11 ఏళ్ల ప్రయాణానికి ముగింపు.. ఫ్లిప్‌కార్ట్ సీఈఓ పదవికి కళ్యాణ్ రాజీనామా
ABN , Publish Date - Nov 25 , 2026 | 03:01 PM
వాల్‌మార్ట్‌కు చెందిన ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ గ్రూప్‌లో పెనుమార్పు చోటుచేసుకుంది. ఆ సంస్థ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి తన పదవికి రాజీనామా చేశారు. పదకొండేళ్లకు పైగా సంస్థతో ఉన్న అనుబంధానికి ఆయన వీడ్కోలు పలికారు.
ఇంటర్నెట్ డెస్క్: వాల్‌మార్ట్‌కు చెందిన ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ గ్రూప్‌లో పెనుమార్పు చోటుచేసుకుంది. ఆ సంస్థ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి తన పదవికి రాజీనామా చేశారు. పదకొండేళ్లకు పైగా సంస్థతో ఉన్న అనుబంధానికి ఆయన వీడ్కోలు పలికారు. కళ్యాణ్ రాజీనామాను ఇవాళ(బుధవారం) కంపెనీ అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 4 వరకు ఆయన సీఈఓ పదవిలో ఉండనున్నారని నివేదికలు పేర్కొంటున్నాయి. నూతన సీఈఓను త్వరలో ప్రకటించనున్నట్లు సంస్థ వెల్లడించింది. అప్పటివరకు చీఫ్ ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ బాలాజీ త్యాగరాజన్, బోర్డుతో కలిసి తాత్కాలికంగా సంస్థను నడిపించనున్నారు.
కళ్యాణ్ 2017 జనవరిలో ఫ్లిప్‌కార్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2018లోనే ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓగా నియమితులయ్యారు. అంతకుముందు టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్, ఈబే, పీఅండ్‌జీ సంస్థల్లో పనిచేశారు. ఆయన కాలంలో 2018లో అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ సుమారు 16 బిలియన్ డాలర్లతో 77 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ-కామర్స్‌తో పాటు కిరాణా, ఫిన్‌టెక్, క్విక్ కామర్స్ (ఫ్లిప్‌కార్ట్ మినిట్స్) విభాగాల్లో విస్తరిస్తూ, వ్యాపారాన్ని వృద్ధి చేయడంలో కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు.
50 కోట్లకు పైగా వినియోగదారులున్న ఫ్లిప్‌కార్ట్, పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ఈ మార్పు చోటుచేసుకుంది. ఇటీవలే హోల్డింగ్ కంపెనీని సింగపూర్ నుంచి భారత్‌కు మార్చారు. ఇక్కడ దీర్ఘకాలిక అవకాశాలు, ఫ్లిప్‌కార్ట్ పట్ల తమ నిబద్ధత చెక్కుచెదరలేదని వాల్‌మార్ట్ స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి:
తిరుపరంకుండ్రం కొండపై దీపం వివాదం.. వందేళ్ల క్రితం అసలేం జరిగిందంటే..
ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట