Share News

మత్స్యకారుడిని మింగేసిన కెరటం

ABN , Publish Date - May 02 , 2026 | 12:16 AM

ఎప్పటిలాగే వారంతా చేపల వేటకు పడవపై సముద్రంలోకి వెళ్లారు. కొంతదూరం వెళ్లేసరికి ఓ రాకాసి కెరటం ఉవ్వెత్తున ఎగసి పడవను బలంగా తాకడంతో ఒక్కసారిగా బోల్తాపడింది.

మత్స్యకారుడిని మింగేసిన కెరటం
Fishermen Tragedy

  • సముద్రంలో పడవ బోల్తా

  • ఒకరి మృతి.. ముగ్గురు క్షేమం

  • తమ్మయ్యపాలెం తీరంలో ఘటన

పూసపాటిరేగ, మే 1(ఆంధ్రజ్యోతి): ఎప్పటిలాగే వారంతా చేపల వేటకు పడవపై సముద్రంలోకి వెళ్లారు. కొంతదూరం వెళ్లేసరికి ఓ రాకాసి కెరటం ఉవ్వెత్తున ఎగసి పడవను బలంగా తాకడంతో ఒక్కసారిగా బోల్తాపడింది. అందులో ఉన్నవారంతా చెల్లాచెదురుగా సముద్రంలోకి పడిపోయారు. ఓ మత్స్యకారుడు మృతి చెందగా, మిగతా ముగ్గురు క్షేమంగా తీరానికి చేరుకున్నారు. ఈ ఘటన తమ్మయ్యపాలెం తీరంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, మత్స్యకారుల వివరాల మేరకు.. పూసపాటిరేగ మండలం పతివాడ పంచాయతీ తమ్మయ్యపాలెం గ్రామానికి చెందిన వాసుపల్లి ఎల్లయ్య(49)తో పాటు మరో ముగ్గురు మత్స్యకారులు మంగళవారం వేకువజామున 5 గంటలకు పడవపై సముద్రం మీదికి చేపల వేటకు వెళ్లారు. అయితే, కొంతసేపటికే పెద్ద కెరటం పడవను తాకడంతో బోల్తా కొట్టింది. ఎల్లయ్యతో పాటు మిగతా ముగ్గురు కూడా నీటిలో పడిపోయారు. ఎల్లయ్య గల్లంతు కావడంతో కాసేపు ఆయన కోసం గాలించారు. ఎలాంటి జాడ లేకపోవడంతో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఉదయం 11 గంటల సమయంలో చింతపల్లి సముద్ర తీరానికి ఎల్లయ్య మృతదేహం కొట్టుకొచ్చింది. మృతుడికి భార్య దుర్గమ్మతోపాటు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ పెద్ద మృతి చెందడంతో తమకు దిక్కెవరంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్థానిక ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - May 02 , 2026 | 08:31 AM