అప్పుచేసి పండగ చేసుకున్నారు..
ABN , Publish Date - Nov 27 , 2026 | 05:13 AM
క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోళ్లు భారీగా పెరిగాయి. దసరా, దీపావళి పండగల షాపింగ్ ఊపందుకున్న నేపథ్యంలో అక్టోబరులో మొత్తం క్రెడిట్ కార్డు వ్యయాలు...
జోరుగా క్రెడిట్ కార్డుల వినియోగం
అక్టోబరులో రూ.2.45 లక్షల కోట్ల వ్యయం
ఏటీఎం, పీఓఎస్‌ల వద్ద రూ.2.33 లక్షల కోట్ల నగదు ఉపసంహరణలు
తొలిసారిగా ఏటీఎం విత్‌డ్రాయల్స్‌ను దాటిన క్రెడిట్ కార్డు వ్యయాలు : ఆర్‌బీఐ
న్యూఢిల్లీ: క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోళ్లు భారీగా పెరిగాయి. దసరా, దీపావళి పండగల షాపింగ్ ఊపందుకున్న నేపథ్యంలో అక్టోబరులో మొత్తం క్రెడిట్ కార్డు వ్యయాలు రూ.2.45 లక్షల కోట్లకు చేరాయి. సెప్టెంబరు (రూ.2.04 లక్షల కోట్లు)తో పోల్చితే దాదాపు 20 శాతం పెరుగుదల నమోదైంది. గత ఏడాది అక్టోబరుతో పోల్చితే 14.4 శాతం వృద్ధి నమోదైంది. డెబిట్ కార్డుల ద్వారా చేసిన కొనుగోళ్ల విలువతో పోల్చితే క్రెడిట్ కార్డులతో చేసిన వ్యయాలు అక్టోబరులో దాదాపు ఆరు రెట్లు పెరిగాయి. అక్టోబరులో డెబిట్ కార్డుల ద్వారా వ్యయాలు రూ.40.492 కోట్లుగా నమోదయ్యాయని తాజా నివేదికలో ఆర్‌బీఐ వెల్లడించింది. మొదటిసారిగా అక్టోబరులో క్రెడిట్ కార్డుల ద్వారా వ్యయాలు ఏటీఏంల నుంచి నగదు ఉపసంహరణలను మించిపోయాయి.
అక్టోబరులో ఏటీఏంలు, పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) టెర్మినళ్ల వద్ద నగదు ఉపసంహరణలు రూ.2.33 లక్షల కోట్లకుపైగా ఉన్నాయి. క్రెడిట్ కార్డు వ్యయాలకన్నా ఈ మొత్తం కాస్త తక్కువ.
క్రెడిట్ కార్డు ఖర్చుల్లో ఆన్‌లైన్ లావాదేవీలదే అధిక వాటాగా ఉంది. ఈ లావాదేవీల విలువ రూ.1.54 లక్షల కోట్లుగా (మొత్తం వ్యయంలో దాదాపు 63 శాతం) ఉండగా.. పీఓఎస్ టెర్మినళ్ల వద్ద కొనుగోళ్లు రూ.90,562 కోట్లుగా ఉన్నాయి. ఇతర క్రెడిట్ కార్డు లావాదేవీల విలువ దాదాపు రూ.119 కోట్లుగా ఉంది.
పీఓఎస్ టెర్మినళ్ల వద్ద డెబిట్ కార్డుల ద్వారా కొనుగోళ్లు రూ.24,957 కోట్లుగా ఉండగా.. ఆన్‌లైన్ లావాదేవీలు రూ.15,284 కోట్లుగా ఉన్నాయి. ఇతర లావాదేవీల విలువ రూ.251 కోట్లుగా ఉంది.
ఏటీఎంలలో డెబిట్ కార్డుల ద్వారా నగదు ఉపసంహరణలు 42.04 కోట్ల లావాదేవీల ద్వారా రూ.2.32 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి. డెబిట్ కార్డుల ద్వారా పీఓఎస్ టెర్మినళ్ల వద్ద నగదు ఉపసంహరణల మొత్తం దాదాపు రూ.1.27 కోట్లుగా ఉంది. క్రెడిట్ కార్డులతో ఏటీఎంల నుంచి విత్‌డ్రాయల్స్ రూ.415 కోట్లుగా ఉన్నాయి.
ఈ గణాంకాలను బట్టి కొనుగోళ్ల కోసం ముఖ్యంగా ఆన్‌లైన్‌లో కొనుగోళ్లకు ప్రధానంగా క్రెడిట్ కార్డులను వినియోగించినట్టు స్పష్టమవుతోంది. డెబిట్‌కార్డులను ప్రధానంగా నగదును తీసుకోవడానికి వాడుతున్నారు. ఈ కా ర్డులతో జరిగిన కొనుగోలు లావాదేవీలకన్నా ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలే ఎక్కువగా ఉన్నాయి.
కార్డు ఆధారిత చెల్లింపులు పెరుగుతున్నప్పటికీ ఏటీఎంల ద్వారా ఉపసంహరణలు.. ఆర్థిక లావాదేవీల్లో నగదు కీలక పాత్రను తెలియజేస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
అటవీ ప్రాంతాల్లో నిఘా, గస్తీ మరింత పటిష్ఠం చేయాలి: పవన్ కల్యాణ్
యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News