భీతావహం
ABN , Publish Date - Oct 25 , 2026 | 01:23 AM
ఒకచోట చేయి...మరోచోట కాలు, ఇంకోచోట మొండెం...ఇలా ఎక్కడ చూసినా మాంసపు ముద్దలే.
అల్లూరి జిల్లా అనంతగిరి మండలం పీచుమామిడి వద్ద పేలుడు
ఏడుగురి దుర్మరణం
మృతుల్లో ఒకరు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, మిగిలినవారు రోడ్డు కాంట్రాక్టు సంస్థ సిబ్బంది
తునాతునకలైన మృతదేహాలు
ఇద్దరి సజీవ దహనం
అనంతగిరి/దేవరాపల్లి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి):
ఒకచోట చేయి...మరోచోట కాలు, ఇంకోచోట మొండెం...ఇలా ఎక్కడ చూసినా మాంసపు ముద్దలే. చుట్టూ భయానక వాతావరణమే...అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ పీచుమామిడి గ్రామ సమీపాన శనివారం జరిగిన పేలుడు మిగిల్చిన విషాదమిది.
అనంతగిరి మండలం పినకోట పంచాయతీ పరిధిలోని బల్లగరువు నుంచి తునిసీబు వరకూ రోడ్డు నిర్మాణానికి ఉపయోగించే టిప్పర్‌కు డీజిల్ పంపింగ్ చేస్తుండగా సంభవించిన పేలుడులో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ముగ్గురు సజీవ దహనం కాగా, వేర్వేరు ప్రదేశాల్లో ఇద్దరి మాంసపు ముద్దలు, వంద మీటర్ల దూరంలో మహిళా ఉపాధ్యాయురాలి మృతదేహం లభ్యమయ్యాయి. మరొకరి మృతదేహం కనిపించలేదు. పేలుడు ధాటికి ఆ ప్రదేశానికి ఎవరూ వెళ్లలేకపోయారు.
ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం
పీచుమామిడి గ్రామ సమీపాన జరిగిన పేలుడులో మృతి చెందిన ఏడుగురి కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ టి.నిషాంతి ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున కాంట్రాక్టర్ ద్వారా నష్టపరిహారాన్ని అందిస్తామని, భవిష్యత్తులో బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. పీచుమామిడిలో జరిగిన పేలుడులో ఏడుగురు మృతి చెందడం దురదృష్టకరమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సంధ్యారాణి అన్నారు. శనివారం ఆమె అరకులోయలో విలేకరులతో మాట్లాడుతూ ఈ దుర్ఘటన తెలిసిన వెంటనే పీచుమామిడికి బయలుదేరానని, పోలీస్ క్లియరెన్స్ లేకపోవడం, మృతదేహాలను అరకులోయ ఆస్పత్రికి తరలిస్తారని చెప్పడంతో ఇక్కడకు వచ్చానన్నారు. అయితే పీచుమామిడి ప్రాంతం అనకాపల్లికి దగ్గరవుతుందని అక్కడకు మృతదేహాలను తరలించారన్నారు. ప్రమాదంలో మృతిచెందిన టీచర్ ఇటీవల జరిగిన డీఎస్సీలో ఎంపికై విధుల్లో చేరారన్నారు.
ఇలా జరుగుతుందని అనుకోలేదు
- కన్నీరుమున్నీరైన ఇద్దరు టీచర్లు
దేవరాపల్లి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి) అనంతగిరి మండలం మాడ్రేబు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు జాగరపు సునీత, టి.స్వాతి, దాయర్తిలో పనిచేస్తున్న జి.మాధురి రోజూ దేవరాపల్లి నుంచి రాకపోకలు సాగించేందుకు ద్విచక్ర వాహనదారులకు నెలవారీ కొంత మొత్తాన్ని చెల్లిస్తారు. అయితే శనివారం విశాఖ నగరంలోని విశాలాక్షి నగర్ నుంచి ముందుగా వచ్చిన సునీత ద్విచక్ర వాహనదారుని కోసం దేవరాపల్లిలో వేచి ఉన్నారు. ఆ సమయంలో వ్యాన్ (బొలేరో) రావడంతో ఆమె అందులో ఎక్కి పీచుమామిడి గ్రామంలో దిగారు. అక్కడ నుంచి ద్విచక్ర వాహనదారుడికి ఫోన్ చేస్తూ వెళుతుండగా ఈలోగా పేలుడు సంభవించడంతో మృతి చెందారు. రోజూ ఆమెతోపాటు వెళ్లే స్వాతి, మాధురి శనివారం అరగంట ఆలస్యంగా వచ్చారు. దీంతో వారి ప్రాణాలు దక్కాయి. ప్రమాదంలో తమ తోటి ఉపాధ్యాయిని మృతిచెందడం కలచి వేసిందని వారు కన్నీరుమున్నీరయ్యారు.
తమ్ముడిని కోల్పోయిన అన్న
బిహార్‌కు చెందిన హుస్సేన్, చంద్రవంశీసింగ్ అన్నదమ్ములు. వీరిద్దరూ రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నారు. పేలుడు ఘటనలో తమ్ముడు చంద్రవంశీసింగ్ మృతిచెందాడు. సోదరుడి మృతదేహం లభ్యం కాకపోవడంతో హుస్సేన్ తల్లడిల్లిపోయాడు.
పెద్ద దిక్కును కోల్పోయారు
- దిక్కుతోచని స్థితిలో డ్రైవర్ కుటుంబం
పెదబయలు: మండలం అడుగులపుట్టు పంచాయతీ జంగంపుట్టు గ్రామానికి చెందిన పాంగి చిరంజీవి అలియస్ చిరు (30) పేలుడు ఘటనలో మృతి చెందడంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. చిరంజీవికి తల్లి, తండ్రితోపాటు నాగమ్మ, మంగమ్మ, చంద్రకళ ముగ్గురు భార్యలు. అభిరామ్, అజీత్, సాయిపల్లవి, అరవింద్, యశ్వంత్, చిన్నపాపతో కలిపి ఆరుగురు పిల్లలు ఉన్నారు. కుటుంబానికి పెద్దదిక్కు అయిన చిరంజీవి మృతి చెందడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది.
ఎస్‌ఎన్‌పురం కాలనీలో విషాదఛాయలు
చీడికాడ: మండలంలోని ఎస్‌ఎన్‌పురం కాలనీకి చెందిన మండల నారాయణరావు పదేళ్లుగా కాంట్రాక్టర్ వద్ద సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య రాజేశ్వరి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మృతితో కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. ఎస్‌ఎన్‌పురం కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి.
వ్యాన్ ఎక్కి మృత్యువాత
దేవరాపల్లికి చెందిన మన్యాల మణికంఠ ట్రాక్టర్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతను సొంత వాహనాన్ని విడిచి వ్యాన్ ఎక్కడంతో మృత్యువాత పడ్డాడు. ద్విచక్ర వాహనంపై బయలుదేరి వెనుక వచ్చిన వ్యాన్ ఎక్కడంతో ఇలా జరిగిందని అతని యర్నమ్మ విలపించింది.