Share News

టారిఫ్‌ కిక్‌

ABN , Publish Date - Feb 04 , 2026 | 05:33 AM

భారత, అమెరికా వాణిజ్య ఒప్పందం స్టాక్‌ మార్కెట్లలో ఉత్సాహాన్ని ఉరకలెత్తించింది. గత కొన్ని నెలలుగా ఎలాంటి ఉత్సాహం లేకుండా స్తబ్దంగా పడి ఉన్న బుల్‌ ఒక్కసారిగా రంకెలేసింది. ఫలితంగా...

టారిఫ్‌ కిక్‌

ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 4,205 పాయింట్లు అప్‌

కదం తొక్కిన బుల్‌

ట్రేడ్‌ డీల్‌తో ఈక్విటీ, కరెన్సీ మార్కెట్లలో ర్యాలీ

  • చివరకు 2,073 పాయింట్ల లాభంతో 83,739 పాయింట్ల వద్ద క్లోజింగ్‌

  • అదేబాటలో నిఫ్టీ.. 25,700 ఎగువన ముగింపు

  • దూసుకుపోయిన ఎగుమతి ఆధారిత రంగాల షేర్లు

ముంబై/న్యూఢిల్లీ: భారత, అమెరికా వాణిజ్య ఒప్పందం స్టాక్‌ మార్కెట్లలో ఉత్సాహాన్ని ఉరకలెత్తించింది. గత కొన్ని నెలలుగా ఎలాంటి ఉత్సాహం లేకుండా స్తబ్దంగా పడి ఉన్న బుల్‌ ఒక్కసారిగా రంకెలేసింది. ఫలితంగా మంగళవారం ఈక్విటీ, కరెన్సీ మార్కెట్లు కనివిని ఎరుగని రీతిలో లాభపడ్డాయి. ఎంతో కాలంగా మార్కెట్లు ఈ శుభవార్త కోసమే ఎదురు చూస్తుండడం ఇందుకు కారణం. కొద్ది రోజుల వ్యవధిలోనే రెండు ప్రధాన డీల్స్‌ను భారత్‌ ఖరారు చేసుకోవడం బుల్‌ ఆపరేటర్లకు ఎనలేని ఉత్సాహాన్ని అందించింది. వారి నుంచి అందిన కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్‌ 2,072.67 పాయింట్లు లాభపడి 83,739.13 వద్ద ముగిసింది. ఒక దశలో సెన్సెక్స్‌ 4,205.27 పాయింట్లు లాభపడి ఇంట్రాడే గరిష్ఠ స్థాయి 85,871.73 పాయింట్లను తాకింది. నిఫ్టీ కూడా అదే జోరు కొనసాగిస్తూ ఇంట్రాడేలో 1,252.8 పాయింట్ల లాభంతో 26,341.20 స్థాయిని తాకింది. చివరికి 639.15 పాయింట్ల లాభంతో 25,727.55 వద్ద ముగిసింది. బీఎ్‌సఈలో 3,304 షేర్లు లాభాలతో ముగియగా 981 షేర్లు మాత్రం నష్టపోయాయి. 137 షేర్లు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా నిలిచాయి.


ఎగుమతి ఆధారిత రంగాలకు ఉత్తేజం

ట్రేడ్‌ డీల్‌ ఎగుమతి ఆధారిత రంగాలకు ఉత్తేజం కల్పించింది. టెక్స్‌టైల్‌, లెదర్‌, వజ్రాభరణాలు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు, స్పెషాలిటీ కెమికల్స్‌, ఆటో విడిభాగాలు, ఫార్మా, ఐటీ రంగాల షేర్లు ర్యాలీలో పాల్గొన్నాయి. అలాగే ఫైనాన్షియల్స్‌, రియల్టీ రంగాలు, మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ షేర్లు కూడా లాభపడ్డాయి. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల రంగంలోని అవంతీ ఫీడ్స్‌, అపెక్స్‌ ఫ్రోజెన్‌ ఫుడ్స్‌ షేర్లయితే 20 శాతం లాభపడ్డాయి. అవంతీ ఫుడ్స్‌ షేరు రూ.960.60 వద్ద ముగిసింది. కొన్ని నెలల పాటు ఎగుమతుల్లో క్షీణత అనంతరం ఈ డీల్‌తో అనుకూల వాతావరణం ఏర్పడిందని భారత సీఫుడ్‌ ఎగుమతిదారుల సంఘం వ్యాఖ్యానించింది.

  • వజ్రాభరణాల విభాగంలో గోల్డియం ఇంటర్నేషనల్‌ షేరు 20ు లాభపడింది. ఈ విభాగంలోని కల్యాణ్‌ జువెలర్స్‌ (4.91%), శృంగార్‌ హౌస్‌ (4.51%), టైటన్‌ (2.80%), పీఎన్‌ గాడ్గిల్‌ (1.52%) లాభపడ్డాయి.

  • స్పెషాలిటీ కెమికల్స్‌ విభాగంలోని షేర్లలో ముక్కా ప్రోటీన్స్‌ (5.01%), కోస్టల్‌ కార్పొరేషన్‌ (5%), ఆర్తి ఇండస్ర్టీస్‌ (15.10%),గుజరాత్‌ ఫ్లోరో కెమికల్స్‌ (6.82%) లాభపడిన వాటిలో ఉన్నాయి.

  • టెక్స్‌టైల్స్‌ అండ్‌ లెదర్‌ విభాగానికి చెందిన షేర్లలో గోకల్‌దాస్‌ ఎక్స్‌పోర్ట్స్‌ (20%), అరవింద్‌ (10.23%), రేమండ్‌ లైఫ్‌స్టైల్‌ (3.39%) లాభపడ్డాయి.

మదుపరుల సంపద

రూ.12 లక్షల కోట్లు అప్‌

ఈక్విటీ మార్కెట్‌ ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద రూ.12,10,877.45 కోట్ల మేరకు లాభపడి రూ.4,67,14,754.77 కోట్లకు చేరింది. ఈ డీల్‌ ద్వారా ఏర్పడిన ఉత్తేజంతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) నికర కొనుగోలుదారులుగా మారారు. మంగళవారం రూ.5,236.28 కోట్ల విలువ గల షేర్లు కొనుగోలు చేశారు.


ఏడేళ్లలో రూపాయికి అతిపెద్ద లాభం

బులియన్‌ జోరు

ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి సైతం ఇటీవల కాలంలో కనివిని ఎరుగనంత ర్యాలీని నమోదు చేసింది. అమెరికా డాలర్‌ మారకంలో రూపాయి ఒక్క రోజులోనే 117 పైసలు లాభపడి 90.32 వద్ద స్థిరపడింది. భారత, అమెరికా వాణిజ్య ఒప్పందంతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) తిరిగి భారత మార్కెట్లో పెట్టుబడులు పెడతారన్న ఆశలు చిగురించడం రూపాయికి ఉత్తేజం ఇచ్చింది. ఏడేళ్లలో రూపాయి ఒక్క రోజులో నమోదు చేసిన అతి భారీ లాభం ఇదే. క్రూడాయిల్‌ ధరల క్షీణత, ఎఫ్‌పీఐ పెట్టుబడులపై ఆశావహ వైఖరి ఇన్వెస్టర్‌ సెంటిమెంట్‌ బలపడేందుకు సహాయకారి అయిందని ఫారెక్స్‌ విశ్లేషకులంటున్నారు. భారత-అమెరికా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో మంగళవారం ఉదయం డాలర్‌ మారకంలో 90.30 వద్ద ప్రారంభమైన రూపాయి ఇంట్రాడే గరిష్ఠ స్థాయి 90.05ని తాకింది. రెండు సెషన్లలో రూపాయి 161 పైసలు లాభపడింది.

మూడు రోజుల భారీ పతనాలకు బులియన్‌ మార్కెట్‌ తెర దించింది. వెండి, బంగారం మంచి లాభాలు నమోదు చేశాయి. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర రూ.24,000 పెరిగి రూ.2.84 లక్షలు పలికింది. అంతకుముందు వరుసగా మూడు సెషన్లలో వెండి గత నెల 29న నమోదైన జీవితకాల గరిష్ఠ స్థాయి రూ.4,04,500 నుంచి రూ.1,44,500 నష్టపోయి రూ.2.60 లక్షలకు పడిపోయింది. మేలిమి బంగారం 10 గ్రాములు రూ.5,000 మేరకు లాభపడి రూ.1,57,700 పలికింది. పసిడి సైతం మూడు వరుస సెషన్లలో జీవితకాల గరిష్ఠ స్థాయి రూ.1,83,000 నుంచి రూ.30,300 నష్టపోయింది. అంతర్జాతీయ విపణిలో సైతం వెండి ధర ఔన్సు (31.10 గ్రాములు) 9.55 డాలర్ల లాభంతో 88.77 డాలర్లకు చేరింది. ఔన్సు బంగారం ధర 275.39 డాలర్లు పెరిగి 4,935.49 డాలర్లు పలికింది.

ఈ వార్తలు కూడా చదవండి..

హెచ్‌సీఏలో కీలక పరిణామం.. నూతన అధ్యక్షుడిగా అమర్‌నాథ్‌

బాయ్‌కాట్‌ నష్టం రూ.2200 కోట్లు!

బుల్లెట్ ట్రైన్‌కు హబ్‌గా హైదరాబాద్: అశ్వినీ వైష్ణవ్

For More TG News And Telugu News

Updated Date - Feb 04 , 2026 | 05:33 AM