ఆ న్యాయవాది ఒక్కరే కనిపించారా?
ABN , Publish Date - Sep 18 , 2026 | 04:07 AM
మద్యం కుంభకోణం తదితర కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రాకు నిబంధనలకు విరుద్ధంగా భారీ మొత్తంలో ప్రొఫెషనల్ ఫీజు చెల్లించారని ఆరోపిస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై గురువారం హైకోర్టు విచారణ జరిపింది.
ఏళ్ల తరబడి ఎంతో మందికి ఫీజులు చెల్లిస్తున్నారు కదా
ఆ చెల్లింపుల గురించి ఎందుకు ప్రస్తావించలేదు?
సిద్ధార్థ్ లూథ్రాకు చెల్లింపులపై వ్యాజ్యం వేసిన పిటిషనర్‌కు హైకోర్టు సూటి ప్రశ్న
అమరావతి, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం తదితర కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రాకు నిబంధనలకు విరుద్ధంగా భారీ మొత్తంలో ప్రొఫెషనల్ ఫీజు చెల్లించారని ఆరోపిస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. న్యాయవాదులకు ఫీజు చెల్లింపు విషయంలో ఏపీ హైకోర్టుతో పాటు వివిధ కోర్టులు ఇప్పటికే స్పష్టమైన తీర్పులు ఇచ్చాయని ధర్మాసనం గుర్తు చేసింది. వాటిని అధ్యయనం చేసి కోర్టు ముందు ఉంచాలని ఇరుపక్షాల న్యాయవాదులకు సూచించింది. ‘‘పిటిషనర్‌కు కేవలం సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రానే ఎందుకు కనిపించారు? న్యాయవాదులకు ఫీజులు చెల్లించడం ఇది మొదటిసారి కాదు కదా? ఏళ్ల తరబడి ఎంతోమందికి ఫీజులు చెల్లించారు.
ఆ చెల్లింపుల గురించి వ్యాజ్యంలో ఎందుకు ప్రస్తావించలేదు?’’ అని పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్‌ను ప్రశ్నించింది. విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. వివిధ కేసుల్లో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన లూథ్రాకు ప్రొఫెషనల్ ఫీజు కింద రెండేళ్ల కాలంలో ప్రభుత్వ ఖజానా నుండి రూ.15.80 కోట్లు చెల్లించారని ఆరోపిస్తూ విజయవాడకు చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి వేము కొండలరావు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గురువారం విచారణకు వచ్చింది. అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు.
ఈ వార్తలనూ చదవండి: