తల్లిదండ్రుల బంగారం అమ్మి ఇల్లు కొన్న వ్యక్తి.. రూ.60 లక్షల ఐటీ నోటీసు ఎందుకొచ్చిందంటే..
ABN , Publish Date - Nov 27 , 2026 | 06:15 PM
తల్లిదండ్రులు ఇచ్చిన బంగారాన్ని అమ్మి ఇల్లు కొనుగోలు చేసిన ఓ వ్యక్తికి ఆదాయపు పన్ను శాఖ షాకిచ్చింది. ఏకంగా రూ.60.08 లక్షల ఆదాయాన్ని లెక్కల్లో చూపించలేదంటూ నోటీసు ఇచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: తల్లిదండ్రులు ఇచ్చిన బంగారాన్ని అమ్మి ఇల్లు కొనుగోలు చేసిన ఓ వ్యక్తికి ఆదాయపు పన్ను శాఖ షాకిచ్చింది. ఏకంగా రూ.60.08 లక్షల ఆదాయాన్ని లెక్కల్లో చూపించలేదంటూ నోటీసు ఇచ్చింది. ఈ రూ.60 లక్షల్లో రూ.34.39 లక్షలు బంగారం అమ్మకం ద్వారా వచ్చిన డబ్బు కాగా.. మరో రూ.25.69 లక్షలు బ్యాంకులో నగదు డిపాజిట్లకు సంబంధించినవి. సదరు వ్యక్తి తన తండ్రి నుంచి 968 గ్రాముల బంగారు ఆభరణాలు, తల్లి నుంచి 310 గ్రాముల ఆభరణాలు బహుమతిగా పొందాడు. అలాగే ఆయన అమ్మమ్మ నుంచి కొంత బంగారం వచ్చింది (Rs 60 Lakh Tax Notice).
ఈ ఆభరణాలను విక్రయించగా వచ్చిన డబ్బుతో ఇంటిని కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 54ఎఫ్ కింద రూ.34,39,293 దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను మినహాయింపును కోరాడు. అయితే బంగారం నిజంగా తల్లిదండ్రుల నుంచి బహుమతిగా వచ్చిందని నిరూపించే తగిన పత్రాలు సమర్పించలేదని పన్ను అధికారులు మినహాయింపును తిరస్కరించారు. అలాగే సదరు వ్యక్తి ఖాతాలో ఉన్న రూ.9.36 లక్షలు, అతడి భార్య ఖాతాలో ఉన్న రూ.16.32 లక్షలు.. మొత్తం రూ.25,68,850 నగదు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై కూడా ఆదాయపు పన్ను అధికారులు వివరణ కోరారు (Income Tax India).
ఈ నగదు తన వద్ద గతంలో ఉన్న పొదుపు, వ్యాపార ఆదాయం నుంచి సమకూరిందని అతడు వాదించాడు. తన భార్య ఖాతాలోని డబ్బు ఆమె సొంత ఆదాయం, పొదుపు, వివాహ సమయంలో బంధువులు ఇచ్చిన కానుకల నుంచి వచ్చిందని తెలిపాడు. అయితే సరైన ఆధారాలు లేవంటూ పన్ను అధికారులు ఈ మొత్తాన్ని సెక్షన్ 68 కింద వివరించని ఆదాయంగా పరిగణించారు. దీంతో బంగారం అమ్మకం, నగదు డిపాజిట్లు కలిపి రూ.60.08 లక్షల మేర పన్ను వివాదం ఏర్పడింది. ఆదాయపు పన్ను శాఖ నిర్ణయాన్ని సవాలు చేస్తూ బాధితుడు ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ITAT) ముంబై బెంచ్‌ను ఆశ్రయించాడు (Gold Jewellery Tax Rules).
ఈ కేసును పరిశీలించిన ముంబై బెంచ్ కీలక విషయాన్ని గుర్తించింది. అప్పీల్ విచారణ సందర్భంగా పన్ను అధికారులు అదనపు వివరాలు, ఆధారాలు సమర్పించాలని కోరుతూ కొత్తగా నోటీసు జారీ చేయలేదని పేర్కొంది. తగిన అవకాశం ఇవ్వకుండా పన్ను మినహాయింపును తిరస్కరించడం సరైన విధానం కాదని అభిప్రాయపడింది. అందువల్ల కేసును తిరిగి అసెసింగ్ అధికారికి పంపిస్తూ, అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించి చట్ట ప్రకారం కొత్తగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
ఇవి కూడా చదవండి..
అది మీ బాధ్యత.. మదురై కలెక్టర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం..
మూడేళ్లకు రూ.50 లక్షల కోట్లకు పైగా.. రష్యా చరిత్రలోనే భారీ రక్షణ బడ్జెట్..