Share News

పాతాళానికి జగన్‌ గ్రాఫ్‌!.. అసెంబ్లీ ఎన్నికలను మించిన పరాజయం

ABN , Publish Date - Nov 05 , 2026 | 04:54 AM

సార్వత్రిక ఎన్నికల ముందు ‘వై నాట్‌ 175’ అని ప్రశ్నించి చివరికి 11తో సరిపెట్టుకున్న వైసీపీ పరిస్థితి పుర సమరంలో మరింత దిగజారింది. వైఎస్‌ జగన్‌ గ్రాఫ్‌ పాతాళానికి పడిపోయింది. మునిసిపాలిటీలను కైవసం చేసుకున్న స్థానాలపరంగా చూస్తే...

పాతాళానికి జగన్‌ గ్రాఫ్‌!.. అసెంబ్లీ ఎన్నికలను మించిన పరాజయం

  • మునిసిపాలిటీల్లో వైసీపీది నాలుగో స్థానం

  • ఫ్యానుకు దక్కింది బీజేపీ కంటే ఒకటి తక్కువే

  • 13 కార్పొరేషన్లలో ఒకే ఒక్క చోట గెలుపు

(అమరావతి - ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల ముందు ‘వై నాట్‌ 175’ అని ప్రశ్నించి చివరికి 11తో సరిపెట్టుకున్న వైసీపీ పరిస్థితి పుర సమరంలో మరింత దిగజారింది. వైఎస్‌ జగన్‌ గ్రాఫ్‌ పాతాళానికి పడిపోయింది. మునిసిపాలిటీలను కైవసం చేసుకున్న స్థానాలపరంగా చూస్తే... వైసీపీ నాలుగో స్థానంలో నిలిచింది. 86 మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగగా... కూటమి పార్టీలైన టీడీపీ 59, జనసేన 18 గెలుచుకున్నాయి. బీజేపీ కూడా తనకు కేటాయించిన స్థానాల్లో నాలుగింట గెలిచింది. కానీ... వైసీపీ అంతకంటే తక్కువగా, మూడు స్థానాలకే పరిమితమైంది. ఇది సార్వత్రిక ఎన్నికలకు మించిన పరాభవం!

ఇక.. నగరపాలక సంస్థల్లోనూ వైసీపీ పరిస్థితి సేమ్‌ టు సేమ్‌! 13 మేయర్‌ స్థానాల్లో టీడీపీ పది, జనసేన 2 గెలుచుకున్నాయి. బీజేపీకి కేటాయించిన అనంతపురం నగరపాలక సంస్థలో మాత్రమే వైసీపీ మేయర్‌ అభ్యర్థి నెగ్గారు. కూటమి పార్టీ నేతలు సమన్వయంతో వ్యవహరించి, క్షేత్రస్థాయిలో ఓట్ల బదిలీ సవ్యంగా జరిగి ఉంటే జగన్‌ పార్టీకి అక్కడా చుక్కెదురే అయ్యేది. కార్పొరేషన్ల పరిధిలోని డివిజన్లలోనూ వైసీపీని ప్రజలు మూడో స్థానానికే పరిమితం చేశారు. 922 డివిజన్లలో తెలుగుదేశం 596 స్థానాలు, జనసేన 137 స్థానాల్లో విజయం సాధించగా... వైసీపీ కేవలం 110 స్థానాలకు పరిమితమైంది. మేయర్‌ స్థానాల విషయంలో టీడీపీ వందశాతం స్ట్రైక్‌ రేట్‌ సాధించింది. జనసేనదీ అదే రికార్డు!

తొలి అభ్యర్థి కూడా ఓటమిపాలు...

స్థానిక సంస్థల రిజర్వేషన్‌ ప్రక్రియ పూర్తికాకముందే... నెల్లూరు మేయర్‌ అభ్యర్థిగా ఆనం విజయకుమార్‌ రెడ్డిని జగన్‌ అట్టహాసంగా ప్రటించారు. నెల్లూరు మేయర్‌ అన్‌ రిజర్వుడు కావడంతో ఆయననే అభ్యర్థిగా నిలిపారు. కూటమి మాత్రం బీసీ వర్గానికి చెందిన రూప్‌కుమార్‌ యాదవ్‌ను బరిలో నిలిపింది. నెల్లూరు మేయర్‌ స్థానంతో సహా.. కార్పొరేషన్‌లో ఒక్క డివిజన్‌లోనూ వైసీపీ గెలవలేకపోయింది. ‘పుర’ సమరంలో ప్రకటించిన తొలి అభ్యర్థినీ జగన్‌ గెలిపించుకోలేకపోవడం గమనార్హం.

  • చంద్రబాబును చూడాలని ఉందా!?

నేడు గుర్తుకొస్తున్న నాటి జగన్‌ మాటలు

‘కర్మ రిటర్న్స్‌’... అన్నట్లుగా నాడు వైఎస్‌ జగన్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. 2021లో స్థానిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం... ‘చంద్రబాబు ముఖం చూడాలని ఉంది’ అని జగన్‌ గేలి చేస్తూ మాట్లాడారు. అప్పుడు శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) భేటీకి టీడీపీ తరఫున అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ‘ఏం అన్నా... బాగున్నావా’ అంటూ అచ్చెన్నను పలకరించిన జగన్‌... కుప్పం మునిసిపల్‌ ఎన్నికల్లో టీడీపీ ఓటమిని గుర్తుచేస్తూ ‘చంద్రబాబును చూడాలని ఉంది’ అన్నా తమ నాయకుడు అసెంబ్లీకి వస్తారని, చూడాలనుకుంటే అక్కడికి రావొచ్చని అచ్చెన్న హూందాగా బదులిచ్చారు. సీన్‌ కట్‌ చేస్తే... తాజా పుర పోరులో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. చివరికి... 40 ఏళ్లుగా వైఎస్‌ కుటుంబం చేతిలో ఉన్న పులివెందుల కూడా జారిపోయింది. జగన్‌ సొంత వార్డును టీడీపీ ఏకగ్రీవంగా దక్కించుకుంది. ‘‘మరి... ఇప్పుడు జగన్‌ పరిస్థితి ఏమిటి? ఆయన చంద్రబాబును చూస్తారా? లేక... అసెంబ్లీకి వచ్చి తన ముఖం చూపించగలరా?’’ అని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్

ఫోర్జరీ, చీటింగ్‌ కేసులో సులోచన సహా ముగ్గురికి రిమాండ్‌

Updated Date - Nov 05 , 2026 | 06:03 AM