Share News

అంబటికి ఈడీ సమన్లు

ABN , Publish Date - Sep 19 , 2026 | 03:41 AM

వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సమన్లు జారీ చేసింది. జగన్‌ పాలనలో ప్రభుత్వ మద్యంషాపులకు డిపోల నుంచి సరఫరా చేసిన రవాణా ధర మూడురెట్లు పెంచేసి రూ.400కోట్లు దోచుకున్న కుంభకోణంలో ఆయనను విచారణకు పిలిచింది.

అంబటికి ఈడీ సమన్లు

  • 400 కోట్ల మద్యం రవాణా స్కామ్‌లో విచారణకు వెళ్లని వైసీపీ మాజీ మంత్రి

  • అదే నోటీసు తాజాగా వాట్సాప్‌కు..

  • మరో తేదీతో నోటీసు ఇస్తామన్న ఈడీ

అమరావతి, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సమన్లు జారీ చేసింది. జగన్‌ పాలనలో ప్రభుత్వ మద్యంషాపులకు డిపోల నుంచి సరఫరా చేసిన రవాణా ధర మూడురెట్లు పెంచేసి రూ.400కోట్లు దోచుకున్న కుంభకోణంలో ఆయనను విచారణకు పిలిచింది. ఈ వ్యవహారంలో వైసీపీ మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావును ఈడీ ఇప్పటికే జైలుకు పంపింది. ఈ నేపథ్యంలో మనీలాండరింగ్‌ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద జరుగుతున్న దర్యాప్తులో భాగంగా 11న ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్‌ ఈడీ జోనల్‌కార్యాలయంలో వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ 8న నోటీసు పంపింది. అయితే నోటీసులు సకాలంలో అందలేదంటూ విచారణకు అంబటి వెళ్లలేదు. మొబైల్‌(వాట్సాప్‌)కు శుక్రవారం అదే నోటీసు పంపి, ఎందుకు విచారణకు రాలేదని అధికారులు మెసేజ్‌ పెట్టారు. తనకు పోస్టు ద్వారా నోటీసు అందలేదని, ఇప్పుడే చూశానని రాంబాబు బదులిచ్చారు. అలాగైతే మరో తేదీతో నోటీసు ఇస్తామని, విచారణకు రావాలని ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ప్రదీప్‌ సింగ్‌ .... అంబటికి స్పష్టం చేసినట్టు తెలిసింది. రికార్డులు సమర్పించడంతోపాటు దర్యాప్తునకు సహకరించాలని ఆ నోటీసులో స్పష్టం చేసింది. సమయానికి విచారణకు హాజరు కాకపోయినా, రికార్డులు సమర్పించక పోయినా చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఈడీ హెచ్చరించింది. అంబటి సన్నిహితుడు సత్తెనపల్లికి చెందిన మర్రి సుబ్బారెడ్డిని ఇప్పటికే ఈడీ విచారించినట్లు సమాచారం. మద్యం సరఫరా టెండర్లు అధిక ధరకు తీసుకుని, అంబటి రాంబాబు బినామీగా సుబ్బారెడ్డి కోట్లాది రూపాయలు లబ్ధి పొందినట్లు ఈడీ వర్గాలు ఆధారాలు సేకరించినట్లు తెలిసింది.


స్కామ్‌ ఎలా జరిగిందంటే..

