Share News

నేపాల్‌లో ప్రమాదాన్ని ముందే పసిగట్టిన హైదరాబాద్ ఉపగ్రహం

ABN , Publish Date - Oct 24 , 2026 | 04:41 PM

ఈ ఏడాది ఆగస్టు 26న నేపాల్‌లో సంభవించిన భారీ వరదలకు కొన్ని వారాల ముందే పర్వత వాలులో కదలికలు ప్రారంభమయ్యాయని భారత్‌-అమెరికా సంయుక్త ఉపగ్రహం నిసార్ గుర్తించింది. అయితే ఆ సంకేతాలను ఎవరూ సకాలంలో విశ్లేషించలేకపోయారని శాస్త్రవేత్తలు తెలిపారు.

నేపాల్‌లో ప్రమాదాన్ని ముందే పసిగట్టిన హైదరాబాద్ ఉపగ్రహం

ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏడాది ఆగస్టు 26న నేపాల్‌లో సంభవించిన భారీ వరదలకు కొన్ని వారాల ముందే పర్వత వాలులో కదలికలు ప్రారంభమయ్యాయని భారత్‌-అమెరికా సంయుక్త ఉపగ్రహం నిసార్ గుర్తించింది. అయితే ఆ సంకేతాలను ఎవరూ సకాలంలో విశ్లేషించలేకపోయారని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇస్రోకు చెందిన హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్‌ఎస్‌సీ) శాస్త్రవేత్తలు ఈ విషయంపై పరిశోధన చేశారు. 12 మంది పరిశోధకులు సంయుక్తంగా చేసిన ఈ అధ్యయనం జర్నల్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఫర్ రిమోట్ సెన్సింగ్ అనే సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురితమైంది. నేపాల్‌లోని రసువా జిల్లాలో జరిగిన ఈ విపత్తుపై వచ్చిన తొలి శాస్త్రీయ అధ్యయనం ఇదే.


ఉపగ్రహం గుర్తించింది ఇదే..

నిసార్ ఉపగ్రహం ఈ ఏడాది జూన్ 20 నుంచి ఆగస్టు 19 వరకు సేకరించిన రాడార్ సమాచారాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు. కొండ వాలులో ఒక ప్రాంతం అస్థిరంగా ఉందని, అది వేగంగా కదులుతోందని ఉపగ్రహ సమాచారం వెల్లడించింది. జులై 26 నుంచి ఆగస్టు 19 మధ్య ఈ కదలికలు మరింత స్పష్టంగా కనిపించాయి. కొన్ని ప్రాంతాల్లో భూమి ఐదు మీటర్లకు పైగా కదిలినట్లు ఉపగ్రహం గుర్తించింది. విపత్తు జరిగిన తర్వాత తీసిన ఉపగ్రహ చిత్రాలతో పోల్చి పరిశీలించగా ఈ ప్రమాద సంకేతాలు స్పష్టంగా అర్థమయ్యాయని పరిశోధకులు తెలిపారు. కాగా.. నిసార్ ఉపగ్రహానికి 1.3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.12 వేల కోట్లు) ఖర్చయ్యాయి. నిరుడు జులై 30న దీనిని ప్రయోగించారు. ఈ ఉపగ్రహం ప్రతి 12 రోజులకు ఒకసారి భూమికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి పంపుతుంది.


ప్రమాదం ఎలా జరిగింది?

ఆగస్టు 26న ఉదయం లాంగ్‌టాంగ్ లిరుంగ్ శిఖరానికి ఉత్తరంగా ఉన్న హిమానీనదం నుంచి భారీగా మంచు, గడ్డకట్టిన నేలలోని రాళ్లు విరిగిపడ్డాయి. ఈ కొండచరియల మొత్తం పరిమాణం సుమారు 9.9 కోట్ల క్యూబిక్ మీటర్లు. ఇది న్యూయార్క్‌లోని ఎంపైర్ స్టేట్ భవనం వంటి 115 భవనాల పరిమాణానికి సమానమని పరిశోధకులు తెలిపారు. ఈ శిథిలాలు సుమారు 2,170 మీటర్ల ఎత్తు నుంచి కిందికి జారాయి. లోయలో 5.9 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత భారీ వరదగా మారాయి. ఈ వరద లెహండే ఖోలా, త్రిశూలి నదీ ప్రాంతాల వెంట సుమారు 72 కిలోమీటర్ల మేర ప్రభావం చూపింది. రహదారులు, వంతెనలు, భవనాలు, సొరంగాలు ధ్వంసమయ్యాయి. నేపాల్‌–చైనా వాణిజ్య మార్గానికి కూడా తీవ్ర నష్టం జరిగిన విషయం తెలిసిందే.


ఈ వార్తలూ చదవండి

అభిజీత్ దీప్కే లాంటి వాళ్లు వస్తారు.. సీజేపీ నేతపై పీయూష్ గోయల్ వ్యాఖ్యలు..

గ్రీకు రెస్టారెంట్‌లో తొలి పరిచయం.. రాజీవ్‌ గాంధీతో ప్రేమకథను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ..

Updated Date - Oct 24 , 2026 | 05:21 PM