గించాయి. చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారత్‌కు ఇది సానుకూల పరిణామం. జపాన్ నిక్కీ, దక్షిణ కొరియా కోస్పీ సూచీలు లాభాల్లో ట్రేడయ్యాయి. అమెరికా స్టాక్ ఫ్యూచర్స్ కూడా కోలుకోవడంతో భారత మార్కెట్లకు మద్దతు లభించింది (Nifty Above 25400).
అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ కూడా మెరుగుపడింది (Share Market Today). డాలర్‌తో పోల్చుకుంటే 93.81 స్థాయికి చేరుకుంది. విదేశీ పెట్టుబడుల రాక, చమురు ధరల తగ్గుదల రూపాయికి మద్దతుగా నిలిచాయి. మార్కెట్లో దాదాపు అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. ఫార్మా మినహా నిఫ్టీలోని అన్ని రంగాల సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లలోనూ కొనుగోళ్ల జోరు కనిపించింది. నిఫ్టీకి 25,500 స్థాయి కీలక నిరోధంగా ఉండనుంది. ఈ స్థాయిని అధిగమించి నిలదొక్కుకుంటే మరింత పైకి వెళ్లే అవకాశాలున్నాయి.
ఇవి కూడా చదవండి..
యుద్ధానికి ముగింపు పలకాలంటే.. అమెరికాకు ఇరాన్ ఏం చెప్పిందంటే..
స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే...