ఎయిర్‌లైన్స్‌లోకి అదానీ!
ABN , Publish Date - Nov 28 , 2026 | 12:51 AM
భారత కుబేరుడు గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ ఇక ఎయిర్‌లైన్స్ వ్యాపారంలోకీ ప్రవేశించబోతోంది.
పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వ అనుమతి కోరాం..
అదానీ గ్రూప్ సీఎఫ్ఓ జుగేశిందర్ రాబీ సింగ్ వెల్లడి
ముంబై: భారత కుబేరుడు గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ ఇక ఎయిర్‌లైన్స్ వ్యాపారంలోకీ ప్రవేశించబోతోంది. ఈ విషయమై కొంతకాలంగా నడుస్తున్న ఊహాగానాలకు అదానీ గ్రూప్ సీఎ్‌ఫఓ జుగేశిందర్ రాబీ సింగ్ తన ప్రకటనతో పుల్‌స్టాప్ పెట్టేశారు. ఎయిర్‌లైన్స్ రంగంలో పెట్టుబడులకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని శుక్రవారం ఆయన ప్రకటించారు. ముంబైలో ఇండియా డెట్ క్యాపిటల్ మార్కెట్ సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘‘దేశంలో 60 కోట్ల మందికి పైగా విమానాల్లో ప్రయాణించే సామర్థ్యం ఉంది. ఇందుకోసం ప్రస్తుతమున్న రోజువారీ విమాన సర్వీసులను 10 రెట్లు పెంచి 30,000కు చేర్చాల్సి ఉంది. అందుకే ఈ రంగంలో పెట్టుబడులకు అదానీ గ్రూప్‌ను అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరాం. తద్వారా ఎయిర్‌లైన్స్ రంగం వృద్ధికి మా వంతు సాయంగా నిలుస్తాం. ఫండ్ రూపంలో, మరో ఎయిర్‌లైన్ కంపెనీ ఏర్పాటు ద్వారా లేదంటే.. ఈ రంగంలోకి అడుగుపెట్టాలనుకునే ఆంత్రపెన్యూర్‌కు మద్దతుగా నిలవడం.. ఏ రూపంలో అయినా ఉండొచ్చు’’అని జుగేశిందర్ సింగ్ వెల్లడించారు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎయిర్‌లైన్స్ సేవల్లోకి ప్రవేశించాలన్న ఆసక్తితో అదానీ గ్రూప్ ఉన్నట్టు ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. అదానీ గ్రూప్ ఎయిర్‌లైన్స్ సేవల్లోకి రావొచ్చంటూ గత కొన్ని నెలలుగా ఊహాగానాలు నడుస్తున్నాయి. తమకు ఆ ఉద్దేశం లేదంటూ గతంలో ఊహాగానాలను ఖండిస్తూ వచ్చిన ఈ గ్రూప్.. తాజాగా ప్రభుత్వ అనుమతి కోరడం గమనార్హం.
ప్రయోజన వైరుధ్యానికి దారితీస్తుందా?
అదానీ గ్రూప్ ఇప్పటికే అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ ద్వారా దేశంలోని 8 కీలక విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. వీటితోపాటు గుజరాత్‌లోని ముంద్రా ప్రాంతీయ విమానాశ్రయం నిర్వహణను కూడా చూస్తోంది. ఎయిర్‌లైన్స్ సేవల్లోకి కూడా అడుగుపెడితే అది ప్రయోజన వైరుధ్యానికి దారితీస్తుందని ఇంటర్‌గ్లోబ్ ఎయిర్‌లైన్స్ (ఇండిగో), టాటాలకు చెందిన ఎయిర్ ఇండియా ఇప్పటికే వ్యతిరేకత వ్యక్తం చేశాయి. అంతర్జాతీయంగా విమానాశ్రయాల నిర్వహణ సంస్థలను ఎయిర్‌లైన్స్‌లోకి అనుమతించిన సంప్రదాయం ఎక్కడా లేదని ఇండిగో అధినేత రాహుల్ భాటియా లోగడ పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టు ఆపరేటర్లను ఎయిర్‌లైన్స్ సేవల్లోకి అనుమతిస్తే ప్రయోజన వైరుధ్యం ఏర్పడుతుందని.. దీర్ఘకాలంలో అది వినియోగదారుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా మారుతుందన్నారు. ప్రస్తుతం దేశ ఎయిర్‌లైన్స్ మార్కెట్లో 90 శాతం వాటా ఇండిగో, ఎయిర్ ఇండియా చేతుల్లోనే ఉంది
ఇవి కూడా చదవండి:
అవన్నీ పట్టించుకోవడం మానేశా.. టీమిండియాలోకి రీఎంట్రీపై షమీ ఆసక్తికర వ్యాఖ్యలు
కివీస్‌తో రెండో టెస్టు.. జడేజాను ఎందుకు పక్కన పెట్టారు?: గావస్కర్