Share News

చంద్రబాబుకు పేరు రావొద్దంతే!

ABN , Publish Date - Sep 03 , 2026 | 05:20 AM

సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూటమి ప్రభుత్వానికి పేరు రాకుండా విషం చిమ్మాలని వైసీపీ క్యాడర్‌కు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.

చంద్రబాబుకు పేరు రావొద్దంతే!

  • ప్రాజెక్టులపై క్రెడిట్‌ అంతా మనదే అని చెప్పండి

  • మనమే కట్టామని సోషల్‌ మీడియాలో ఊదరగొట్టండి

  • వైసీపీ క్యాడర్‌కు జగన్‌ ఆదేశం

  • జనం నమ్మకున్నా అదే వ్యూహం

అమరావతి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూటమి ప్రభుత్వానికి పేరు రాకుండా విషం చిమ్మాలని వైసీపీ క్యాడర్‌కు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తున్న ప్రాజెక్టులన్నీ తమ హయాంలో కట్టేసినవేనంటూ సోషల్‌ మీడియాలో ఊదరగొట్టాలంటూ వైసీపీ నేతలను జగన్‌ ఆదేశించారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భోగాపురం విమానాశ్రయాన్ని జగన్‌ హయాంలోనే పూర్తి చేశారంటూ ఇంతకాలం వైసీపీ సోషల్‌ మీడియాలో చేసిన ప్రచారం బూమ్‌రాంగ్‌ అయింది. విశాఖ డేటా సెంటర్‌ కూడా తన ఘనతేనని జగన్‌ సహా ఆ పార్టీ ముఖ్యనేతలు చేసిన వ్యాఖ్యలను ప్రజలు నమ్మలేదు. దీంతో జగన్‌ రూట్‌ మార్చేశారు. వెలిగొండను తన తండ్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి పూర్తి చేశారంటూ ప్రచారం చేశారు. ఈ వ్యూహమూ బెడిసికొట్టిందని సొంత పార్టీనేతలే అంటున్నారు. 17 ఏళ్ల క్రితం వైఎస్‌ మరణిస్తే తాజాగా పూర్తి చేసిన వెలిగొండ ప్రాజెక్టు ఆయన వల్లే ఎలా పూర్తవుతుందనే విమర్శలు వచ్చాయి. తాజాగా పోలవరం ఎడమ ప్రధాన కాలువను రాజశేఖరరెడ్డి పూర్తి చేశారంటూ వైసీపీ కొత్తరాగాన్ని ఎత్తుకుంది.


నిజంగానే వైఎస్‌ పూర్తి చేస్తే.. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌ దీన్ని ఎందుకు వాడుకలోకి తీసుకురాలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాస్తవాలు ఎలా ఉన్నా అసత్యాలు ప్రచారం చేయడం, ప్రజల్లో గందరగోళం సృష్టించడం, చంద్రబాబుకు పేరు రాకుండా చేయడం.. ఇదీ వైసీపీ వ్యూహం. ఈ సారి వర్షాలు లేనందున చాలా ప్రాజెక్టులలో నీళ్లు లేవు. దీంతో కూటమి ప్రభుత్వం తాగునీటికే ప్రాధాన్యం ఇస్తోంది. వాస్తవ పరిస్థితులు తెలిసినా సాగునీటిని విడుదల చేయడం లేదంటూ జగన్‌ విమర్శలు చేశారు. శ్రీశైలం ప్రాజెక్ట్టు జలాలను రాయలసీమ ఆయకట్టుకు విడుదల చేయాలంటూ స్థానికంగా వైసీపీ నేతలతో ధర్నాలు చేయించారు. రాయలసీమ రైతాంగం వైసీపీ పిలుపును పట్టించుకోలేదు. రాజకీయంగా ఆ పార్టీకి ఇవేమీ కలసిరాలేదు. అయినా జగన్‌ తన పంథా వీడటం లేదు. కూటమికి, చంద్రబాబుకు క్రెడిట్‌ రాకుండా విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి

వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..

Updated Date - Sep 03 , 2026 | 05:20 AM