పసిడి దిగుమతులకుసుంకాల బ్రేక్
ABN , Publish Date - Nov 04 , 2026 | 03:18 AM
పసిడి దిగుమతులకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలిస్తున్నాయి.
సెప్టెంబరు త్రైమాసికంలో 29శాతం తగ్గుదల
విలువపరంగా 3శాతం అప్
46శాతం తగ్గిన నికర దిగుమతులు
న్యూఢిల్లీ: పసిడి దిగుమతులకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలిస్తున్నాయి. ఈ దిగుమతులను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మే నెలలో దిగుమతి సుంకాన్ని 6శాతం నుంచి 15 శాతానికి పెంచింది. 3 శాతం జీఎస్టీని కూడా కలిపితే ప్రస్తుతం పసిడి కొనుగోళ్లపై కొనుగోలుదారులు 18శాతంవరకు పన్నులు చెల్లించాల్సి వస్తోంది. ఈ ప్రభావం పసిడి దిగుమతులపైనా కనిపిస్తోంది. ఈ దెబ్బతో జూలై-సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో పసిడి దిగుమతులు 162.5 టన్నులకు పడిపోయాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 29శాతం తక్కువని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. పసిడి నగల ఎగుమతులను తీసివేస్తే నికర దిగుమతులు 46 శాతం వరకు తగ్గాయి. ధరలు చుక్కలంటడం, విదేశీ మారక ద్రవ్యాన్ని పొదుపు చేసేందుకు బంగారం కొనడం ఆపండి బాబూ అంటూ ప్రధాని మోదీ చేసిన విజ్ఞప్తి కూడా ఇందుకు కారణంగా కనిపిస్తోంది.
నగలు, నాణేలదీ ఇదే పరిస్థితి
గత ఏడాది సెప్టెంబరు త్రైమాసికంలో దేశీయ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర సగటున రూ.1,02,287 పలికింది. ఈ ఏడాది సెప్టెంబరు త్రైమాసికానికి అది దిగుమతి సుంకం, జీఎ్‌సటీ లేకుండా రూ.1,48,891కు చేరింది. దీంతో సంపన్న వర్గాలు తప్ప.. మిగతా ప్రజలు తప్పనిసరైతే తప్ప నగల దుకాణాల గడప తొక్కేందుకు సాహసించలేదు. ఫలితంగా సెప్టెంబరు త్రైమాసికంలో పసిడి నగల కొనుగోళ్లూ గణనీయంగా తగ్గాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 20శాతం తగ్గి 125 టన్నులకు పడిపోయినట్టు డబ్ల్యూజీసీ నివేదిక తెలిపింది. ఇదే సమయంలో దేశంలో పసిడి నాణేలు, కడ్డీల అమ్మకాలూ 40శాతంపడిపోయాయి.
విలువపరంగా పెరుగుదల
సెప్టెంబరు త్రైమాసికంలో దిగుమతుల పరిమాణం తగ్గినా విలువపరంగా మాత్రం ఎలాంటి తగ్గుదల లేదు. ఈ ఏడాది సెప్టెంబరు త్రైమాసికంలో మన దేశానికి రూ.2,41,900 కోట్ల విలువైన పసిడి దిగుమతైంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 3శాతం ఎక్కువ. ఇదే సమయంలో దేశంలో అమ్ముడైన పసిడి ఆభరణాల విలువా 16శాతం వృద్ధి రేటుతో రూ.1,48,700 కోట్లకు చేరిం ది. ఈ ఏడాది ఆగస్టు నుంచి పసిడి ధరలు తగ్గుముఖం పట్టడం నగల అమ్మకాలు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణమని డబ్ల్యూజీసీ ఇండియా సీఈఓ సచిన్ జైన్ చెప్పారు.
ధరలు మరింత కిందికి
బులియన్ మార్కెట్లో ధరల పతనం మంగళవారం కూడా కొనసాగింది. ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం రూ.700 నష్టపోయి రూ.1,41,800 వద్ద ముగిసింది. కిలో వెండి ధర రూ.2,000 పతనమై రూ.1.84 లక్షల వద్ద క్లోజైంది.
15 రెట్లు పెరిగిన పసిడి స్మగ్లింగ్
పసిడిపై దిగుమతి సుంకాలు పెంచడం స్మగ్లర్లకు కలిసి వస్తోంది. దీంతో సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో అక్రమ మార్గాల్లో దేశంలోకి 50 టన్నుల బంగారం దిగుమతైనట్టు మెటల్ ఫోకస్ అనే సంస్థ నివేదికను ఉటంకిస్తూ డబ్ల్యూజీసీ తెలిపింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 15 రెట్లు ఎక్కువ. స్మగ్లింగ్ ద్వారా దేశంలోకి 2023 తర్వాత ఇంత పెద్దమొత్తంలో బంగారం రావడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది మే నెలలో కేంద్రం పసిడి, వెండి దిగుమతి సుంకాలను పెంచటంతోనే పసిడి స్మగ్లింగ్ ఊపందుకుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
అదే బాటలో వెండి
వెండి దిగుమతులూ పసిడి బాటలోనే పయనిస్తున్నాయి. గత ఏడాది సెప్టెంబరుతో ముగిసిన ఆరు నెలలతో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబరుతో ముగిసిన ఆరు నెల ల్లో వెండి దిగుమతులు 25.17శాతం తగ్గాయి. ఈ ఏడాది సెప్టెంబరులో అయితే దిగుమతులు 49శాతంవరకు తగ్గాయి. దిగుమతి సుంకాల పెంపు ఇందుకు ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో నమోదైన రికార్డు ధరలతో పోలిస్తే ప్రస్తుతం బంగారం 22శాతం వెండి ధర 50శాతం వరకు తగ్గాయి. దీంతో ఈ ఏడాది ధనత్రయోదశి, దీపావళి అమ్మకాలు బాగుంటాయని మార్కెట్ వర్గాలు కొండంత ఆశలు పెట్టుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ రెండు పర్వదినాల్లో అమ్మకాలు కనీసం 10 నుంచి 12 శాతం పెరుగుతాయని బులియన్ వ్యాపారులు భావిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రూ.2,320 కోట్లతో తెలంగాణ ప్లాంట్ విస్తరణ
రిలయన్స్ జోరు.. 7 వారాల గరిష్ఠానికి సెన్సెక్స్