Share News

రిటైర్మెంట్ తర్వాత విడతల వారీగా పీఎఫ్ విత్‌డ్రా.. ఈపీఎఫ్‌వో కొత్త ప్రతిపాదన..!

ABN , Publish Date - Nov 19 , 2026 | 12:52 PM

ఉద్యోగుల భవిష్య నిధి చందాదారులకు తీపి కబురు అందించే దిశగా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కసరత్తు చేస్తోంది. ఉద్యోగ పదవీ విరమణ వేళ పీఎఫ్ ఖాతాలోని మొత్తం సొమ్మును ఒకేసారి తీసుకోకుండా, విడతలవారీగా ఉపసంహరించుకునే అవకాశం కల్పించాలని యోచిస్తోంది.

రిటైర్మెంట్ తర్వాత విడతల వారీగా పీఎఫ్ విత్‌డ్రా.. ఈపీఎఫ్‌వో కొత్త ప్రతిపాదన..!
Systematic Withdrawal Plan

న్యూఢిల్లీ, నవంబర్ 19: ఉద్యోగుల భవిష్య నిధి (EPF) చందాదారులకు తీపి కబురు అందించే దిశగా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) కసరత్తు చేస్తోంది. ఉద్యోగ పదవీ విరమణ వేళ పీఎఫ్ (PF) ఖాతాలోని మొత్తం సొమ్మును ఒకేసారి తీసుకోకుండా, విడతలవారీగా ఉపసంహరించుకునే అవకాశం కల్పించాలని యోచిస్తోంది. ఇందుకోసం సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (SWP) తీసుకురావాలని భావిస్తోంది. ఈ ప్రతిపాదన ప్రకారం పదవీ విరమణ చేసిన ఉద్యోగి నెలవారీగా, మూడు నెలలకోసారి, ఆరు నెలలకోసారి లేదా ఏడాదికోసారి పీఎఫ్ సొమ్మును తీసుకునే అవకాశం ఉంటుంది. ఇలా విడతలవారీగా డబ్బులు పొందుతున్న సమయంలో ఖాతాలో మిగిలిన మొత్తంపై సాధారణ ఈపీఎఫ్ వడ్డీ కొనసాగుతుంది.


ఈ ప్రతిపాదిత విధానంలో సభ్యులకు మరో వెసులుబాటు కూడా ఉంటుంది. నిర్ణీత వ్యవధిలో విడతలవారీగా డబ్బులు తీసుకుంటున్నప్పటికీ, మధ్యలో ఈ పథకం నుంచి వైదొలిగి ఖాతాలో మిగిలిన మొత్తాన్ని ఒకేసారి ఉపసంహరించుకోవచ్చు. ఒకవేళ సభ్యుడు ఎస్‌డబ్ల్యూపీ ద్వారా డబ్బులు పొందుతున్న సమయంలో మరణిస్తే, మిగిలిన మొత్తాన్ని జీవిత భాగస్వామి లేదా నామినీ పొందే అవకాశం కల్పించడాన్ని ఈపీఎఫ్‌వో పరిశీలిస్తోంది. ఈ విధానంలో మరో ముఖ్యమైన అంశం స్వచ్ఛంద అదనపు చందాలు. ఈపీఎఫ్‌వో నిర్దేశించే డిజిటల్ మార్గాల ద్వారా సభ్యులు తమ పీఎఫ్ ఖాతాల్లో నేరుగా అదనపు మొత్తాలను జమ చేసుకునే అవకాశం కల్పించాలని ఈపీఎఫ్‌వో భావిస్తోంది. ఈ చెల్లింపులకు యజమాని నుంచి సమాన మొత్తంలో కంట్రిబ్యూషన్ అవసరం ఉండదు. సభ్యులు తమ జీతం ద్వారా కాకుండా, నేరుగానూ పీఎఫ్ ఖాతాలో డబ్బులు జమ చేసుకోవచ్చు.


నవంబర్ 19న జరిగే ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈ ప్రతిపాదనను చర్చించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీనిని అమలు చేయడానికి సోషల్ సెక్యూరిటీ కోడ్-2020లో మార్పులు చేయకుండానే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ స్కీమ్-2026కు సవరణలు చేస్తే సరిపోతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ప్రస్తుతం 55 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసులో రిటైర్ అయ్యే సభ్యులు తమ ఈపీఎఫ్ పొదుపుల్లో 100 శాతం మొత్తాన్ని ఒకేసారి ఉపసంహరించుకోవచ్చు. 55 ఏళ్లలోపు రిటైర్ అయితే వెంటనే 75 శాతం వరకు తీసుకోవచ్చు. మిగిలిన 25 శాతాన్ని 12 నెలల తర్వాత తుది సెటిల్‌మెంట్ రూపంలో పొందవచ్చు. కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే రిటైర్మెంట్ తర్వాతా సభ్యులు తమ పీఎఫ్ నిధులను ఈపీఎఫ్ వ్యవస్థలో కొనసాగించవచ్చు. అవసరానికి అనుగుణంగా విడతలవారీగా డబ్బులు పొందవచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి

సర్కారు బ్యాంకులకు లాభాల పంట

వరుసగా రెండో రోజూ బంగారం, వెండి ధరలు ఢమాల్..

Updated Date - Nov 19 , 2026 | 01:07 PM