ఆస్తి కోసం వృద్ధ దంపతులపై కొడుకు, మనవళ్ల దారుణం
ABN , Publish Date - May 18 , 2026 | 04:35 PM
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం కొత్తాటలో దారుణం జరిగింది. ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను కొడుకు తీవ్రంగా కొట్టాడు.
పశ్చిమగోదావరి, మే 18: మొగల్తూరు మండలం కొత్తాటలో దారుణం జరిగింది. ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను కొడుకు, మనవళ్లు కలిసి తీవ్రంగా కొట్టారు. వృద్ధులను హింసిస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. గ్రామానికి చెందిన కొప్పనాతి సూర్యనారాయణ, కస్తూరి దంపతులకు ఒక కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొద్దిరోజులుగా ఆస్తి కోసం కొడుకు ముత్యాలరాజు, మనవళ్లు కలిసి సూర్యనారాయణ దంపతులను వేధింపులకు గురిచేస్తున్నారు. ఆఖరికి కన్న తల్లిదండ్రులని చూడకుండా ముత్యాలరాజు.. వారిపై దాడికి తెగబడ్డాడు. ముత్యాలరాజుతో పాటు అతడి ఇద్దరు కొడుకులు రాధాకృష్ణ, శేఖర్ కూడా వృద్ధులనే కనికరం లేకుండా కాళ్లతో తన్నుతూ విచక్షణారహితంగా దాడి చేశారు.
కొడుకు, మనవళ్ల దాడిలో వృద్ధ దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. వృద్ధులపై దాడి దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవగా.. వాటిని కూడా ధ్వంసం చేశారు. తీవ్రగాయాలతో వృద్ధులు నర్సాపురం హాస్పటల్‌లో చికిత్స పొందుతున్నారు. తల్లిదండ్రులపై జరిగిన దాడిని తెలుసుకున్న కూతుళ్లు పద్మావతి, లక్ష్మీ.. వెంటనే భీమవరం ఎస్పీ అద్నాన్ నయీంకి ఫిర్యాదు చేశారు. తమ తల్లిదండ్రులను సోదరుడు ముత్యాలరాజు, వారి ఇద్దరు కుమారులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే వృద్ధ దంపతులపై దాడి చేసిన ఆ ముగ్గురిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి...
జైళ్ల శాఖలో ప్రక్షాళన చేపడతాం: హోం మంత్రి అనిత
జూన్ 1 నుంచి కాలువల్లోకి సాగునీరు.. మంత్రుల ప్రకటన
Read Latest AP News And Telugu News