వైసీపీ అధికారంలోకి రాక ముందు మద్యం డిపో నుంచి షాపునకు ఒక కేసు(బాక్స్‌) సరఫరా చేస్తే రూ.13 ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ సరఫరాదారుకు చెల్లించేది. రివర్స్‌ టెండరింగ్‌తో ప్రభుత్వ ఖజానాకు లాభం చేకూరుస్తానని చెప్పిన జగన్‌ పాలనలో, మద్యం బాక్సు సరఫరా ధర అనూహ్యంగా రూ.34 కు పెంచేసి దోపిడీకి దారులు వేశారు. జగన్‌ ప్రభుత్వంలో సలహాదారు రాజ్‌ కసిరెడ్డి, మంత్రులు కారుమూరు నాగేశ్వరరావు, అంబటి రాంబాబు, కేంద్ర సర్వీసుల నుంచి పథక రచనలో భాగంగా తెచ్చుకున్న ఏపీఎస్‌బీసీఎల్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి సహా మరికొందరి పాత్రను కూటమి ప్రభుత్వంలోని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దోపిడీ గుట్టు రట్టు చేసింది. మద్యం రవాణా నెట్‌వర్క్‌ను ప్రాంతాల వారీగా ప్రభావం కలిగిన వైసీపీ నేతలు దక్కించుకుని, బినామీ సంస్థలతో వ్యవహారం నడిపించిన వైనాన్ని వెలికి తీసింది. దీంతో సీఐడీ కేసు నమోదు చేసి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి. రాజశేఖర్‌ బాబు నేతృత్వంలో ఏర్పాటు చేసి మరిన్ని ఆధారాలు వెలికితీసింది. వాటి ద్వారా మరింత లోతుగా ఆరా తీసిన ఈడీ.... మనీలాండరింగ్‌ కోణాన్ని పసిగట్టి అరెస్టులు మెదలుపెట్టింది. రాజ్‌ కసిరెడ్డి, వాసుదేవ రెడ్డి, వైసీపీ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు కలిసి సుమారు 400కోట్ల రూపాయల వరకూ లిక్కర్‌ సరఫరాలో ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారు.


వైసీపీ నేతల్ని జైలుకు పంపుతోన్న ఈడీ

మద్యం రవాణా కాంట్రాక్టుల కేటాయింపులో అవకతవకలు చేసి అక్రమంగా నిధులు మళ్లించినట్లు ఆధారాలు సేకరించిన ‘సిట్‌’ వాటిని ఈడీకి అందజేసింది. ఈసీఐఆర్‌ నమోదు చేసి మరింత లోతుగా దర్యాప్తు చేసిన ఈడీ అధికారులు... రాజ్‌ కసిరెడ్డితో పాటు వాసుదేవ రెడ్డి తదితరుల్ని విచారించారు. హవాలా, మనీలాండరింగ్‌ కోణాలపై ఆధారాలు సేకరించారు. ఈ దోపిడీలో కింగ్‌పిన్‌గా భావిస్తున్న రాజ్‌ కసిరెడ్డి ఆర్థిక లావాదేవీల్లో రూ.195.33 కోట్ల అనుమానిత లావాదేవీలు ఉండటంతో ఈడీ అరెస్టులు మొదలుపెట్టింది. ఈ కేసులో నిందితులుగా రాజ్‌ కసిరెడ్డితో పాటు వాసుదేవ రెడ్డి, ఆయన బామ్మర్ది విజయ్‌ నరసింహారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, కుమారుడు సునీల్‌, కోడలు వల్లూరి కీర్తి, రాజ్‌ కసిరెడ్డిగ్యాంగ్‌లోని సైఫ్‌ అహ్మద్‌, బూనేటి చాణక్యను చేర్చింది. వీరిలో కసిరెడ్డి, వాసుదేవ రెడ్డి,కారుమూరు సునీల్‌, కారుమూరు నాగేశ్వర రావును జైలుకు పంపింది. ఇదే కోవలో తాజాగా అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది.

అంబటి ఇవ్వాల్సిన పత్రాలు..

1. పాన్‌, ఆధార్‌, పాస్‌పోర్ట్‌.

2. తనతో పాటు కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న సంస్థల వివరాలు, బ్యాంకు లావాదేవీలు (2019నుంచి 2024వరకూ)

3. 2019-20 నుంచి రాంబాబు డైరెక్టర్‌గా, ప్రొప్రైటర్‌గా లబ్ధి పొందిన సంస్థల వివరాలు.

4. అంబటి పేరుతో పాటు ఆయన కుటుంబసభ్యుల పేరుతో ఉన్న స్థిరాస్తుల వివరాలు.

5. మర్రి సుబ్బారెడ్డి, ఆయనకు సంబంధించిన వ్యక్తుల నుంచి అందుకున్న లేదా బదిలీ చేసిన నిధులు వివరాలు, ఆధార పత్రాలు.

ఈ వార్తలనూ చదవండి...

మన్యంలో విభిన్న వాతావరణం

కాఫీ ప్రాజెక్టుకు తూట్లు!

Updated Date - Sep 19 , 2026 | 03:41 AM