Share News

జియో కొత్త విప్లవం.. 'హేయ్ జియో' ఏఐ ఏజెంట్.. స్మార్ట్ హోమ్ కోసం 'టెలిఫ్రేమ్'

ABN , Publish Date - Jun 19 , 2026 | 05:51 PM

రిలయన్స్ జియో నిర్వహించిన వార్షిక సాధారణ సమావేశం వేదికగా AI రంగంలో సరికొత్త సంచలనానికి తెరలేపింది. 'జియో కాల్ ఏఐ ఏజెంట్', 'న్యూ మై జియో', 'జియో టెలిఫ్రేమ్' వంటి అద్భుతమైన ఆవిష్కరణలను ఆకాశ్ అంబానీ ప్రకటించారు.

జియో కొత్త విప్లవం.. 'హేయ్ జియో' ఏఐ ఏజెంట్.. స్మార్ట్ హోమ్ కోసం 'టెలిఫ్రేమ్'
Reliance Jio Unveils ‘Hey Jio’ AI Agent, AI-Powered MyJio App and Teleframe at AGM 2026

ముంబై, జూన్ 19: ఏటా సరికొత్త సాంకేతికతలతో కస్టమర్లను ఆకట్టుకునే రిలయన్స్ జియో.. ఇవాళ నిర్వహించిన వార్షిక సాధారణ సమావేశం (AGM) వేదికగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో సరికొత్త సంచలనానికి తెరలేపింది. కృత్రిమ మేధను దేశ పౌరులందరికీ మరింత చేరువ చేస్తూ.. 'జియో కాల్ ఏఐ ఏజెంట్', 'న్యూ మై జియో', ఇంకా 'జియో టెలిఫ్రేమ్' వంటి అద్భుతమైన ఆవిష్కరణలను జియో ప్లాట్‌ఫామ్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాశ్ అంబానీ ప్రకటించారు. ఈ ఏడాది చివరికల్లా జియో యూజర్లందరికీ ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఏజీఎంలో ప్రకటించిన ఆ విప్లవాత్మక ఫీచర్ల వివరాలేంటో చూద్దాం..


1. యాప్ అక్కర్లేదు.. ఫోన్ కాల్‌లోనే 'హేయ్ జియో'!

జియో నెట్‌వర్క్‌లోనే నేరుగా ఏఐ అసిస్టెంట్‌ను అనుసంధానం చేస్తూ కంపెనీ 'జియో కాల్ ఏఐ ఏజెంట్'ను పరిచయం చేసింది. దీనికోసం యూజర్లు ఎలాంటి ప్రత్యేక యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంతేకాదు, మీరు ఎవరితోనైనా ఫోన్ కాల్‌లో మాట్లాడుతున్నప్పుడు 'హేయ్ జియో' అని పిలిస్తే చాలు.. ఈ ఏఐ ఏజెంట్ యాక్టివేట్ అయి మీ అనుమతితో కాల్‌లో జాయిన్ అవుతుంది.

రియల్ టైమ్ ట్రాన్స్‌క్రిప్షన్: మీతో పాటు 10 మంది కాన్ఫరెన్స్ కాల్‌లో ఉన్నా.. అందరి సంభాషణలను రియల్ టైమ్‌లో గుర్తిస్తుంది. అంతేకాదు, మీ స్థానిక భాషలోనే టెక్స్ట్ రూపంలోకి (Transcription) మారుస్తుంది.

కాల్ సమ్మరీ: కాల్ ముగిసిన తర్వాత ఆ సంభాషణల సారాంశాన్ని మీకు (Summary) అందజేస్తుంది.

మీ తరఫున పనులు: మీ ఫోన్ కాల్ నుంచే క్యాబ్ బుక్ చేయడం, ఫుడ్ ఆర్డర్ చేయడం, రెస్టారెంట్‌లో టేబుల్ బుక్ చేయడం వంటి పనులను కూడా ఈ ఏజెంట్ సులువుగా పూర్తి చేస్తుంది.

2. పర్సనల్ ఏఐ అడ్వైజర్‌గా మారనున్న 'మై జియో' యాప్

ప్రస్తుతం కేవలం రీఛార్జ్‌లు, అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికే పరిమితమైన 'మై జియో' (MyJio) యాప్‌ను కంపెనీ పూర్తిగా మార్చబోతోంది. ఇది ఇకపై మీ పర్సనల్ ఏఐ అడ్వైజర్, రిలేషన్‌షిప్ మేనేజర్‌గా వ్యవహరిస్తుంది. యాప్‌లో వేర్వేరు ఆప్షన్ల కోసం వెతుక్కోకుండా.. మీకు ఏం కావాలో నోటితో చెప్తే ఏఐ అసిస్టెంట్ ఆ పని పూర్తి చేస్తుంది. ఉదాహరణకు, మీ జియో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ను వేరే అడ్రస్‌కు మార్చాలన్నా లేదా మీరు విదేశాలకు వెళ్తున్నప్పుడు బెస్ట్ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్ ఏంటో తెలుసుకోవాలన్నా ఈ ఏఐ అసిస్టెంటే చూసుకుంటుంది.

3. జియో టెలిఫ్రేమ్ (Jio Teleframe).. మీ ఇంటి సరికొత్త ఏఐ హబ్!

ఇళ్లలో ఉండే వివిధ రకాల ఏఐ ఏజెంట్లకు ఓ కేంద్రంగా పనిచేసేలా 'జియో టెలిఫ్రేమ్' అనే సరికొత్త గ్యాడ్జెట్‌ను జియో ఆవిష్కరించింది. ఇది మీ గదిలోనే ఉంటూ.. మీ రోజువారీ అవసరాలను గుర్తించి స్మార్ట్ సలహాలు ఇస్తుంది.

స్మార్ట్ రిమైండర్లు: మీ డాక్టర్ అపాయింట్‌మెంట్ ఉంటే గుర్తుచేస్తుంది. ఒకవేళ బయట వర్షం పడేలా ఉంటే 'గొడుగు తీసుకెళ్లండి' అంటూ సలహా ఇస్తుంది.

ఎంటర్‌టైన్‌మెంట్: మీరు క్రికెట్ మ్యాచ్ చూడాలనుకుంటే ఆటోమేటిక్‌గా జియో హాట్‌స్టార్‌ను ప్లే చేయడమే కాకుండా, దాని డిస్‌ప్లేపై లైవ్ స్కోరును కూడా చూపిస్తుంది.

యూజర్ల పూర్తి అనుమతి, భద్రతా ప్రమాణాలతోనే ఈ ఏఐ ఏజెంట్లు పనిచేస్తాయని కంపెనీ స్పష్టం చేసింది. భవిష్యత్తు టెక్నాలజీని సామాన్యుడి దైనందిన జీవితంలో భాగం చేయడంలో జియో తీసుకువచ్చిన ఈ మార్పులు టెలికాం రంగంలో సరికొత్త మైలురాయిగా నిలవనున్నాయని జియో ప్రకటించింది.


ఇవి కూడా చదవండి...

హోటల్స్, రెస్టారెంట్లలో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల దాడులు.. షాకింగ్ విషయాలు వెలుగులోకి

వాన్‌‌పిక్‌ ఆస్తుల వ్యవహారం.. హైకోర్టులో ఈడీ పిటిషన్ డిస్మిస్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 19 , 2026 | 06:03 PM