Share News

ద్రవ్యోల్బణంలోనూ తక్కువ ధరకే ఫుడ్.. మెక్‌డొనాల్డ్స్‌కు కస్టమర్ల క్యూ

ABN , Publish Date - Oct 24 , 2026 | 06:41 PM

ఖర్చులు పెరిగినప్పుడు సాధారణంగా మనలో చాలా మంది హోటళ్లు, రెస్టారెంట్లలో తినడం తగ్గిస్తారు. ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. అదే సమయంలో తక్కువ ధరకు మంచి ఆహారం అందించే రెస్టారెంట్ల వైపు చూస్తారు.

ద్రవ్యోల్బణంలోనూ తక్కువ ధరకే ఫుడ్.. మెక్‌డొనాల్డ్స్‌కు కస్టమర్ల క్యూ

ఇంటర్నెట్ డెస్క్: ఖర్చులు పెరిగినప్పుడు సాధారణంగా మనలో చాలా మంది హోటళ్లు, రెస్టారెంట్లలో తినడం తగ్గిస్తారు. ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. అదే సమయంలో తక్కువ ధరకు మంచి ఆహారం అందించే రెస్టారెంట్ల వైపు చూస్తారు. దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో 4.83 శాతం ఉండగా, సెప్టెంబర్‌లో అది 5.54 శాతానికి పెరిగింది. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం కూడా 5.97 శాతం నుంచి 7.74 శాతానికి పెరిగింది. ఈ పరిస్థితుల్లో వినియోగదారులకు తక్కువ ధరకు ఆహారం అందిస్తూ ఖర్చులను నియంత్రించడంపై వెస్ట్‌లైఫ్ ఫుడ్‌వరల్డ్ దృష్టి పెట్టింది. ఈ సంస్థ పశ్చిమ, దక్షిణ భారతదేశంలో మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్లను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రూ.99కే భోజనం అందిస్తోంది. ఆ సంస్థ సీఈఓ అక్షయ్ జాటియా మాట్లాడుతూ.. పరిస్థితులు కష్టంగా ఉన్నప్పటికీ మెక్‌డొనాల్డ్స్ మంచి ధరకు ఆహారం అందిస్తోందని చెప్పారు. ధరలను భారీగా తగ్గించకుండా, ఎక్కువగా పెంచకుండా వినియోగదారులకు మంచి ఆహారం అందించడమే తమ లక్ష్యమని తెలిపారు.


కంపెనీ అమ్మకాలు ఇలా..

సెప్టెంబర్ త్రైమాసికంలో వెస్ట్‌లైఫ్ ఫుడ్‌వరల్డ్ మంచి వృద్ధిని నమోదు చేసింది. ఆదాయం నిరుటితో పోలిస్తే 16 శాతం పెరిగి రూ.747 కోట్లకు చేరింది. స్టోర్‌లో అమ్మకాలు 10. శాతం పెరిగాయి. కస్టమర్ల సంఖ్య ప్రతి నెలా రెండంకెల శాతంలో పెరిగింది. రెస్టారెంట్‌లో కూర్చొని తినే వారి అమ్మకాలు 17 శాతం పెరిగాయి. పార్సిల్, ఇతర మార్గాల్లో జరిగే అమ్మకాలు 15 శాతం పెరిగాయి. ధరల పెరుగుదల ఉన్నప్పటికీ.. మెక్‌డొనాల్డ్స్‌కు వస్తున్న కస్టమర్ల సంఖ్య పెరుగుతూనే ఉంది.


రూ.99కే కస్టమర్లకు గాలం

వెస్ట్‌లైఫ్ గత సంవత్సరం నుంచే తక్కువ ధరలకు ఆహారం అందిస్తోంది. మొదట పశ్చిమ భారతదేశంలో రూ.99కే ఆహారం అందించి చూసింది. తర్వాత దక్షిణ భారతదేశంలో కూడా ఆ విధానాన్ని అమలు చేసింది. ఈ పథకంతో కొత్త కస్టమర్లను ఆకర్షించడంతో పాటు, ఇప్పటికే వచ్చిన వారు మళ్లీమళ్లీ రెస్టారెంట్‌కు వచ్చేలా చేయాలని కంపెనీ భావిస్తోంది. అక్టోబర్‌లో జరిగిన కంపెనీ సమావేశంలో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ కల్రా మాట్లాడుతూ.. గత త్రైమాసికాలతో పోలిస్తే డిస్కౌంట్లను పెంచకుండానే తమ తక్కువ ధరల పథకాన్ని మరింత బలోపేతం చేశామన్నారు. కొన్ని సందర్భాల్లో డిస్కౌంట్లను తగ్గించడం ద్వారా పెరుగుతున్న ఖర్చులను నియంత్రించామని కూడా చెప్పారు.


ఇవి కూడా చదవండి..

అమెరికా మధ్యంతర ఎన్నికలు.. కెనడాకు ట్రంప్ ఊరట..


మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Oct 24 , 2026 | 07:41 PM