Share News

దళితుల జోలికి వస్తే ఉరుకోం.. ఆకివీడు రామాలయం అంశంపై మందకృష్ణ మాదిగ..

ABN , Publish Date - May 02 , 2026 | 05:53 PM

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెద్ద పేట రామాలయం అంశంపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ స్పందించారు. దళిత వర్గాలకు చెందిన వారిని ఎవరు ఇబ్బంది పెట్టినా, ఆత్మ గౌరవం దెబ్బ తీసేలా వ్యవహరించినా ఉరుకునేది లేదని తేల్చి చెప్పారు.

దళితుల జోలికి వస్తే ఉరుకోం.. ఆకివీడు రామాలయం అంశంపై మందకృష్ణ మాదిగ..
Manda Krishna Madiga

పశ్చిమ గోదావరి: ఆకివీడు పెద్ద పేట రామాలయం అంశంపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ స్పందించారు. దళిత వర్గాలకు చెందిన వారిని ఎవరు ఇబ్బంది పెట్టినా, ఆత్మ గౌరవం దెబ్బ తీసేలా వ్యవహరించినా ఉరుకునేది లేదని తేల్చి చెప్పారు. తమపై దాడి చేసే వాళ్లు ఏ స్థాయి వారైనా సరే ఉమ్మడిగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. ఆకివీడు దళితవాడలోని గుడి విషయంలో కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నట్లు కృష్ణ మాదిగ తెలిపారు. అక్కడ గొంతేనమ్మ గుడి, గ్రామ సావిడి, రామాలయం ఉందా? అనే అంశంలో న్యాయస్థానం తుది నిర్ణయం కోసం వేచి చూస్తున్నట్లు పేర్కొన్నారు.


ఈ వివాదమంతా ఉండి ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చుట్టూ తిరుగుతోందన్నారు. ఈ కూటమి ప్రభుత్వ గెలుపులో తాము ప్రధాన భాగస్వాములుగా ఉన్నామని మందకృష్ణ గుర్తు చేశారు. రామాలయం వివాదాన్ని తానే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరకు తీసుకెళ్తానని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్‌గా మాట్లాడే మాటలు.. రఘురామ ఉన్న పార్టీకి మేలు చేయాలే తప్ప కీడు చేయకూడదని పేర్కొన్నారు.

రాజ్యాంగబద్ధ పదవిలో రఘురామ ఉన్నారని.. ఆయన వ్యాఖ్యలు దళిత సమాజాన్ని పార్టీకి, ప్రభుత్వానికి దూరం చేసేవిగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా దళితులను అవమానించే విధంగా డిప్యూటీ స్పీకర్ వ్యాఖ్యలు ఉన్నాయని మందకృష్ణ ఆగ్రహించారు.


ఈ వార్తలు కూడా చదవండి

అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. క్వాంటం వ్యాలీలో ట్విన్ టవర్లకు గ్రీన్ సిగ్నల్

స్వచ్ఛ రథాలకు నేచురల్ స్టార్ నాని సహాయం.. స్పందించిన డిప్యూటీ సీఎంవో..

Updated Date - May 02 , 2026 | 05:56 PM