Share News

కేంద్ర బలగాల మోహరింపు..సింగిల్‌ జడ్జి తీర్పుపై వైసీపీ అప్పీల్‌

ABN , Publish Date - Oct 18 , 2026 | 03:28 AM

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కేంద్ర సాయిధ బలగాలను మోహరించాలన్న అభ్యర్థనను తోసిపుచ్చుతూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన అప్పీల్‌పై...

 కేంద్ర బలగాల మోహరింపు..సింగిల్‌ జడ్జి తీర్పుపై వైసీపీ అప్పీల్‌

  • అఫిడవిట్‌ దాఖలుకు సమయం కోరిన ఆ పార్టీ తరఫు న్యాయవాది పొన్నవోలు

  • విచారణ రేపటికి వాయిదా

అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కేంద్ర సాయిధ బలగాలను మోహరించాలన్న అభ్యర్థనను తోసిపుచ్చుతూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన అప్పీల్‌పై హైకోర్టు ధర్మాసనం శనివారం విచారణ జరిపింది. ఆ పార్టీ తరఫున సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వకుండా అధికార పార్టీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని, ఈ విషయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారన్నారు.

నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనల వివరాలతో ఆదివారం అఫిడవిట్‌ వేస్తామని కోర్టుకు తెలిపారు. అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ స్పందిస్తూ... అఫిడవిట్‌తో జత చేసిన అంశాలను పరిశీలించి, వాస్తవాలను కోర్టు ముందు ఉంచేందుకు సమయం ఇవ్వాలని కోరారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్‌ మండవ కిరణ్మయి, జస్టిస్‌ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం అప్పీల్‌పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ కేంద్ర బలగాలను మోహరించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌, కేంద్ర హోంశాఖను ఆదేశించాలని కోరుతూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి చేసిన అభ్యర్థనను సింగిల్‌ జడ్జి శుక్రవారం తోసిపుచ్చారు.


పశ్చిమ బెంగాల్‌ పరిస్థితులతో ఏపీలోని పరిస్థితులను పోల్చి చూడలేమన్నారు. నామినేషన్‌ కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, నిష్పాక్షికంగా, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీ, పోలీసులను ఆదేశించారు. ఈ తీర్పును వైసీపీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ముందు సవాల్‌ చేసింది. అటు స్థానిక ఎన్నికల వేళ సాధారణంగా ఏర్పాటు చేసే నామినేషన్‌ కేంద్రాలకు అదనంగా ప్రతి జిల్లా కేంద్రంలో ప్రత్యేక నామినేషన్‌ కేంద్రాల ఏర్పాటుకు నిరాకరిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపైనా వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి హౌజ్‌మోషన్‌ రూపంలో అప్పీల్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణను న్యాయమూర్తి జస్టిస్‌ కుంచం మహేశ్వరరావు, జస్టిస్‌ గంధం సునీత ధర్మాసనం ఆదివారానికి వాయిదా వేసింది.

ఈ వార్తలనూ చదవండి:

జగన్ ఆదేశాల మేరకే పులివెందులలో వైసీపీ అరాచకం: టీడీపీ నేతలు

దసరా స్పెషల్ ట్రైన్లు.. ఛార్జీల పెంపుపై దక్షిణ మధ్య రైల్వే క్లారిటీ

Updated Date - Oct 18 , 2026 | 03:31 AM