ఇష్టం లేక నీచ సాకులు!
ABN , Publish Date - Oct 24 , 2026 | 04:50 AM
మేనమామగా ముందుండి పెళ్లి చేయాల్సిన జగన్.. మేనకోడలి పెళ్లికి తానే ఆటంకాలు సృష్టించడం.. తండ్రి తనతో సమానంగా చెల్లెలి కోసం కట్టించిన ఇల్లు ఇవ్వనంటూ మడతపేచీ పెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
‘భద్రత’ పేరుతో మేనకోడలి పెళ్లికి జగన్ అడ్డు
షర్మిలపై వ్యక్తిగత కక్ష, పెళ్లికి వెళ్లేందుకు
ఇష్టంలేక ఇల్లు ఇవ్వనంటూ అభ్యంతరం
వైఎస్ కంటే నీకు బెదిరింపులు ఉన్నాయా?
కుటుంబ సభ్యుల పెళ్లిళ్లను ఆయన దగ్గరుండి ఇంట్లో జరిపించలేదా?
హైఫై వివాహ వేడుకకు భద్రత ఉండదా?
వీవీఐపీలకు లేని భద్రతా సమస్య జగన్‌కా?
జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉందిగా.. పైగా
యలహంకలోని భవనాలకు వేర్వేరు ప్రహరీలు
భారీ జనసందోహం మధ్య పరామర్శలకు వెళ్లినప్పుడు భద్రతా భయం లేదా?
పోలీసుల భద్రతను కూడా పక్కనపెట్టి వేల మందితో, భారీ కాన్వాయ్‌తో ర్యాలీలు
కుటుంబ సభ్యులు, బంధువులు, రాజకీయ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు, ప్రశ్నలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి): మేనమామగా ముందుండి పెళ్లి చేయాల్సిన జగన్.. మేనకోడలి పెళ్లికి తానే ఆటంకాలు సృష్టించడం.. తండ్రి తనతో సమానంగా చెల్లెలి కోసం కట్టించిన ఇల్లు ఇవ్వనంటూ మడతపేచీ పెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. షర్మిల కుమార్తె వివాహ వేడుకకు బెంగళూరు యలహంకలోని ఇంటిని ఇచ్చేందుకు నిరాకరించడంపై జగన్ విచిత్రమైన సాకులు చెబుతున్నారు. ఇక్కడ వివాహం చేస్తే భద్రతాపరమైన సమస్యలు వస్తాయని, మేనకోడలి పెళ్లి వల్ల తనకు ప్రాణహాని ఉందని అంటున్నారు.
తాజాగా ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘ఛీ.. జగన్’ కథనం సంచలనం సృష్టించడంతో జగన్.. తన వికృత రూపాన్ని దాచేందుకు వైసీపీ నేతలను పురమాయించారు. అలాగే వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ రంగంలోకి దిగింది. వీరందరూ చెబుతున్న సాకు ఒక్కటే. అదే.. జగన్‌కు భద్రతా సమస్య. ఇదే విషయాన్ని తెలియజేస్తూ షర్మిలకు ఇటీవల జగన్ లేఖ రాశారని ప్రచారం చేస్తున్నారు. జగన్, ఆయన మద్దతుదారుల వాదనపై కుటుంబ సభ్యులు, బంధువులు, రాజకీయ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జగన్ తీరును ఎండగడుతున్నారు. యలహంకలోని ఇంట్లో పెళ్లి చేయడం వల్ల జగన్‌కు ఎలాంటి భద్రతా సమస్య లేదని, ఇల్లు ఇవ్వనంటూ మేనకోడలి పెళ్లికి అభ్యంతరం చెప్పడం వెనుక వేరే కారణాలు ఉన్నాయని బంధువులు అంటున్నారు. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు..
భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య..
సాధారణంగా హైఫై వివాహ వేడుక అంటేనే భారీ భద్రత ఉంటుంది. యలహంకలోని షర్మిల కోసం రాజశేఖరరెడ్డి కట్టించిన ఇంట్లో ఆమె కుమార్తె అంజలి రెడ్డి వివాహానికి బంధువులు, అత్యంత సన్నిహితులు, హైఫై ప్రముఖులను దాదాపు 150 మంది వరకు ఆహ్వానించారు. వారితో జగన్‌కు వచ్చే భద్రతా సమస్య ఏమీలేదు. అయితే వేడుకకు ఏర్పాట్లు చేసే వంటవాళ్లు, డిజైనర్లు వంటి వారి రూపంలో జగన్‌కు సెక్యూరిటీ ముప్పు ఉందన్నది వైసీపీ వారి వాదన. హైఫై వివాహ వేడుకల్లో వంటవాళ్లు, డిజైనర్లను పూర్తిగా భద్రతపరమైన తనిఖీలు చేశాకే పంపిస్తారు. అందులోనూ ఈ పెళ్లికి కర్ణాటక ముఖ్యమంత్రితో పాటు పలువురు వీఐపీలు వస్తుండటంతో పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేస్తారు. వారికి లేని భద్రతా సమస్య జగన్‌కు ఎందుకుంటుందంటూ బంధువులు ప్రశ్నిస్తున్నారు. పైగా ఒకే కాంపౌండ్‌లో జగన్, షర్మిల ఇళ్లు ఉన్నా.. రెండింటికీ వేర్వేరు ప్రహరీలు ఉన్నాయని చెబుతున్నారు.
జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నా..
మాజీ సీఎం జగన్‌కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో ఎలాంటి తీవ్రవాద, ఉగ్రవాద ఘటనలు జరగలేదు. చిన్న గులకరాయి సంఘటన మినహా ఆయనపై ఎలాంటి దాడులూ జరగలేదు. బెదిరింపులూ రాలేదు. ఇప్పటికీ జగన్‌కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది. ఆయన భద్రతకు ఎలాంటి ముప్పులేదని ఉన్నత స్థాయి కమిటీ నివేదిక కూడా ఇచ్చింది.
నాడు వైఎస్ చేశారుగా..
జగన్‌తో పోలిస్తే ఆయన తండ్రి రాజశేఖరరెడ్డికి భద్రత ముప్పు ఎప్పటి నుంచో ఉండేది. ఆయనకు ఫ్యాక్షన్ నేపథ్యం ఉంది. అయితే ఆయన ఏనాడూ ఇలాంటి సాకులు చెప్పలేదు. ఇంట్లోనే కుటుంబ సభ్యుల పెళ్లి చేశారు. ప్రజాక్షేత్రంలో పర్యటించేవారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో ఇంటి ముందు ప్రజాదర్బార్లు పెట్టేవారు. వచ్చినవారితో కరచాలనం చేసి, ఫొటోలు కూడా దిగేవారు. ఎలాంటి తనిఖీలు లేకుండానే ఆయన్ను కలిసేందుకు జనం వెళ్లేవారు. రాజశేఖరరెడ్డికే లేని భద్రతా సమస్య.. ఇంట్లో శుభకార్యం చేసుకుంటే జగన్‌కు ఎందుకుంటుందని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
బంధువులు నచ్చజెప్పినా..
భద్రతా కారణాలను సాకుగా చూపుతూ యలహంకలోని ఇంట్లో మేనకోడలి పెళ్లికి అభ్యంతరం చెప్పడంపై మరీ ఇంత నీచమా అని జగన్‌పై బంధువర్గమే మండిపడుతోంది. తల్లి విజయమ్మతో సహా అత్యంత కీలకమైన సమీప బంధువులు జగన్‌కు నచ్చజెప్పేందుకు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. ఒకవేళ భద్రత విషయంలో జగన్ నిజంగానే భయపడుతుంటే ఒక వారం రోజులు తాడేపల్లి నివాసంలోనో .. హైదరాబాద్ లోటస్ పాండ్‌లోనో గడపాలని చెబుతున్నారు. వివాహ ఆహ్వాన పత్రికలు పంపిన తరువాత జగన్ అడ్డుపుల్ల వేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరి పరామర్శల సంగతేంటి?
చావులు, పరామర్శలకు వెళ్లినపుడు జగన్ భారీ కాన్వాయ్‌తో వెళ్తారు. పోలీసుల భద్రత ఏర్పాటు చేసినా పక్కనపెట్టి సొంత కాన్వాయ్‌తో వేలాదిమందితో ర్యాలీ చేస్తారు. ఆయన ఎక్కడికెళ్లినా కారు ముందు వందలాది మంది అనుచరులు జై జగన్, జై సీఎం అంటూ నినాదాలు చేస్తూ హంగామా చేస్తుంటారు. ఆయన పర్యటనల్లో అనుచరగణం చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఒక్కోసారి ఏం జరుగుతుందో తెలియని గందరగోళ పరిస్థితులు ఉంటాయి. మరి ఇలాంటి సందర్భాల్లో భద్రత ముప్పు రాదా అని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
ఇదీ అసలు కారణం
యలహంకలో 20 ఎకరాల సువిశాల స్థలంలో జగన్, షర్మిల ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. ఇక్కడి షర్మిల నివాసంలోనే నవంబరు 25న ఆమె కుమార్తె అంజలి రెడ్డి వివాహం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఆహ్వానాలు కూడా పంపారు. ముహూర్తం, వేదిక నిర్ణయించాక భద్రత సాకుతో ఇక్కడ పెళ్లి చేయవద్దని జగన్ అభ్యంతరం చెప్పడం వెనుక అసలు కారణం వేరే ఉంది. షర్మిలపై వ్యక్తిగత, రాజకీయ కక్షతో మేనకోడలి పెళ్లికి వచ్చేందుకు ఆయనకు ఇష్టం లేదని బంధువులు అంటున్నారు. ఒకే కాంపాండ్‌లో పక్క ఇంట్లో జరిగే మేనకోడలి పెళ్లికి వెళ్లకపోతే జగన్ అప్రతిష్ఠ మూటగట్టుకుంటారు. ఇంట్లో ఉండి కూడా పెళ్లికి వెళ్లకుంటే తీవ్ర విమర్శలు వస్తాయి. ప్రస్తుతం ఆయన యలహంక ఇంట్లోనే ఉంటున్నారు. అదే మేనకోడలి పెళ్లి వేరే చోట చేస్తే.. తాను వెళ్లకపోయినా ఏవో సాకులు చెప్పవచ్చు. అంతేకానీ భద్రతా సమస్య కానేకాదు. ఇది జగన్ బంధువులు చెబుతున్న మాట.
ఈ వార్తలనూ చదవండి:
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల