కానరాని ఎన్నికల సందడి
ABN , Publish Date - Oct 25 , 2026 | 01:27 AM
స్థానిక సంస్థల ఎన్నికలు అంటే హడావిడి, హంగామా కాస్త ఎక్కువగానే ఉంటాయి.
గ్రేటర్‌లో వేడెక్కని రాజకీయం
ప్రజల్లో కనిపించని ఆసక్తి
సాధారణంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి స్థానిక ఎన్నికల్లో అనుకూల వాతావరణం ఉంటుందని అత్యధికుల భావన
ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న అభ్యర్థుల ప్రచారం
విశాఖపట్నం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి):
స్థానిక సంస్థల ఎన్నికలు అంటే హడావిడి, హంగామా కాస్త ఎక్కువగానే ఉంటాయి. కానీ, ఈసారి నగరంలో అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. పోలింగ్‌కు మరో వారం రోజులు మాత్రమే సమయం ఉంది. అభ్యర్థులు ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తించాలి. ప్రజల్లో కూడా ఎన్నికలపై విస్తృతంగా చర్చ జరగాలి. అయితే క్షేత్రస్థాయిలో అటువంటి వాతావరణం కానరావడం లేదు. ఒకటి, రెండు రోజులు నుంచి మాత్రమే అభ్యర్థులు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇంకా ఊపందుకోలేదు. మరోవైపు ప్రజలు కూడా ఈ ఎన్నికలను పెద్ద సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపించడం లేదు.
మెజారిటీ ప్రజల ఆలోచన ఇలా..
సాధారణంగా ఎన్నికలు అంటే టీ, టిఫిన్ దుకాణాలు, పార్కులు...ఇలా పది మంది కలిసేచోట విస్తృతంగా చర్చలు జరుగుతుంటాయి. కానీ, ఈసారి అటువంటివేమీ లేవు. ఎవరు గెలిచినా ఒకటే అన్న ఆలోచనలో మెజారిటీ ప్రజలు ఉండడం కారణంగా తెలుస్తోంది. అదేవిధంగా స్థానిక ఎన్నికలు ఎప్పుడూ అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటాయి కదా?...వాటి గురించి చర్చించడం ఎందుకన్న భావనలో మరికొందరు ఉన్నారు. ఇదే అభిప్రాయాన్ని ఆటో డ్రైవర్‌గా చేస్తున్న రాజు అనే యువకుడు వ్యక్తం చేశాడు. గ్రేటర్ పరిధిలో కూటమి బలంగా ఉందని, కాబట్టి, ఇక్కడ పోటీ పెద్దగా ఉండే అవకాశం లేదని పేర్కొన్నాడు. ‘ఎన్నికలు గురించి బుర్ర చించుకుని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరు గెలిచినా ఒకటే. సమయం వృథా తప్ప ప్రయోజనం లేదు. ఎన్నికల రోజు నచ్చిన వ్యక్తికి ఓటేసి సైలెంట్‌గా ఉండడం మంచిది. నాయకులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియడం లేదు. అటువంటి వారి గురించి ఆలోచన అవసరం’ అంటూ మద్దిలపాలెంలో టిఫిన్ దుకాణం నిర్వహించే ఓ యువకుడు పేర్కొన్నాడు. జీవీఎంసీ పరిధిలో ఇరు పార్టీల మధ్య గట్టి పోటీ 50కు మించి వార్డుల్లో ఉండదని లక్ష్మణరావు అనే యవకుడు అభిప్రాయపడ్డాడు. ఎన్నికల్లో ఎవరు గెలిచినా అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని శ్రావణి భార్గవి అనే గృహిణి పేర్కొన్నారు. ఏ పార్టీ అయినా మంచి వారిని గెలిపించడం ద్వారా నగర అభివృద్ధి జరుగుతుందని ఆమె విశ్వసించారు. ఎన్నికలకు మూడు రోజులు ముందు నుంచీ హడావిడి ఉండే అవకాశముందని, ఇప్పుడిప్పుడే తమ వార్డులో ప్రచారానికి వస్తున్నారని శివాజీ అనే యువకుడు తెలిపాడు. ఎన్నికలు జరుగుతున్న వాతావరణమే కనిపించడం లేదని, అసలు ఎన్నికలు ఎప్పుడన్న విషయం కూడా అర్థం కావడం లేదని సీతమ్మధారకు చెందిన లక్ష్మీ కల్యాణి అనే ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి స్థానిక ఎన్నికల్లో పట్టం కట్టడం ఆనవాయితీగా వస్తోందని, గతంలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ గెలిచిందని, ఇప్పుడు కూటమి అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉందని శివ అనే మెకానిక్ వెల్లడించారు. అయితే, పోటీ ఎలా ఉంటుందన్న విషయం రెండు, మూడు రోజులు తరువాత తెలుస్తుందని పేర్కొన్నారు.
