గురువులపై దాడి చేసిన ఏ ఒక్కరినీ వదలిపెట్టం
ABN , Publish Date - Sep 26 , 2026 | 06:22 AM
విజయవాడలో డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులపై దాడులకు పాల్పడిన ఏ ఒక్కరినీ వదలి పెట్టే ప్రసక్తి లేదని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత తెలిపారు.
జగన్ కుట్రలను అడ్డుకుంటాం
త్వరలో 2050 పోలీసు పోస్టుల భర్తీ: మంత్రి సవిత
బుక్కరాయసముద్రం, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): విజయవాడలో డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులపై దాడులకు పాల్పడిన ఏ ఒక్కరినీ వదలి పెట్టే ప్రసక్తి లేదని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత తెలిపారు. ఇప్పటికే పలువురిని గుర్తించామని, చట్టాన్ని ఉల్లంఘించేవారు ఎవరైనా సరే చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ప్రభుత్వం ఉపేక్షించదని అన్నారు. గొడ్డలి పార్టీకి ప్రజలు, పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం లేదని విమర్శించారు. వైసీపీ హయంలో ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టారని గుర్తు చేశారు. రాష్ట్రంలో రౌడీలు, గుండాలతో దాడుల చేయించేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని, వాటిని సమర్ధవంతంగా అడ్డుకుంటాని చెప్పారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదన్నారు.
అనంతపురం జిల్లాలోని జంతులూరు వద్ద ఉన్న ఏపీఎస్పీ 14 పోలీసు బెటాలియన్‌లో 2025-26 బ్యాచ్‌కు చెందిన 187 మంది కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్ శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి సవిత ముఖ్య అతిథిగా హజరయ్యారు. బెటాలియన్ కమాండెంట్ ప్రభు కుమార్ అధ్వర్యంలో మంత్రి సవిత, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణీశ్రీకి కొత్త కానిస్టేబుళ్లు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పోలీసు శాఖలో త్వరలోనే 2,050 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. త్వరలోనే మరో డీఎస్సీ నిర్వహిస్తామన్నారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. వైసీపీ హయాంలో శిక్షణలో కానిస్టేబుళ్లకు స్టైపెండ్ రూ.4500 ఇచ్చేదని, ఈ మొత్తాన్ని సీఎం చంద్రబాబు రూ.12,500కు పెంచారని తెలిపారు. కానిస్టేబుల్ నుంచి డీజీపీ స్థాయి వరుకు రూ.40 లక్షల నుంచి రూ.45 లక్షల వరుకు బీమా సౌకర్యం కల్పించామని తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి..
ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్
హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