రుణాలు చెల్లించని వారి పట్ల బ్యాంకులు, రికవరీ ఏజెంట్ల తీరుపై రిజర్వ్ బ్యాంక్ తీవ్ర ఆగ్రహం
ABN , Publish Date - May 21 , 2026 | 03:19 PM
రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించని కస్టమర్లను వేధించే బ్యాంకులు, రికవరీ ఏజెంట్ల తీరుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్సనల్ లోన్, కార్ లోన్ లేదా హోమ్ లోన్ బకాయిలను వసూలు చేయడానికి కస్టమర్ల మొబైల్ ఫోన్లను డిసేబుల్ చేయడం వంటి పద్ధతులకు స్వస్తి పలకాలని ప్రతిపాదించింది.
ముంబై, మే 21: రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించని (డిఫాల్టర్లు) కస్టమర్లను వేధించే బ్యాంకులు, రికవరీ ఏజెంట్ల తీరుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్సనల్ లోన్, కార్ లోన్ లేదా హోమ్ లోన్ బకాయిలను వసూలు చేయడానికి కస్టమర్ల మొబైల్ ఫోన్లను డిసేబుల్ చేయడం లేదా వాటి పనితీరును నిలిపివేయడం వంటి పద్ధతులకు స్వస్తి పలకాలని ఆర్బీఐ తాజాగా ప్రతిపాదించింది. ఈ మేరకు రికవరీ ఏజెంట్ల ప్రవర్తన, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై కఠినమైన మార్గదర్శకాలతో కూడిన ముసాయిదాను విడుదల చేసింది.
దీనికి సంబంధించిన ముఖ్యమైన నిబంధనలు, నిబంధనలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
1. మొబైల్ ఫోన్ బ్లాకింగ్‌పై ఆంక్షలు
సాధారణ రుణాల (పర్సనల్, హోమ్, కార్ లోన్స్) వసూళ్ల కోసం కస్టమర్ల ఫోన్లను లేదా టాబ్లెట్లను టెక్నాలజీ ద్వారా బ్లాక్ చేయడానికి వీల్లేదు. అయితే, ఒకవేళ సదరు మొబైల్ ఫోన్‌ను సదరు బ్యాంక్ ఇచ్చిన లోన్ ద్వారానే కొనుగోలు చేసి ఉంటే, దాన్ని బ్లాక్ చేయడానికి బ్యాంకుకు అనుమతి ఉంటుంది. కానీ, దానికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి.
90 రోజుల గడువు: లోన్ ఈఎంఐ చెల్లించకుండా 90 రోజులు దాటిపోయి (90 days past due), బ్యాంకు నోటీసులు ఇచ్చినప్పటికీ కస్టమర్ స్పందించకపోతేనే ఫోన్ బ్లాక్ చేయాలి.
అత్యవసర సేవలకు ఆటంకం కలగకూడదు: ఫోన్ బ్లాక్ చేసినప్పటికీ ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఇన్‌కమింగ్ కాల్స్, అత్యవసర ఎస్ఓఎస్ (Emergency SOS) ఫీచర్లు, ప్రభుత్వ పబ్లిక్-సేఫ్టీ నోటిఫికేషన్లు వంటి అత్యవసర సేవలను నిలిపివేయకూడదు.
2. ఆలస్యమైతే కస్టమర్‌కు గంటకు రూ. 250 పరిహారం!
కస్టమర్ బకాయిలను చెల్లించిన వెంటనే (Default Cure చేసిన వెంబడే), గరిష్టంగా ఒక గంట లోపు మొబైల్ ఫోన్‌పై విధించిన ఆంక్షలను బ్యాంకులు తొలగించాలి. ఒకవేళ తప్పుడు కారణాలతో ఫోన్ బ్లాక్ చేసినా, లేదా బకాయిలు చెల్లించిన తర్వాత కూడా గంటలోపు అన్‌లాక్ చేయకపోయినా.. బ్యాంకు కస్టమర్‌కు గంటకు రూ. 250 చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
3. రికవరీ ఏజెంట్ల వేధింపులకు చెక్
కస్టమర్లను సామాజిక మాధ్యమాల ద్వారా అవమానించడం, బూతు పదజాలం ఉపయోగించడం వంటి ఫిర్యాదులపై ఆర్బీఐ తీవ్రంగా స్పందించింది. రికవరీ ప్రక్రియలో క్రింది పద్ధతులను 'కఠినమైన పద్ధతులు' (Harsh Methods)గా పరిగణించి నిషేధించింది.
* కస్టమర్లను లేదా హామీదారులను (Guarantors) భయపెట్టేలా మాట్లాడటం, బూతులు తిట్టడం.
* సోషల్ మీడియాలో కస్టమర్ల ఆడియో/వీడియో రికార్డింగులు లేదా వ్యక్తిగత వివరాలను పోస్ట్ చేయడం.
* మొబైల్ లేదా సోషల్ మీడియా యాప్స్ ద్వారా అసభ్యకరమైన మెసేజ్‌లు పంపడం.
* కస్టమర్లకు పరిమితికి మించి మితిమీరిన కాల్స్ లేదా మెసేజ్‌లు చేయడం.
4. రికవరీ కాల్స్ రికార్డింగ్ తప్పనిసరి
బ్యాంక్ ఉద్యోగులు లేదా రికవరీ ఏజెంట్లు కస్టమర్లకు చేసే ప్రతి కాల్ సమయం, కాల్స్ సంఖ్యను బ్యాంకులు రికార్డు చేయాలి. అలాగే ఆ కాల్స్‌లో ఏం మాట్లాడారనే (ఆడియో/టెక్స్ట్) కంటెంట్‌ను కూడా భద్రపరచాలి. బ్యాంకులకు ప్రత్యేక రికవరీ పాలసీ ఉండాలని, నిబంధనలు ఉల్లంఘించే ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ స్పష్టం చేసింది.
అమలు ఎప్పటి నుంచి?
ఈ సవరించిన నిబంధనలను అక్టోబర్ 1, 2026 నుంచి అమలు చేయాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. ఈ ముసాయిదాపై స్టేక్‌హోల్డర్లు, సాధారణ ప్రజలు తమ అభిప్రాయాలను, సలహాలను మే 31 వరకు తెలియజేయవచ్చు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRBs), కోఆపరేటివ్ బ్యాంకులు, NBFCలకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి.
ఇవి కూడా చదవండి...
దళిత డ్రైవర్ హత్య కేసు.. రాజమండ్రి కోర్టులో రెండో రోజు విచారణ
కిరీటం మాయంపై విచారణ.. అందుబాటులోని లేని ట్రస్ట్ సభ్యులు.. ఏసీ ఆగ్రహం
Read Latest AP News And Telugu News