Share News

ఆ ఇల్లు నాది!

ABN , Publish Date - Oct 25 , 2026 | 04:10 AM

మేనకోడలి పెళ్లికి అడ్డుపుల్ల వేయడం వెనుక జగన్‌ అసలు గుట్టు రట్టయ్యింది. చెల్లెలు షర్మిలకు రాసిన లేఖలో ఆయన కుట్ర బయటపడింది. బెంగళూరు యలహంకలోని మొత్తం ఆస్తిని కొట్టేసేందుకు వేసిన స్కెచ్‌ వెలుగులోకి వచ్చింది.

ఆ ఇల్లు నాది!

  • షర్మిల ఆస్తి కాజేసేందుకు జగన్‌ కుట్ర బట్టబయలు

  • చెల్లికి రాసిన లేఖతో లోగుట్టు వెలుగులోకి

మేనకోడలి పెళ్లికి అడ్డుపుల్ల వేయడం వెనుక జగన్‌ అసలు గుట్టు రట్టయ్యింది. చెల్లెలు షర్మిలకు రాసిన లేఖలో ఆయన కుట్ర బయటపడింది. బెంగళూరు యలహంకలోని మొత్తం ఆస్తిని కొట్టేసేందుకు వేసిన స్కెచ్‌ వెలుగులోకి వచ్చింది. బెంగళూరులో తండ్రి వైఎస్‌ ఇద్దరికీ చెరొకటి అని కట్టించిన భవంతుల్లో షర్మిలకు చెందిన భవనాన్నీ స్వాహా చేసేందుకు పన్నిన పన్నాగం తేటతెల్లమైంది. ఇద్దరి ఆస్తిని కలిపి ‘నా నివాసం’ అంటూ జగన్‌ రాసిన లేఖ ఆయన దుర్బుద్ధికి నిదర్శనం తప్ప మరోటి కాదని షర్మిల బంధువులు తేల్చిచెబుతున్నారు!

(అమరావతి-ఆంధ్రజ్యోతి): బెంగళూరు యలహంకలోని భవనంలో షర్మిల కుమార్తె వివాహానికి అభ్యంతరం చెబుతూ జగన్‌ రాసిన లేఖలో తన అసలు ఉద్దేశం ఏంటో చెప్పేశారు. పెళ్లికి అడ్డుపుల్లలపై ‘ఆంధ్రజ్యోతి’ సంచలన కథనాలతో వేరే దారిలేక ఆయన రాసిన లేఖను వైసీపీ బయటపెట్టింది. తన భవనంతో పాటు షర్మిల భవనాన్ని కూడా కలుపుకొని జగన్‌ ‘నా నివాసం’ అని ఆ లేఖలో పేర్కొనడంతో ఆయన అసలు నైజం బయటపడింది.

అంటే.. యలహంకలో 20 ఎకరాల్లో ఉన్న మొత్తం ఆస్తిని కాజేసేందుకు కుట్ర చేస్తున్నట్లు స్పష్టమైంది. స్వయానా చెల్లెలు షర్మిల బంధువులు ఇదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యలహంకలోని ఆస్తిని పూర్తిగా కాజేయాలన్న జగన్‌ కుట్ర షర్మిలకు రాసిన లేఖతో బట్టబయలు అయిందని అంటున్నారు. ఇద్దరి ఆస్తిని కలిపి తన ఒక్కడి ఆస్తిగా పేర్కొంటూ జగన్‌ ‘నా నివాసం’ అని లేఖలో రాయడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి బతికున్నప్పుడు ఆర్థికపరమైన కారణాలతో షర్మిల ఇంటిని జగన్‌ భార్య భారతి తల్లి పేరు మీద పెట్టారు.


దీంతో తన అత్తగారి పేరున్న భవనం తనదేనని భావిస్తున్నారని, దీన్ని తన కుమార్తెలు హర్ష, వర్షల పేరు మీదకు మార్చాలని జగన్‌ చూస్తున్నట్లు షర్మిల బంధువులు ఆరోపిస్తున్నారు. అక్కడ షర్మిల కుమార్తె పెళ్లి చేయడానికి జగన్‌ అడ్డు చెప్పడం వెనుక ఇంత పెద్ద కుట్ర ఉందని అంటున్నారు. షర్మిల కుమార్తె పెళ్లికి బంధువులతో పాటు ముఖ్యమంత్రులు, ఇతర వీఐపీలు వస్తారు. వివాహానికి వచ్చినవారందరూ ఆ భవనాన్ని షర్మిల వాటాగా గుర్తిస్తారు. దీంతో రేప్పొద్దున జగన్‌ దౌర్జన్యంగా ఆ భవనాన్ని లాక్కోవడం కష్టం. ఈ విషయం బయటకు తెలిస్తే ఆ భవనం షర్మిలది కదా అని వీఐపీలు, బంధుమిత్రులు ప్రశ్నిస్తారు. దీంతో తన పథకం పారదని, ఆ భవనాన్ని కాజేయడం సాధ్యం కాదని జగన్‌ భావించే వివాహ వేడుకకు వాడుకోవడానికి నిరాకరిస్తున్నారని బంధువులు చెబుతున్నారు.

భద్రతపై భయమెందుకు?

దేశంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే రాష్ట్రపతి భవన్‌, ప్రధాని నివాసాల సందర్శనకు జాతీయ వేడుకల సందర్భంగా సామాన్యులను సైతం అనుమతిస్తారు. రాష్ట్రపతి భవన్‌లో కీలక ప్రాంతాల్లో మినహా ప్రాంగణంలో సందర్శకులు ఫొటోలు కూడా తీసుకుంటారు. హైదరాబాద్‌కు ఏటా శీతాకాల విడిదికి రాష్ట్రపతి వచ్చినప్పుడు ప్రజలు కలిసేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లూ చేస్తారు. అలాంటిది.. మాజీ సీఎం జగన్‌ నివాస ప్రాంగణం, చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటికి వెళ్తే ఆయన భద్రతకు సమస్య ఏంటి? దేశంలో అత్యున్నత పదవుల్లో ఉన్న రాష్ట్రపతి, ప్రధానికి లేని భద్రతా భయం జగన్‌కు ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు. జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి ఉగ్రవాద, తీవ్రవాద సంఘటనలు రాష్ట్రంలో జరగలేదు. గులకరాయి సంఘటన మినహా ఆయనపై ఎలాంటి దాడులూ జరగలేదు. బెదిరింపులు కూడా రాలేదు. జగన్‌కు ఎలాంటి భద్రతాపరమైన ముప్పు లేదని ఉన్నత స్థాయి అధికారుల కమిటీ నివేదిక కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో జగన్‌ చెబుతున్న కారణాలన్నీ ఒట్టి సాకులేనని అంటున్నారు.


లోటస్‌పాండ్‌లో చేస్తే ముప్పులేదా?

యలహంకలోని భవనానికి బదులుగా వివాహ వేడుకకు హైదరాబాద్‌లోని తన లోట్‌సపాండ్‌ ఆస్తి వాడుకోవాలని జగన్‌ లేఖలో పేర్కొనడంపైనా బంధువుల నుంచి పలు ప్రశ్నలు వస్తున్నాయి. జగన్‌కు తాడేపల్లితో పాటు హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌, బెంగళూరు యలహంక, ఇడుపులపాయలో భారీ భవంతులు ఉన్నాయి. యలహంకలోని షర్మిల ఇంట్లో మేనకోడలి వివాహం చేస్తే భద్రతా సమస్యలు వచ్చినపుడు.. మరి ఆయన సూచించినట్టుగా లోటస్‌పాండ్‌లో చేస్తే భద్రతా ముప్పు ఉండదా? అని ప్రశ్నిస్తున్నారు. తన గోప్యతకు ముప్పు ఏర్పడుతుందని, అందరి దృష్టి తన భవనంపై పడుతుందని జగన్‌ చెప్పడాన్నీ తప్పుపడుతున్నారు. ఇది జగన్‌ నివాసం అని అందరికీ తెలియడం వల్ల ఆయనకు వచ్చే నష్టం ఏంటి? ఆయన ఏమైనా మాఫియానా? లేక తీవ్రవాదా? సీఎంలు, మాజీ సీఎంల నివాసాలు అందరికీ తెలుసుకదా? ఇది తన ఇల్లు అన్ని చెప్పుకోవడానికి జగన్‌ సిగ్గుపడాల్సిన పని ఏముంది? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

అంత రహస్యం ఎందుకు?

తన నివాసం ఫొటోలు, వీడియోలు బయటికి వస్తాయని జగన్‌ గగ్గోలు పెట్టడంపైనా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఉగ్రవాదులు, తీవ్రవాదులు, మాఫియా స్థావరాలు ఉండే ‘డెన్‌’లను రహస్యంగా నిర్వహిస్తారు. డెన్‌లోకి ప్రవేశించాలంటే అడుగడుగునా ఆంక్షలు ఉంటాయి. ఓ మాజీ ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న భవనం గురించి అంత రహస్యం ఎందుకు? ఓ పార్టీ అధినేత, మాజీ సీఎం ఉన్న చోటకు ఎంతో మంది వెళ్తారు కదా? తన మేనకోడలి పెళ్లికి షర్మిల భవనం వాడుకోవడానికి వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను చూస్తే ఆయన నివాస భవనం ఏమైనా డెన్నా? జగన్‌లో ఇంత అభద్రతా భావం ఎందుకు? షర్మిల ఆస్తి కాజేసేందుకు జగన్‌ చేస్తున కుట్ర తప్ప ఆయన వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు సహేతుకంగా లేవని అంటున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

కానరాని ఎన్నికల సందడి

భీతావహం

Updated Date - Oct 25 , 2026 | 04:10 AM