అది ముమ్మాటికీ నా ఇల్లే
ABN , Publish Date - Nov 01 , 2026 | 03:30 AM
సొంత ఇంట్లో పెళ్లి చేయాలన్న తన కుమార్తె ఆకాంక్ష నెరవేర్చలేకపోతున్నందుకు చాలా బాధపడుతున్నామని షర్మిల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తుల పంపకాల్లో యలహంక ప్రాపర్టీ పూర్తిగా తనకు, తన పిల్లల భాగానికి వచ్చిందని స్పష్టం చేశారు.
ఆస్తుల పంపకాల్లో యలహంక ప్రాపర్టీ
వంద శాతం నాకు, నా పిల్లల భాగానికి వచ్చింది
నాది కాని దానికోసం ఆశపడే నీచత్వం నాకు లేదు
నా కుమార్తె ఆకాంక్షను నెరవేర్చలేకపోయాం
అందుకు చాలా బాధపడుతున్నాం
వేరే వేదికపై మా బిడ్డ పెళ్లి చేస్తున్నాం
జగన్ లేఖకు ‘ఎక్స్’ వేదికగా షర్మిల కౌంటర్
అమరావతి, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): సొంత ఇంట్లో పెళ్లి చేయాలన్న తన కుమార్తె ఆకాంక్ష నెరవేర్చలేకపోతున్నందుకు చాలా బాధపడుతున్నామని షర్మిల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తుల పంపకాల్లో యలహంక ప్రాపర్టీ పూర్తిగా తనకు, తన పిల్లల భాగానికి వచ్చిందని స్పష్టం చేశారు. ‘నాది కానిదాని కోసం ఆశపడే నీచత్వం నాకు లేదు’ అంటూ తన అన్న జగన్‌కు కుండబద్దలు కొట్టారు. షర్మిల కుమార్తె అంజలిరెడ్డి వివాహం యలహంకలోని ఆమె ఇంట్లో చేసేందుకు అభ్యంతరం చెబుతూ అక్టోబరు 9వ తేదీన జగన్ రాసిన లేఖకు శనివారం ‘ఎక్స్’ వేదికగా ఆమె కౌంటర్ ఇచ్చారు. ‘ఉమ్మడి ఆస్తిగా ఉన్న యలహంక ప్రాపర్టీ ఆస్తుల పంపకాల్లో భాగంగా పూర్తిగా వంద శాతం నాకూ, నా పిల్లల భాగానికి వచ్చింది.
ఇది దేవుడి సాక్షిగా నిజం. నా బిడ్డల హక్కు కాబట్టి, నాన్న వైఎస్ఆర్ తిరిగిన ఇల్లు కనుకే, నా కుమార్తె అంజలి కోరినట్టుగా యలహంకలోని నా నివాసంలోనే ఆమె పెళ్లి చేయాలనుకున్నాం. సొంత ఇంట్లో బిడ్డ పెళ్లి చేయడం ప్రతి తల్లిదండ్రులూ అదృష్టంగా భావిస్తారు. మన తెలుగింట ఏ గుమ్మాన్ని అడిగినా ఇదే చెబుతుంది. తాను పెరిగిన ఇల్లే పెళ్లి వేదిక కావాలన్న నా బిడ్డ ఆకాంక్షను నెరవేర్చలేకపోయామని చాలా బాధపడుతున్నాం.
వివాహ వేదిక విషయంలో జరుగుతున్న పరిణామాలను చూసి, నా బిడ్డ గురించి బాధపడ్డ ప్రతి ఒక్కరికీ వందనాలు. నా కుమార్తె అంజలి పెళ్లి పెద్దలు కుదుర్చిన సంబంధం. వివాద రహితంగా, ఎలాంటి గొడవలూ లేకుండా వివాహం జరిపించాల్సిన బాధ్యత మామీద ఉంది. అందుకే అంజలిరెడ్డి, సోమల రఘురామ్‌రెడ్డి పరిణయ వేదికను యలహంక ఇంట్లో కాకుండా వేరే ప్రదేశంలో బంధుమిత్రులు, ఆత్మీయలు అందరి సమక్షంలో నిర్వహించాలని నిశ్చయించాం. కాబోయే వధూవరులకు తెలుగు ప్రజల ఆశీస్సులు, దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతున్నా’ అని షర్మిల పోస్టు చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీకి మరో పెను తుఫాన్ ముప్పు.. ఆ జిల్లాలకు అలర్ట్..
జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక మలుపు..!