Share News

నిధులు ఫుల్‌.. పనులు నిల్‌

ABN , Publish Date - Sep 18 , 2026 | 11:14 PM

మండలంలోని తాజంగి పంచాయతీ బోయపాడు-గొడుగుమామిడి రోడ్డు నిర్మాణం కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంతో అర్ధంతరంగా నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు నిర్మాణానికి రూ.1.8 కోట్లను ఏడాది క్రితం మంజూరు చేసింది. టెండరు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ పనులు ప్రారంభించి తర్వాత వదిలేశాడు. అయినా పంచాయతీరాజ్‌ అధికారులు చోద్యం చూస్తుండడంతో రాకపోకలకు గిరిజనులు అవస్థలు పడుతున్నారు.

నిధులు ఫుల్‌.. పనులు నిల్‌
గొడుగుమామిడి సమీపంలో అధ్వానంగా తయారైన రహదారి

ఆగిన బోయపాడు-గొడుగుమామిడి రోడ్డు నిర్మాణం

ఏడాది క్రితం రూ.1.8కోట్లు ప్రభుత్వం విడుదల

పనులు చేయకుండా జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్‌

చోద్యం చూస్తున్న పంచాయతీరాజ్‌ అధికారులు

అవస్థలు పడుతున్న ఆదివాసీలు

చింతపల్లి, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి):

అల్లూరి జిల్లాలో గిరిజన గ్రామాలను కలుపుతూ కనెక్టింగ్‌ రోడ్లు నిర్మించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం రెండేళ్లలో కూటమి పాలనలో జిల్లాలో 550 గ్రామాలను కలుపుతూ కనెక్టింగ్‌ రోడ్లు నిర్మాణాలకు రూ.వేల కోట్లను మంజూరు చేసింది. అయితే మండలంలోని తాజంగి పంచాయతీ బోయపాడు-గొడుగుమామిడి రహదారి నిర్మాణ పనులు ముందుకు సాగలేదు. అధ్వానంగా ఉన్న రహదారిపై 30 గ్రామాల గిరిజనులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. దీనిపై టీడీపీ నాయకులు, గిడ్డి ఈశ్వరి అభ్యర్థనతో 2025 జనవరిలో తొలి వార్షిక బడ్జెట్‌లోనే బోయపాడు-గొడుగుమామిడి మధ్య 3.6 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.8 కోట్లు పీఎం జన్‌మన్‌ నిధులను మంజూరు చేసింది.

ముందుకు సాగని పనులు

బోయపాడు-గొడుగుమామిడి రోడ్డు నిర్మాణాలకు నిధులు విడుదల చేయడంతో పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులు టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. కాంట్రాక్టర్‌ గత ఏడాది రహదారి నిర్మాణాలు ప్రారంభి 20 రోజులపాటు ఎర్తు వర్కు పూర్తి చేశాడు. కొన్నిచోట్ల నిర్మాణాల కోసం మెటల్‌ సిద్ధం చేశాడు. అంతే తర్వాత ఏడాదిన్నరగా కాంట్రాక్టర్‌ అటువైపు కన్నెత్తి చూడలేదు. పనులను చేయిస్తున్న పీఆర్‌ అధికారులు కూడా పట్టించుకోలేదు.

పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు

బోయపాడు-గొడుగుమామిడి రోడ్డు దుస్థితిపై స్థానిక గిరిజనులు, టీడీపీ నాయకులు పాంగి రాము, ఆండ్రాబు లక్ష్మణ్‌, గెమ్మెలి రమణ మండల స్థాయి పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే వారం రోజుల క్రితం వనజాజుల పర్యటనకు వచ్చిన టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి దృష్టికి గిరిజనులు రహదారి సమస్యను తీసుకొచ్చారు. పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు ఇచ్చి రోజులు గడుస్తున్నప్పటికీ జిల్లా, మండల స్థాయి అధికారులు రహదారి పనులు పునఃప్రారంభించేందుకు కనీస చర్యలు తీసుకోకపోవడంపై గిరిజనులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రోడ్డు పనులు ప్రారంభానికి చర్యలు

వి.వెంకటేశ్‌, పీఆర్‌ ఏఈఈ, చింతపల్లి.

బోయపాడు-గొడుగుమామిడి రోడ్డు పనులు ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నాం. నిర్మాణాలకు నిధుల కొరత లేదు. కాంట్రాక్టర్‌ని పనులు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశాం. నెలాఖరు నాటికి పనులు ప్రారంభించేందుకు కాంట్రాక్టర్‌ ఏర్పాట్లు చేస్తున్నాడు. రహదారి నిర్మాణాలను సాధ్యమైంత వేగంగా పూర్తి చేస్తాం.

Updated Date - Sep 18 , 2026 | 11:14 PM