డబ్బు ప్రాల్యం..
ఈ ఎన్నికల్లో డబ్బు ప్రాబల్యం అధికంగా ఉండే అవకాశముందని పలువురు పేర్కొంటున్నారు. ఎన్నికలకు ఒకటి, రెండు రోజుల ముందు అభ్యర్థుల వ్యూహాలు, పంపిణీ చేసే డబ్బులు, ఇతర అంశాలను బట్టి అక్కడక్కడా ఫలితాలు మారే అవకాశం లేకపోలేదని ప్రైవేటు టీచర్‌గా పనిచేస్తున్న సత్యవతి పేర్కొన్నారు. ఎన్నికలు దగ్గరపడేంత వరకు ప్రచారాన్ని సాధారణంగానే నిర్వహిస్తారని, ప్రస్తుతం వేడి కనిపించకపోవడానికి అభ్యర్థుల తెర వెనుక వ్యూహాలు, ఆర్థిక అంశాలు కారణమవుతున్నాయని రాజేంద్ర అనే ఫార్మా ఉద్యోగి తెలిపారు.
ముగిసిన ప్రాదేశిక నామినేషన్ల పరిశీలన
జడ్పీటీసీ స్థానాల్లో ఒకటి తిరస్కృతి...46 సక్రమం
ఎంపీటీసీ స్ధానాలకు 14 నామినేషన్లు తిరస్కరణ...355 సక్రమం
విశాఖపట్నం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీసీటీ స్థానాలకు అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన శనివారం ముగిసింది. ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ వేసిన నామినేషన్లను తొలగించారు. ఇంకా భీమిలి స్థానానికి జనసేన నుంచి నక్కా జ్యోతి వేసిన నామినేషన్‌ను తిరస్కరించారు. జడ్పీటీసీగా పోటీ చేయాలంటే సంబంధిత మండల పరిధిలోని ఏదైనా గ్రామ పంచాయతీలో ఓటరుగా ఉండాలి. జ్యోతి తాటితూరు గ్రామ పంచాయతీలో ఓటరుగా ఉన్నట్టు నామినేషన్‌లో పేర్కొన్నారు. అయితే ఆమె ఓటు జాబితాలో లేకపోవడంతో అధికారులు ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు. మొత్తం నాలుగు జడ్పీటీసీ స్థానాలకు 46 మంది నామినేషన్లు సక్రమంగా ఉన్నట్టు రిటర్నింగ్ అధికారి నారాయణమూర్తి తెలిపారు. ఆనందపురంలో 16 మంది, భీమిలిలో ఆరుగురు, పద్మనాభంలొ పది మంది, పెందుర్తిలో 14 మంది నామినేషన్లు సక్రమంగా ఉన్నాయన్నారు. ఆనందపురానికి టీడీపీ నుంచి ఏడుగురు, వైసీపీ నుంచి ఆరుగురు, జనసేన, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ నుంచి ఒకరు, భీమిలిలో టీడీపీ, వైసీపీ, జనసేన నుంచి ఇద్దరేసి, పద్మనాభంలో టీడీపీ నుంచి నలుగురు, వైసీపీ నుంచి ముగ్గురు, జనసేన నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు, పెందుర్తిలో టీడీపీ నుంచి ఆరుగురు, జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ, వైసీపీ నుంచి ఇద్దరేసి, కాంగ్రెస్ నుంచి ఒకరు నామినేషన్ వేశారు.
ఎంపీటీసీ స్థానాలకు 14 నామినేషన్లు తిరస్కరణ
జిల్లాలో 53 ఎంపీటీసీ స్థానాలకుగాను 369 నామినేషన్లు దాఖలు కాగా 14 నామినేషన్లును తిరస్కరించారు. పద్మనాభం మండలం బాందేవపురం ఎంపీటీసీ స్థానానికి వైసీపీ నుంచి నామినేషన్ దాఖలుచేసిన బి.వెంకటలక్ష్మి కుల ధ్రువీకరణపత్రం సమర్పించకపోవడంతో నామినేషన్ తిరస్కరించారు. పెందుర్తి, భీమిలి, ఆనందపురంలో ఒక్కొక్కరు ఒకటి కంటే ఎక్కువగా వేసిన నామినేషన్లను తిరస్కరించారు. పరిశీలన అనంతరం ఆనందపురం మండలంలో 128, భీమిలి మండలంలో 64, పద్మనాభం మండలంలో 99, పెందుర్తి మండలంలో 64...మొత్తం 355 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్టు అధికారులు ప్రకటించారు.
పరిషత్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్
విశాఖపట్నం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో వచ్చే నెల మూడో తేదీన జరగనున్న మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా, నిబంధనల మేరకు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని అధికారులను కలెక్టర్, ఎన్నికల అధికారి ఎం.అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా శనివారం పద్మనాభం మండలాన్ని సందర్శించిన ఆయన ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లు స్ర్కూట్నీ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం పద్మనాభంలో ఏర్పాట్లు చేస్తున్న పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలు, స్ర్టాంగ్ రూమ్‌లను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించాలని, ఎన్నికల సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను భద్రపరిచే స్ర్టాంగ్ రూమ్‌లు వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వరాదని అధికారులకు సూచించారు. పర్యటనలో జిల్లా పరిషత్ సీఈవో నారాయణమూర్తి, ఏసీపీ అప్పలరాజు, మండల స్పెషల్ ఆఫీసర్, స్థానిక అధికారులు పాల్గొన్నారు.
నేడు జీవీఎంసీ అభ్యర్థుల తుదిజాబితా
విశాఖపట్నం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్, కార్పొరేటర్ పదవులకు పోటీలో నిలిచిన అభ్యర్థుల తుదిజాబితాను ఎన్నికల అధికారి, కలెక్టర్ అభిషిక్త్‌కిశోర్, కమిషనర్ కేతన్‌గార్గ్ ఆదివారం విడుదల చేయనున్నారు. మేయర్ పదవికి 27 మంది నామినేషన్లు దాఖలు చేయగా వారిలో నాలుగు నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. మరో ఎనిమిది మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అలాగే 120 వార్డులకు 1,672 మంది నామినేషన్లు దాఖలుచేయగా వారిలో 49 మంది నామినేషన్లను అధికారులు వివిధ కారణాలతో తిరస్కరించారు. దీంతో 1,623 నామినేషన్లు ఆమోదం పొందగా వారిలో కొందరు ఈనెల 21న తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అభ్యర్థుల తుదిజాబితాను కూడా అదేరోజు విడుదల చేయాల్సి ఉంది. అయితే న్యాయస్థానం జోక్యంతో ఈనెల 25 వరకు విడుదల చేయవద్దని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అభ్యర్థుల తుదిజాబితా ఆదివారం విడుదల చేయనుండడంతో బ్యాలెట్ పేపర్ల ముద్రణ కూడా ప్రారంభం కానున్నది.